”ప్రజలెప్పుడైతే తమ హక్కుల కోసం గొంతెత్తుతారో తమ అధికారం కోసం నిలదీస్తారో, అప్పుడే వారిని మత పిచ్చిలోకి తోసెయ్యాలి!” – నెపోలియన్.
ఎప్పుడెప్పుడు ధార్మికత రాజనీతితో జతకూడు తుందో, అప్పుడప్పుడు ద్వేషం గొప్ప మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. దేశంలో అంధభక్తులు ఎలా తయారయ్యారంటే – ఏదైన మంచి విషయం జరిగినప్పుడు మీరు వారికీ ‘కాంగ్రేచులేషన్స్’ చెప్పారనుకోండి. అది వారికి అర్థం కాదు, పైగా కోపం తెచ్చుకుని – ‘బాజ్‌పాలేషన్స్’ చెప్పాలంటారు. కాంగ్రేచు – అంటే ఆ పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిది అని అనుకుంటారు. గత పదకొండేండ్లలో పేడ- అనేది ఒక ఆల్ రౌండర్ పదార్థం అయిపోయింది. పొలంలో వేస్తే ఎరువవుతుంది. పొయ్యిలో వేస్తే పొయ్యిని మండిస్తుంది. అదేగనక, మెదడ్లో వేసుకుంటేనా, ఇంకేముంది? ఎంచకా అంధభక్తులు కావొచ్చు. సనాతనాన్ని నిలబెట్టొచ్చు!! మరింకోవైపు ఈ దేశంలో ధర్మం – ఒక వ్యాపారమై పోయింది. ఆశ్చర్య పోవాల్సిన విషయం అది కాదు – చదువుకున్న వాళ్లంతా విదేశాలకు వలసపోతుంటే- ఇక్కడ మిగిలి పోయిన వారిలో కొందరు చెవిటివాళ్లూ, గుడ్డివాళ్లు అయిపోతు న్నారు. ఇంకా మిగిలిపోయిన ఏ కొందరు మాత్రమే బాధ్యతగా తమ మెదడ్లు ఉపయోగిస్తున్నారు.చాలా విచారించవల్సిన విషయం మరొకటుంది. ప్రపంచ దేశాలలో ఎక్కడా జరగనిది ఇక్కడే జరుగు తోంది. ఉదాహరణకు గాడిదకు పుట్టింది గాడిదే అవుతుంది. పందికి పుట్టింది పందే అవుతుంది. గొర్రెకు పుట్టింది గొర్రె అవుతుం ది. కానీ, విచిత్రం !! మనిషికి పుట్టిన వాడు ఈ దేశంలో మనిషి కావడం లేదు. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయీ అవుతున్నాడు. ‘మనిషి’ మాత్రం కాలేకపోతున్నాడు. దీనికి ముగింపు ఎప్పుడూ?
”రాజకీయం అంటే సమస్యలను వెదికే కళ! అది ప్రతిచోటా ప్రతి విషయంలోనూ సమస్యల్ని వెతకగలదు. వాటిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా అన్వయించి చెపుతూ, తప్పుడు పరిష్కారాలు చూపగలదు. ఆ సత్తా కేవలం రాజకీయాలకే ఉంది!”
-అమెరికా హాస్యనటుడు GROUCHO MARX
ఇది మన దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సరిగ్గా సరిపోతుంది!
విద్య సంస్కారం ప్రతి ఒక్కరికీ అవసరమైనవి. ఎందుకంటే విద్య తలవంచనీయదు. సంస్కారం-వ్యక్తిత్వాన్ని దిగజారనివ్వదు. విద్యా – సంస్కారం రెండూ లేనివారికి అధికారం కట్టబెడితే ఎలా ఉంటుందీ? ఇదిగో ఇలా భారతదేశం ఇప్పుడున్నట్లు ఉంటుంది. ఈ మధ్య మనుషులు కూడా షేర్ మార్కెట్‌లాగా అయిపోయారు. ఎప్పుడు ఎవడు ఎంతగా దిగజారుతాడో తెలియకుండా పోయింది. పేపర్ లీక్ అయితే, పరీక్ష రద్దవుతుందని మనకు తెలుసు. కానీ, ఈ దేశంలో ఇరవై లక్షల ఈవియంలు కనపడక పోయినా, నమోదయిన ఓటర్ల సంఖ్యకంటే, అధిక సంఖ్యలో ఓట్లు పోలయినా – ఎన్నికలు ఏ మాత్రం రద్దు కావు. పైగా, సిగ్గువిడిచి, ప్రజాస్వామ్యాన్ని మేమే సాకుతున్నామని డప్పు కొట్టుకుంటారు! ధరలు పెరగడం, జీవనం దుర్భరం కావడం అందరితో పాటు ఆరెస్సెస్-బీజేపీ వారికి కూడా అనుభవంలోకి వస్తోంది. అయితే వారు ఆ విషయం మనలాగా బయటికి చెప్పుకోలేరు. గుప్తరోగాలుంటే…ఎవరికీ చెప్పుకోకుండా, పెదవి విప్పకుండా లోలోన కుళ్లిపోతూ దాచిపెట్టుకుంటారు కదా? అలాగన్నమాట!!
రైతుల జీవితానికి, సైనికుల ప్రాణానికీ, స్త్రీల మానానికి ఈ దేశంలో విలువే లేదు. ఇక మిగతావాటి ధరలన్నీ ఆకాశమెక్కి కూర్చున్నారు. ఒక మహిళ వ్యక్తిత్వం, ఒక దళితుడి ప్రతిభ, ఒక ముస్లిం దేశభక్తి – ఈ దేశంలో ఎప్పటికీ ప్రశ్నార్ధకమే! అబద్ధం -రోజుకు ఐదారు డ్రెస్‌లు మార్చుకున్నా భయం భయంగానే తిరుగుతుంది. విలేకరుల సమావేశం ఒక్కటి కూడా నిర్వహించదు. ఎదురుగా ఫ్రాంక్టర్ లేకపోతే పెదవి కదపదు. నిజం – నిజాయితీ ఒకే ఒక్క తెల్లటి టి-షర్ట్‌తో భయం లేకుండా, ప్రజల పక్షాన మాట్లాడటానికి ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉంటుంది. దేశంలో పెద్దనోట్ల రద్దు జరిగినప్పుడు గుజరాత్‌కు చెందిన మహేష్ షా అరెస్టయ్యాడు. అది పదమూడు వేల ఎనమిది వందల అరవై కోట్ల రూపాయలకు సంబంధించిన పెద్ద కేసు. ఇన్వెస్టిగేషన్‌లో అమిత్ షా పేరు రాగానే కేసు ఎక్కడికక్కడ గప్‌చుప్ అయిపోయింది. ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. జస్టిస్ లోయా హత్య కేసు గురించి దేశంలో అందరికీ తెలుసు. కానీ, ఎవరేమి చేయగలరు? అధికార పార్టీ వారి నిజాయితీ అలా ఉంటుంది. పెద్దనోరేసుకుని అరుస్తారు తప్ప చిన్నవిషయం కూడా బయటికి పొక్కనీయరు. వారి ప్రణాళిక అలా ఉంటుంది.
ఒక రాజకీయ విశ్లేషకుడు మోడీ ఉపనాసాలన్నీ శ్రద్ధగా విని, ఆయన మాట్లాడే దాంట్లో ఏయే విషయాలుంటాయన్నది లోతుగా తర చూసి, తన పరిశీలనల్ని ఈ విధంగా ప్రకటించాడు- మోడీ ఉపన్యాసాలలో అరవై శాతం హిందూ ముస్లిం, మందిర్ మస్జిద్‌లు ఉంటాయి. 30 శాతం దేశభక్తిపై దొంగ ప్రేమ. 9.99 శాతం నెహ్రూ-గాంధీ కుటుంబాల విషయాలు, 0.01 శాతం మాత్రమే ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వికాసం వంటి విషయాలుంటాయని ఆ విశ్లేషకుడు ప్రకటించాడు. గత పదేండ్లలో దేశంలో ముప్పయారు కోట్లున్న పేదల సంఖ్యను ఈ ప్రభుత్వం ఎనభై కోట్లకు పెంచింది. సబ్‌కా సాత్-సబ్ కా వినాశ్- దేశ ప్రజల బ్రెయిన్‌వాష్ అంటే ఏమిటో అర్ధమయ్యింది కదా ? అబద్దాలు చెప్పేవారికే ఈ మధ్యకాలంలో ఎక్కువ గౌరవం లభిస్తోంది. ఎందుకంటే, నిజాలు వినే ఓపిక ఏ కొద్ది మందిలో గాని, ఉండడం లేదు.
టైటానిక్ సినిమా చివరి సన్నివేశం గుర్తుంది కదా? ఓడ మునిగిపోతుంటే కొందరు మూర్ఖులు సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆనందిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంది. దేశం పూర్తిగా నాశనమౌతూ ఉన్నా, కండ్లు మూసుకుని అంధ భక్తులు తమ నాయకుణ్ణి పొగడుతూ ఉన్నారు. హరహర మహదేవలాగా – హరహర మోడీ అనీ, హర్ ఘర్ మోడీ – అనీ భజనలు చేస్తున్నారు. ఇది సబబేనా ? ఆలోచించే పనిలేదా? అయినా, మురికి కాలవలో పైప్ వేసి, గ్యాస్‌తో చారు చేయగల నైపుణం ఉన్నవాడున్న ఈ దేశంలో-గ్యాస్ ధర నానాటికీ ఎందుకు పెరుగుతూపోతోంది? మన కేంద్ర ప్రభుత్వం ‘హాజ్ మోలా’ పేరు మార్చాలని తీవ్రంగా కృషి చేస్తోందట! ఎందుకంటే, ఆ పేరులో ‘హజ్’ ఉంది. పైగా ‘మౌలా’ కూడా ఉంది. ఈ రెండూ ముస్లిం మతానికి సంబంధించినవి. ఆ పేరు మార్చి వారు దానికి ‘దీన్ దయాల్ డకార్ గోలా’ అని పెడతారని వినికిడి. టిప్పు సుల్తాన్ శ్రీరంగ పట్నం పేరు మార్చి ఒక ఇస్లామిక్ పేరు పెట్టి ఉండొచ్చు కదా? ఎందుకు పెట్టలేదూ? అంటే – వివేచన గల ధైర్యవంతుడు సమాజ స్వరూపాన్ని మార్చుదామని తహతహలాడతాడు. అంతేగాని, పట్టణాల పేర్లు మార్చుతూ కూర్చోడు. అలా చేసేవారు ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు. సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత వహించని వాళ్లు పేర్లు మారుస్తూ – గొప్ప అభివృద్ధి సాధించామని తమ వీపు తామే చరుచుకుంటూ ఉంటారు, రైతు యాభై రూపాయలకు లీటర్ ఆవుపాలు అమ్మలేడు. కానీ, పతంజలి రామ్‌దేవ్ బాబా, ఆవు మూత్రం లీటర్ తొంభయి రూపాయలకి అమ్ముకోగలడు. ‘మేరా భారత్ మహాన్ అంటే ఇదేనా? ఒక తరం మూర్ఖత్వం తరువాతి తరాలకు సంప్రదాయమౌతోంది!
పుణ్యస్థలాలలో దేవుణ్ణి ఎందుకు వెతుకుతావ్? నువ్వు తప్పుచేస్తున్న చోట కూడా దేవుడున్నాడు. నీ విశ్వాసం ప్రకారమే ‘ ఇందు గలడందు లేడని కదా చెపుతున్నావ్. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉన్నవాడు తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి కదా? దగా, మోసం చేస్తూ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, దిగజారిపోయి – మళ్లీ దేవుణ్ణి గుర్తు చేసుకోవడమెందుకూ? మీ తప్పుడు పనులన్నిటికీ ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని భావిస్తున్నారా?
