Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంభారీగా నష్టపోయిన జిల్లాలకు అదనంగా నిధులు

భారీగా నష్టపోయిన జిల్లాలకు అదనంగా నిధులు

- Advertisement -

– యుద్ధ ప్రాతిపదికన
రవాణా సౌకర్యాల పునరుద్ధరణ : వరదలపై సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వర్షాలతో భారీగా నష్ట పోయిన జిల్లాలకు అదనంగా నిధులిస్తామని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం విపత్తుల నిర్వహణా శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. మెదక్‌, కామారెడ్డి సిరిసిల్ల నిర్మల్‌ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్‌ ద్వారా మాట్లాడారు. వరదల నేపథ్యంలో ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశామనీ, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న జిల్లాలకు అదనంగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. మెదక్‌, కామారెడ్డి ఆదిలాబాద్‌ జిల్లాల్లో పెద్దఎత్తున వర్షపాతం నమోదైందన్నారు. అయినా ప్రాణ, ఆస్తినష్టం వీలైనంత మేరకు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరదల్లో చిక్కుకున్నవారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోని నర్మాల వద్ద బుధవారం మానేరు వాగు వరదల్లో చిక్కుకున్న ఐదుగురిని హెలికాప్టర్‌ ద్వారా రక్షించామని చెప్పారు.
భారీ వర్షాలతో స్తంభించిన జాతీయ రహదారితోపాటు, పంచాయితీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లను క్లియర్‌ చేశామని అన్నారు, రహదారి సౌకర్యాలు దెబ్బతిన్న మండల, జిల్లా కేంద్రాలకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో రెవెన్యూ. పోలీసు విభాగాలు చిత్తశుద్దితో 24 గంటలు పనిచేస్తున్నాయని కొనియాడారు. వర్షాలు, వరదలపై ఆయా జిల్లాల యంత్రాంగంతో నిరంతరం మానిటరింగ్‌ చేసుకోవాలని విపత్తు నిర్వహణ అధికారులకు మంత్రి సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. ఈ విపత్తు వల్ల చనిపోయిన వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు.
మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో కేవలం ఒక గంట వ్యవధిలో 700 మిల్లీమీటర్ల వర్షం కారణంగా నీటి వనరులు పూర్తిగా నిండిపోయాయనీ, వాటి నుంచి ఉధృతంగా నీరు బయటకు వెళ్లడంతో గట్లు దెబ్బతిని తీవ్ర నష్టాన్ని కలిగించిందని వివరించారు. తండాలు ఎక్కువగా వర్ష బీభత్సానికి గురయ్యాయనీ, వాటికి తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలను వీలైనంత త్వరగా కల్పించేలా అధికారులను ఆదేశించారు. వర్షాల తర్వాత వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయనీ, తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖకు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad