– ఉద్యోగ జేఏసీ నేతలకు సర్కారు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. వచ్చేనెల రెండో తేదీన చర్చలకు రావాలంటూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి సమాచారం అందిందంటూ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జీఏడీ ముఖ్యకార్యదర్శి బీఎండీ ఎక్కా, కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కార్యదర్శులు లోక్‌శ్‌కుమార్, కృష్ణభాస్కర్ తదితరులతో సమావేశమయ్యామని వివరించారు. ఉద్యోగులతో ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎందుకుంది, వెంటనే సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చేనెల రెండున చర్చలు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్ణయించారు. అందులో భాగంగా ఉద్యోగ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించారు. సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతున్న భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 12న లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమం, వచ్చేనెల ఎనిమిది నుంచి 18 వరకు జిల్లాస్థాయి చైతన్య సదస్సుల నిర్వహణ కోసం బస్సుయాత్రను చేపడుతున్నది. వచ్చేనెల ఒకటో తేదీన పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
– పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలి.
– ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)ను పూర్తిస్థాయిలో నిబంధనలు రూపొందించి అమలు చేయాలి.
– మంత్రివర్గ ఆమోదించిన విధంగా నెలకు రూ.700 కోట్లు పెండింగ్ బిల్లుల కోసం విడుదల చేయాలి
– కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను అమలు చేయాలి.
– ఏకీకృత సర్వీస్ నిబంధనలను అమలు చేయాలి.
– డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ద్వారా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
– పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలి.
– వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.
– స్థానికత ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి.
– ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి.
2న చర్చలకు రండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES