Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజియువతరానికి స్ఫూర్తి 'సురవరం'

యువతరానికి స్ఫూర్తి ‘సురవరం’

- Advertisement -

సమస్యలపై ప్రశ్నించడం, నిలదీయడం, ఉద్యమించడం హైస్కూల్‌ స్థాయిలోనే ఆచరణలో పెట్టిన విద్యార్థి నాయకుడు. యువజన నాయకుడిగా, పార్టీ రాష్ట్రస్థాయి నుండి ఆలిండియా వరకు మన్ననలు పొందిన కమ్యూనిస్టు దిగ్గజం. పార్టీలో అత్యున్నత పదవులు చేపట్టి వివిధ స్థాయిలో తన ప్రత్యేకతను నిరూపించుకున్న నేత, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి. ఆయన చేసిన పోరాటంలో విద్యార్థులే కాదు, అణచివేతకు గురైన ప్రజలందరినీ భాగస్వాములుగా చేశాడు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని, సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని 1971లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా వేలాదిమంది విద్యార్థులతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌కు అధికంగా నిధులు కేటాయించింది. ప్రతి జిల్లా కేంద్రంతో పాటు, కొన్ని వెనుకబడిన మండలాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ నెలకొల్పింది.1972లో ఏఐఎస్‌ఎఫ్‌ జాతి అధ్యక్షులుగా ఎన్నికైన ఆయన 18 ఏళ్లకు ఓటు హక్కు సాధించే ఉద్యమానికి నేతృత్వం వహించాడు. ఢిల్లీ వీధుల్లో భారీ యువజన ర్యాలీలు నిర్వహించారు. ఆ సందర్భంగా రాష్ట్ర కేంద్రాల్లో పెద్దఎత్తున విద్యార్థి యువకులను సమీకరించి ప్రదర్శనలు చేపట్టారు.1973 అక్టోబర్‌లో సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు అధిక ధరలు, భూ సంస్కరణలు తదితర సమస్యలపై లక్షలాదిమందితో ఢిల్లీ పార్లమెంటును ముట్టడించగా, ఆ కార్యక్రమంలో వేలాదిమంది యువకులను సమీకరించటంలో సుధాకర్‌రెడ్డి పాత్ర కీలకమైనది. 1978 నుండి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.

కర్నూలు, నల్లగొండ, మహబూబ్‌గర్‌, మెదక్‌ జిల్లాల్లో భూ పోరాటాలతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు కృష్ణా,గోదావరి నదీ జలాలు అందించే ప్రాజెక్టులు చేపట్టాలని సదస్సులు నిర్వహించారు, పాదయా త్రలు చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలో ఉన్న సందర్భంలో 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ఛార్జీలను నిరసిస్తూ చేపట్టిన పిలుపులో భాగంగా వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలను భాగస్వాములను చేశారు. ఆగష్టు 28న అసెంబ్లీని ముట్టడించడానికి వెళ్తుండగా బషీర్‌బాగ్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వామపక్ష కార్యకర్తలు చనిపోగా సురవరం తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రజాప్రతినిధిగానూ ఎన్నికైన ఆయన చట్టసభల్లో తనదైన శైలిలో ప్రజల గొంతుకను వినిపించాడు ఇంతటి కార్యదీక్ష గల నాయకుడు మననుంచి (2025 ఆగష్టు 22న) దూరమయ్యారు. ఆయన మనమధ్య భౌతికంగా లేకున్నా చూపిన పోరాట పటిమను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి.
(నేడు సురవరం సుధాకర్‌రెడ్డి సంతాపసభ)
– ఉజ్జిని రత్నాకర్‌ రావు, 9490952646

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad