Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఆయుధాలు, ఆకలితో చంపుతున్న ఇజ్రాయిల్‌!

ఆయుధాలు, ఆకలితో చంపుతున్న ఇజ్రాయిల్‌!

- Advertisement -

అక్కడ అందచేసే నాసిరకం ఆహారపదార్థాల కోసం జనం
బారులు తీరుతున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం
చేసుకోవచ్చు.దొరికినదాన్ని పిల్లలకు పెట్టి పెద్దలు
పస్తులుంటున్నారు.ఇప్పటి వరకు 2023 అక్టోబరు ఏడు నుంచి
ఇజ్రాయిల్‌ దాడుల్లో 62,895 మంది మరణించారు. పది
లక్షల మంది ఉన్న గాజా నగరాన్ని వదలి వెళ్లాలంటూ
హెచ్చరికలు చేస్తూ నలువైపుల నుంచి ముట్టడించి దాడులు
జరుపుతున్నారు. మరోవైపు ఆకలిని ఆయుధంగా మార్చి
చంపుతున్నారు. ఈ దుర్మార్గానికి అంతం లేదా ?


గాజాలో తలెత్తిన కరవు సమస్య మానవ కల్పితమని, ఆకలిని ఆయుధంగా చేసుకోవటం అంతర్జాతీయ మానవతా చట్ట ప్రకారం నిషేధించినట్లు అమెరికా మినహా భద్రతా మండలి దేశాలన్నీ బుధవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఇజ్రాయిల్‌ చర్యలను ఖండించాయి. ఆక్రమిత పాలస్తీనాలోని గాజాలో తలెత్తిన తీవ్ర పరిస్థితిని ఈ ప్రకటన ప్రతిబింబిస్తున్నది. ఒక వైపు నిస్సిగ్గుగా నెతన్యాహు నాయకత్వంలో జరుగుతున్న మారణకాండను సమర్థిస్తున్న అమెరికా మరోవైపు గాజా సమస్యను పరిష్కరించటంలో భద్రతా మండలి విఫలమైందంటూ ఎదురుదాడికి దిగింది. హమాస్‌ కారణంగానే గాజాలో తిరిగి దాడులు ప్రారంభమైనట్లు ఆరోపించింది. దాని అండచూసుకున్న ఇజ్రాయిల్‌ గాజాలో ఆకలి అన్న నివేదిక వాస్తవాల ప్రాతిపదికన రూపొందిం చింది కాదంటూ తిరస్కరిం చింది. ప్రభుత్వేతర మరియు ఐరాస ప్రతినిధులు రూపొందించిన ఆహార భద్రత నివేదిక (ఐపిసి) గాజా కరవు పరిస్థితిని వివరించింది. పిల్లలను రక్షించాలనే సంస్థ అధిపతి ఇంగెర్‌ అషింగ్‌ ప్రపంచ దేశాలు నిష్క్రియాపరంగా వ్యవహరిస్తూ ఆ నేరంలో భాగస్వాములవుతున్నాయని ఘాటుగా విమర్శించారు. ఆమె ఒక ప్రకటన చేస్తూ ఒక పద్ధ్దతి ప్రకారం గాజాలో పిల్లలను ఆకలితో చంపుతున్నారని పేర్కొన్నారు. ఇది యుద్ధంలో ఒక పద్ధతి తప్ప మరొకటి కాదన్నారు.
ఆకలితో అలమటిస్తున్న పిల్లలో ఏడ్చే శక్తి కూడా లేదని గాజాలో కరవు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న స్వచ్ఛంద సంస్థ పేర్కొనటాన్ని బట్టి పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉందో, మానవత్వం గురించి నిత్యం ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే పెద్దలు ఎంత దుర్మార్గంగా ప్రవరిస్తున్నారో తెలుస్తున్నది. బాంబులు వేసి చంపినా ఒకరోజుతో పోతుంది గానీ తమ కళ్ల ముందే పిల్లలు కుంగి కృశించి పిట్టల్లా రాలిపోవటాన్ని చూడలేకున్నామని తలిదండ్రులు వాపోతున్నారు. ఆహారంతో పాటు ప్రాణాలు నిలిపేందుకు అవసరమైన సాయాన్ని కూడా బాంబుదాడులతో ఇజ్రాయిల్‌ అడ్డుకుంటున్న దని, ప్రస్తుతం గాజా నగర పరిసరాల్లో ఉన్న ఈ పరిస్థితి సెప్టెంబరు నాటికి ఇతర చోట్లకూ విస్తరించే అవకాశం ఉందని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు భద్రతామండలికి వివరించారు. ‘గాజాలో ఆకలికి గురిగాని వారు లేరు, ఇప్పుడు ఐదులక్షల మంది ఉన్నారు, త్వరలో 6.4లక్షల మందికి చేరతారు, ఐదేండ్లలోపు పిల్లలు లక్షా 32వేల మంది పోషకాహారలేమిని ఎదుర్కొంటున్నారు, వారిలో 43వేల మంది ప్రాణాలకు ముప్పు ముంచుకు వస్తున్నది.’ అని పేర్కొన్నారు. కరవు, పోషకాహార లేమితో గడచిన 24గంటల్లో ఇద్దరు పిల్లలతో సహా మరోపది మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 313 మంది చనిపోగా వారిలో 119 మంది పిల్లలు ఉన్నారు.
ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ చర్యలను నివారించటానికి ఐరాస భద్రతామండలి చేస్తున్నదేమీ లేదు. వీటో అధికారంతో అడ్డుకొనేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఐరోపా ధనికదేశాలు కూడా అమెరికా మాదిరి ఆత్మరక్షణ కట్టుకతలను చెబుతున్నప్పటికీ గుడ్డిగా సమర్ధించేందుకు కనీసం సిగ్గునటిస్తున్నాయి. ఈ ఏడాది మార్చినెల నుంచి ఇజ్రాయిల్‌ దాడులను మరింత తీవ్రతరం గావించింది. ఐరాస నిర్వహించే సహాయ శిబిరాల మీద కూడా దాడులు చేస్తున్నారు. అనేక మంది సిబ్బంది కూడా మరణించారు. ఐరాస పర్యవేక్షణలో ఉన్న 400 కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. వాటి స్థానంలో తాము సహాయం చేస్తున్నామని ప్రపంచానికి చూపేందుకు ఇజ్రాయిల్‌, అమెరికా మద్దతు ఉన్న ఒక సంస్థ నిర్వహించే నాలుగు కేంద్రాల పరిసరాల మీద కూడా దాడులు జరపటంతో బుధవారం పన్నెండు మంది మరణించారు. ఆ కేంద్రాల సమయాలను తెరిచే కొద్ది సేపటి ముందు ప్రకటించి జనం వచ్చేలోపల మమ అనిపించి మూసివేస్తున్నారు.ఉత్తర ప్రాంతంలో ఉన్న వారికి కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేయటం, అక్కడ అందచేసే నాసిరకం ఆహారపదార్థాల కోసం జనం బారులు తీరుతున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు.దొరికినదాన్ని పిల్లలకు పెట్టి పెద్దలు పస్తులుంటున్నారు.ఇప్పటి వరకు 2023 అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయిల్‌ దాడుల్లో 62,895 మంది మరణించారు. పది లక్షల మంది ఉన్న గాజా నగరాన్ని వదలి వెళ్లాలంటూ హెచ్చరికలు చేస్తూ నలువైపుల నుంచి ముట్టడించి దాడులు జరుపుతున్నారు.మరోవైపు ఆకలిని ఆయుధంగా మార్చి చంపుతున్నారు. ఈ దుర్మార్గానికి అంతం లేదా? నిస్సహాయంగా చూస్తూ ఉండవలసిందేనా అన్నది సభ్య సమాజం ముందున్న ప్రశ్న!

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad