– బ్యాక్ బిల్లింగ్ ను సెస్ ఇప్పుడు అడగడం లేదు
– ప్రభుత్వంను తప్పుదోవ పట్టించవద్దు
– సెస్ చైర్మన్ రామారావు
నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల
బ్యాక్ బిల్లింగ్ ఇప్పుడు సెస్ కు చెల్లించాలని సెస్ అధికారులు ఎస్ ఎస్ ఐ యూనిట్ల యజమానులను అడగడం లేదని ఈ నెల వాడుకున్న విద్యుత్ బిల్లు ను మాత్రమే చెల్లించాలని సెస్ అధికారులు కోరడం జరుగుతుందని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం జరిగిన సమావేశంలో సెస్ పాలకవర్గ సభ్యులు దార్ణం లక్ష్మీనారాయణ, నారాయణరావులతో కలిసి ఆయన మాట్లాడారు.
ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులు 156 మందిని ఈ జూలై మాసంకు సంబంధించిన 73 లక్షలు మాత్రమే కట్టమని చెప్పామని వాటిలో 44 మంది ఎస్ఎస్ఐ యూనిట్ లో యజమానులు 23.88 లక్షలు చెల్లించారనీ, మిగతా 112 మంది ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులు జూలై మాసంకు సంబంధించిన విద్యుత్ బిల్లు కూడా చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు.
156 మంది ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానుల నుంచి 19.05కోట్ల రూపాయలు బ్యాక్ బిల్డింగ్ రావాల్సి ఉండగా వాటికి సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరగా అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి నెల వచ్చిన విద్యుత్ బిల్లులు ఈ యూనిట్ల యజమానులు చెల్లించకపోవడంతో అవి 13.18 కోట్లు బకాయి పడ్డారని ఆయన వివరించారు. వాడుకున్న విద్యుత్ బిల్లులను చెల్లించమని సెస్ అధికారులు అడుగుతుండగా చెల్లించకుండా సెస్ కార్యాలయం ముందు ధర్నా చేయడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా సెస్ అధికారులు బ్యాక్ బిల్లింగ్ చెల్లించాలని అంటున్నారని ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులు ప్రభుత్వంలోని నాయకులకు చెబుతూ వారిని తప్పుదారి పట్టిస్తున్నారని ఇప్పటికైనా ప్రతి నెల వాడుకున్న విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నామని ఆయన వివరించారు.