క్యా మందిర్ క్యా తీరథ్ ఔర్ గంగాకి ధార్‌కరే
జబ్ మన్‌కి గందా కర్ బైఠీహై, తొ ఈశ్వర్ క్యాఉద్గార్ కరే-?
మందిరమేమిటి? తీర్థమేమిటి? గంగా ప్రవాహమేమిటీ? నువు నీ మనసును మురికిగ చేసుకునుంటే
ఇక ఈశ్వరుడేమీ? – చేసేదేమీ? -అన్నాడు కబీర్.
అయితే, ఆయనను అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదా ఈ మనుషులకు?
ముఖాన్ని చూసి ప్రశంసలు గుప్పించడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి, చరిత్రను చూసి మాట్లాడాలని చెపుతారు విజ్ఞులు. ముఖానికి మేకప్ వేసుకుని, అందంగా తీర్చిదిద్దుకోవడానికి కొద్ది సమయమే పడుతుంది. చరిత్ర సృష్టించాలంటేనే ఒక జీవిత కాలం పడుతుంది. గతంలో మనుషులు చచ్చిపోయేవారు. వారి ఆత్మలు తప్పిపోయి తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు చూడండి మనుషులు బతికి ఉండగానే వారి ఆత్మలు చచ్చిపోతున్నాయి. ఆత్మల్లేని మనుషులేమో తప్పిపోయి తిరుగుతున్నారు – విచిత్రం! ఇది నమ్మకద్రోహుల యుగం మహాశయా! మీకు మనుషుల దగ్గర విశ్వాసం ఎక్కడ దొరుకుతుందీ -విశ్వాసమే కావాలంటే తమరు కక్షలు పెంచుకోవడం మంచిది! పత్రికలు కూడా చూడండి ఎలా తయారయ్యాయో? గతంలో పత్రికలు ప్రచురింపబడ్డాక అమ్ముడయ్యేవి. ఇప్పుడేమిటీ? ఈ విచిత్రం? ఈ బీజేపీ వాారి పాలనలో మొదటి అమ్ముడైపోయి, తర్వాత వార్తలు ప్రచురిస్తున్నాయీ? కేవలం పత్రికలేకాదు, అన్ని రకాల మీడియా సంస్థలూ అలాగే తయారయ్యాయి.
ధార్మిక మూర్ఖత్వం సమాజాన్ని నిలువునా ముంచేస్తోంది. పురోహితులను, ముల్లాలను, ఫాదర్లను దూరం పెట్టండి. వారి బోధనలు వినిపించుకోకండి! ఆ అవసరం లేదు, మనుషులు కండి! మానవత్వాన్ని నిలిపే పనిలో నిమగమై-మనిషి కేంద్రంగా పనిచేయండి! మంచి మనిషి కావడం ముఖ్యం! ఎవరు ఏ మతానికి, ఏ కులానికి చెందిన వారన్నది అనవసరం! మానవ శ్రేయస్సు కోసం పని చేస్తున్నారా? లేదా? అనేదే ముఖ్యం! కుల మతాలకూ, వారి ధార్మిక విశ్వాసాలకూ విలువే లేదు. మిమ్మల్ని మీరు సజీవులుగా చెప్పుకోవాలంటే, ఎక్కడ ఏ తప్పు జరిగినా, గొంతెత్తి చెపుతూ ఉండండి! నిశ్శబ్దంగా ప్రవాహంలో కొట్టుకుపోయేవి కేవలం శవాలు మాత్రమే!!
-వ్యాసకర్త: కవి త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత.
డాక్టర్ దేవరాజు మహారాజు
ధార్మిక మూర్ఖత్వం సమాజాన్ని నిలువునా ముంచేస్తుంది!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES