పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరిరోజు ప్రజలను, వారి ప్రతినిధులను తీవ్రషాక్‌కు గురిచేసింది. ప్రజల ప్రాథమిక ఓటు హక్కును పెద్దయెత్తున తారుమారు చేశారన్న ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ఈ సెషన్‌లో ఆఖరి రోజు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం నివ్వెరపరచింది. రాజ్యాంగ సవరణ (130వ సవరణ) బిల్లు-2025 కొన్ని సాధారణ సూత్రీకరణలను, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నిర్దిష్ట పరిస్థితిని కలిగివుంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల ఉత్పన్నమయ్యే రాజ్యాంగ, చట్ట పరమైన ప్రశ్నలు ఈ సంచికలోనే మరో చోట సవివరంగా విశ్లేషించారు. అయితే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రూప కల్పనలో రాజకీయ అంశాన్ని పరిశీలించడం ముఖ్యం. ఎందుకంటే, ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించే ప్రక్రియ గురించి కనీస పరిజ్ఞానం ఉన్న ఏ పౌరునికైనా ఇది అత్యంత దారుణమైన చర్య అని ఇట్టే అర్థమవుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం కోసం పాలక పక్షానికి పార్లమెంటు ఉభయ సభల్లో ఒక్కొక్క దానిలో మూడింట రెండొంతుల మెజార్టీ అంటే హాజరైన సభ్యుల్లో సగానికి మించి సభ్యుల మద్దతు కావాలి. ఉభయసభల్లో ఉన్న ప్రస్తుత బలాబలాల పొందిక, సంఖ్యాబలం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ బిల్లు ఆమోదం పొందడం అసాధ్య మని ఇట్టే చెప్పేయొచ్చు. ఎప్పటికీ ఆమోదించబడని ఈ బిల్లును ఎందుకింత హడావుడిగా ప్రవేశపెట్టారు? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
దీనికి ప్రభుత్వం తనదైన శైలిలో సమాధానమిస్తూ, ఇది ‘ప్రజల ప్రయోజనాలు, సంక్షేమం, సుపరిపాలన’ను మెరుగ్గా పరిరక్షించేందుకేనని చెప్పింది. ‘రాజ్యాంగ నైతికత’ను మరింత మెరుగైన స్థితికి తిరిగి తీసుకెళ్తానని వారు చెప్పినప్పుడు నిజంగానే అది చాలా విడ్డూరంగా అనిపించింది. వారు చేసిన గంభీరమైన ప్రకటనలు ఈ అంశాల్లో ప్రభుత్వ గత రికార్డును పరిశీలించక తప్పని స్థితికి నెట్టాయి. గతంలో ఈ ప్రభుత్వమే మనీ లాండరింగ్ యాక్ట్ (పిి.ఎం.ఎల్.ఎ)కి ఒక సవరణ చేసింది. ఇది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇ.డి)ని ఒక కర్కశమైన ఆయుధంగా మార్చింది. ఈ కొత్త సవరణ కింద అభియోగం మోపబడినవారికి బెయిలు నిరాకరించడం ఇ.డి కి ఒక రివాజు అయిపోయింది. పి.ఎం.ఎల్.ఎ ఈ కొత్త రూపం ఆమోదం తరువాత దేశం చాలా వికృతాలను చూసింది. ముఖ్యమంత్రులతో సహా ముఖ్యమైన ప్రతిపక్ష నాయకులపై దీనిని అనేక సార్లు పయోగించారు. పి.ఎం.ఎల్.ఎ లోని కొత్త నిబంధనల కింద ఆరు నెలలకు పైగా వారిని కటకటాల వెనక ఉంచారు.
ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), హేమంత్ సోరెన్ (జార్ఖండ్)లకు సంబంధిత హైకోర్టులు ఈ అభియోగాల నుంచి తరువాత విముక్తి ప్రసా దించాయి. ఈ ప్రతిపాదిత 130వ రాజ్యాంగ సవరణ గనుక అమలులో ఉంటే ఈ ఇద్దరు వ్యక్తులు కచ్చితంగా పదవిని కోల్పోయేవారు. తన మాట వినని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అదే పనిగా కేంద్ర ప్రభుత్వం వెంటాడే సంగతి అలా ఉంచితే, ప్రతిపక్ష ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రభుత్వం కంటి చూపుతో బెదిరించి లొంగ దీసుకుని, వారిని బీజేపీలోకి ఫిరాయించేలా చేసేందుకు తనదైన మార్గాన్ని అనుసరించింది. ఈ పద్ధతికి సంబంధించి సవివరమైన నివేదికను 2024 ఏప్రిల్‌లో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మాజీ మంత్రి సువేందు అధికారి (ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేతగా ఉన్నారు) మొదలుకుని (కాంగ్రెస్‌కు చెందిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బీజేపీ అగ్ర నాయకత్వానికి అత్యంత ప్రీతిపాత్రుడిగా మారిన ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వరకు రెండు డజన్లకు పైగా మాజీ ప్రతిపక్ష సభ్యుల జాబితాను అది వెల్లడించింది. పాలక పార్టీ పచ్చిక బయళ్ల కోసం వీరు పార్టీ ఫిరాయించారు. వారందరిపై ఇ.డి కేసులు ఉన్నాయి. బీజేపీ లోకి ఒక్కసారిగా ఫిరాయించగానే ఈ కేసుల నుంచి వారికి క్లీన్‌చిట్ లభించింది. మహారాష్ట్రలో సాగిన ఫిరాయింపులు ఈ అసహ్యకరమైన పద్ధతి తాలూకు వికృత రూపానికి ఒక తిరుగు లేని ఉదాహరణ. అక్కడ శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీలను చీల్చడం ద్వారా ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ (ఎం.వి.ఎ) ప్రభుత్వాన్ని పడగొట్టారు. శివసేన నుంచి ఫిరాయించిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో తొమ్మిది మంది కేబినెట్ మంత్రులు ఇడి చేత అభియోగాలు మోపబడినవారే. ఆ తర్వాత వీరంతా ఆటోమెటిక్‌గా పరిశుద్ధులైపోయారు. నిస్సిగ్గుగా సాగిన ఈ చర్య బీజేపీకి ‘వాషింగ్ మెషిన్’ అనే అసహ్యకరమైన విశేషణాన్ని సంపాదించి పెట్టిందనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు అమిత్‌షా ఓ సాధుపుంగవునిలా స్వరం మార్చి ప్రతిపాదిత సవరణ రాజకీయాలు లేదా ఎన్నికల కోసం కాదని చెప్పినప్పుడు, ఆ అసంబద్ధమైన వాదనను విని సొంత పార్టీ వారే చాటుగా నవ్వుకునే పరిస్థితి ఏర్ప డింది. ఎలక్టొరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో అవినీతి విషయంలో బీజేపీ అతి పెద్ద మోసకారితనం మరింత స్పష్టంగా రికార్డయింది. ఎలక్టొరల్ బాండ్ స్కీమ్ అనేది బీజేపీకి, ఒక సెక్షన్ కార్పొరేట్లకు మధ్య ‘క్విడ్ ప్రోకో’కు సంబంధించిన అత్యంత బరితెగింపు చర్య. వాస్తవానికి ఈ స్కీము కింద బీజేపీకి లభించిన విరాళాల వివరాలను చూస్తే, ఆ పార్టీ బొక్కసంలో చేరిన రూ.5వేల కోట్లు అక్రమ లావాదేవీలేనని స్పష్టమవుతుంది.
బీజేపీఇంత భారీగా ‘నిధులు’ రాబట్టుకోడానికి ఇ.డి, సి.బి.ఐ ఫెసిలిటేటర్లుగా వ్యవహరించాయని మీడియా తదుపరి విచారణలో తేలింది. ఎలక్టొరల్ బాండ్ స్కీమ్ స్వచ్ఛంద విరాళాల కోసం ఉద్దేశించినది కాదని, బలవంతపు వసూళ్లే దీని అసలు లక్ష్యమని ఈ నిర్వాకంతో స్పష్టమైంది. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువని అనుకుంటే పొరపాటు అని అమిత్‌షాకు ఎవరు గుర్తు చేస్తారు? రాజ్యాంగ నైతికత గురించి ఆయన ప్రస్తావనను ఎప్పటికీ జీర్ణించుకోలేమని ఎవరు గుర్తు చేయగలరు? మాజీ ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్‌ఖర్‌కు వారు ఏమి చేసినప్పటికీ, ఆ కారణంగా ముందుకొచ్చిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో గెలవడం కోసం జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోంమంత్రి చేసిన ఆరోపణలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను అవమానించడంలో ఆయన ఎంతదూరమైనా వెళ్తారని స్పష్టమవుతుంది. అవినీతిపై పోరాడడంలో ముఖ్యమైన సాధనం పాలనలో పారదర్శకత పాటించడం. దీనికి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తోంది.
ప్రధానమంత్రి చదువుకు సంబంధించిన రికార్డులను ఇవ్వడానికి నిరాకరించడంపై సాగుతున్న చట్టపరమైన వాదనలు బహుశా పారదర్శకతకు పాతరేయడంపై ప్రభుత్వానికి ఎంతటి మక్కువో తెలియజేస్తున్నాయి. ఆయన అకడమిక్ రికార్డు వివరాలను ఎలాంటి దాపరికం లేకుండా వెల్లడిస్తే ఆ చర్య స్వయంగా ప్రధాని లేదా ఆయన ప్రభుత్వ నైతిక ప్రమాణం ప్రజల దృష్టిలో పెంచదా? ప్రభుత్వ భయంకరమైన ఈ రికార్డును చూశాక రాజ్యాంగ బిల్లు-2025 (130వ సవరణ)కు సంబంధించి పేర్కొన్న లక్ష్యాలను ఎవరూ స్వీకరించే స్థితి లేదు. ఈ అసహ్యకరమైన సవరణను ముందుకు నెట్టేందుకు ఎందుకింత ఆతృత పడుతున్నారన్న ప్రశ్న అలానే వేధిస్తుంది. బీజేపీ ఎన్నికల ప్రయోజనాల కోసం రాజ్యాంగ బద్ధమైన సంస్థ – భారత ఎన్నికల కమిషన్ (ఇ.సి.ఐ ని, ప్రజల ప్రాథమిక ఓటు హక్కు ను, రాజ్యాంగాన్ని, నాశనం చేసే పన్నాగానికి సంబం ధించి పెద్దయెత్తున ఆధారాలు లభించడంతో దానినుండి దృష్టిని పక్కదారి పట్టించే యత్నంలో భాగమే ఈ సవరణ అనే భావన వివిధ సెక్షన్ల ప్రజానీకంలో అంతకంతకూ పెరుగు తున్నది.
(ఆగస్టు 27 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
ప్రతీకార చర్యకు రాజ్యాంగ బద్ధతా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES