Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeమానవిఅమ్మాయిలూ.. జాగ్రత్తా...

అమ్మాయిలూ.. జాగ్రత్తా…

- Advertisement -

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది సోషల్‌ మీడియాకు అలవాటు పడిపోయారు. కరోనా తర్వాత అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్‌ వుండటం సహజంగా అయిపోయింది. ప్రస్తుతం అందరికీ స్మాట్‌ ఫోన్‌ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. చాలా మంది ఫోన్‌ వదిలి వుండలేనంతగా బానిసలైపోయారు. నగరాల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు ఎవరికి తగ్గట్టు వారు ఫోన్‌ ఉపయోగించుకుంటున్నారు. ఇక సోషల్‌ మీడియాను నచ్చినట్టు వాడుకుంటున్నారు. అయితే దీని వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కొందరైతే తమ చేతులారా సమస్యలు తెచ్చిపెట్టు కుంటున్నారు. అలాంటి ఒక కథనమే ఈ వారం ఐలమ్మ ట్రస్ట్‌ (ఐద్వా అదాలత్‌)లో మీకోసం…

రాధికకు 16 ఏండ్లు ఉంటాయి. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఇంట్లో అమ్మా,నాన్న, చెల్లి, తమ్ముడు ఉంటారు. తల్లి దండ్రులు కూలీ పని చేస్తుంటారు. రాధిక ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో 4వ తరగతి ఉద్యోగిగా పని చేస్తుంది. అది కూడా నాలుగు నెలల ముందు ఆ ఉద్యోగంలో చేరింది. వచ్చిన డబ్బులతో ఒక స్మాట్‌ ఫోన్‌ తీసుకుంది.
దాన్ని తీసుకున్నప్పటి నుండి సోషల్‌ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేణు అనే వ్యక్తితో పరిచయమయింది. రెండు రోజులు ఇద్దరూ ఇన్‌స్టాలో చాట్‌ చేసుకున్నారు. మూడవ రోజు వేణు, రాధికను కలవడానికి వచ్చాడు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి లంచ్‌ చేశారు. వేణు వెళ్లిపోయాక రాధిక ఇంటికి వచ్చేసింది. రాధికను కలవడానికి వేణు దాదాపు 30 కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. అంతే కాదు వేణు మాట తీరు రాధికకు బాగా నచ్చింది. దాంతో ఆమెకు వేణుపై ప్రేమ మొదలైంది. వారు మళ్లీ ఇన్‌స్టాలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అతను ఒక స్టాప్‌వేర్‌ ఉద్యోగిని అని చెప్పుకున్నాడు. ‘మరి మీరు స్టాప్ట్‌వేర్‌ ఉద్యోగి నేను ఆస్పత్రిలో చిన్న ఉద్యోగం చేసే దాన్ని కదా’ అంటే దానికి అతను ‘నువ్వు నాకు బాగా నచ్చావు. కాబట్టి నిన్ను కలవడానికి అంతదూరం వచ్చాను. నీకు నేను నచ్చకపోతే చెప్పు’ అన్నాడు.
దానికి ఆమె ‘లేదు లేదు మీరు కూడా నాకు నచ్చారు. కాబట్టే మీతో కలిసి బయటకు వచ్చారు. అంతకుముందు నేను ఎవరితో ఇలా మాట్లాడలేదు, బయటకు వెళ్లలేదు’ అని చెప్పింది. ఇలా మళ్లీ మూడు రోజులు చాటింగ్‌ తర్వాత వేణు, రాధికను కలవడానికి రమ్మని పిలిచాడు. కానీ ఆమె వెళ్లడానికి సిద్దంగా లేక పోవడంతో అతనే క్యాబ్‌ తీసుకొచ్చాడు. దాంతో రాధిక అతనితో పాటుగా క్యాబ్‌ ఎక్కి వెళ్లింది. వారు కొంత దూరం వెళ్లిన తర్వాత వేరే వాళ్లు వచ్చి ఆమెను బండిపై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి ఒక మద్యం షాపు దగ్గర బండి ఆపి మద్యం తీసుకొని హౌటల్‌ రూమ్‌కి వెళ్లారు. బలవంతంగా వేణు రాధికతో మద్యం తాగించాడు. మత్తులో ఉన్నప్పుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. తిరిగి ఆమెను ఇంటి దగ్గరలో వదిలి పెట్టి వెళ్లిపోయాడు.
రాధిక ఎంతకీ ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు ఆమె కోసం వెదకడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే రాధిక ఇంటికి వచ్చేసారికి కుటుంబ సభ్యులు ఆమెను ‘ఇంత సేపు ఎక్కడికెళ్లావు’ అని గట్టిగా నిలిదీశారు. దాంతో రాధిక జరిగిన విషయం మొత్తం చెప్పింది. కుటుంబ సభ్యులకు కోపం వచ్చింది. దాంతో వేణుకు ఫోన్‌ చేశారు. ముందు నాకు ఎలాంటి సంబంధం లేదు అని బుకాయించే ప్రయత్నం చేశాడు. దాంతో రాధిక తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కేసు పెడతాం అనే సరికి ‘నా వల్ల తప్పు జరిగిపోయింది, నేను రాధికను పెండ్లి చేసుకుంటాను’ అన్నాడు. సరే అని రాధిక కుటుంబ సభ్యులు రెండు రోజులు చూశారు. అయినా అతను రాలేదు. పైగా అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. దాంతో రాధిక తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అతని ఇన్‌స్టాగ్రామ్‌ తప్ప ఎలాంటి వివరాలు రాధిక వద్ద లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోసం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చారు.
మేము వాళ్లతో దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పాము. దాంతో వాళ్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ‘ఘటన ఎక్కడైతే జరిగిందో మీరు అక్కడే ఫిర్యాదు చేయాలి. వాళ్లే దర్యాప్తు చేస్తారు. ఇక్కడ మేము ఏమీ చేయలేము. అయినా ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత వస్తే ఎలా? సరే ఇప్పటికైనా వచ్చి ఫిర్యాదు చేశారు కాబట్టి మేము నమోదు చేసుకుంటాము. కానీ కేసు నమోదు చేసి దర్యాప్తు మాత్రం మేము చేయలేము. ఘటన జరిగిన పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ వారే ఆ పని చేస్తారు’ అని చెప్పారు.
దాంతో వాళ్లు తిరిగి మాకు ఫోన్‌ చేశారు. మేము పోలీసులతో మాట్లాడి రాధిక తల్లిదండ్రులను ఘటన జరిగిన పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌కు పంపించాము. అక్కడి పోలీసులు వేణును పిలిపించి మాట్లాడారు. ఇద్దరితో మాట్లాడి కాంప్రమైజ్‌ చేసే ప్రయత్నం చేశారు. అమాయకులైన రాధిక తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను బెదిరించి కేసు నమోదు చేయకుండా ఆమెకు జరిగిన నష్టానికి వేణు వాళ్ల మామయ్యతో రాధికకు పది వేల రూపాయలు ఇప్పించే ప్రయత్నం చేశారు.
ఇది సరైనది కాదని మేమే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాము. మైనర్‌ అమ్మాయితో సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకొని లైంగిక దాడి చేసిన వేణుపై కేసు నమోదు చేయాల్సిందే అని గట్టిగా మాట్లాడాము. వేణుపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేయించాము. ఎఫ్‌.ఐ.ఆర్‌ బుక్‌ చేయించాము. దాంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అప్పుడు అతని గురించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. అతని వయసు 30 ఏండ్లు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాదు. అప్పటికే అతనిపై మూడు కేసులు ఉన్నాయి. ఇలా అమ్మాయిలను మోసం చేస్తూ జులాయిగా తిరుగుతుంటాడు. ప్రస్తుతం వేణు జైల్లో ఉన్నాడు.
ఏది ఏమైనా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. సోషల్‌ మీడియాలో ముక్కూ మొహం తెలియని వాళ్లతో పరిచయాలు పెట్టుకొని మోస పోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఇలా అపరిచితులతో మాట్లాడడం, కలవడం అస్సలు మంచిదికాదు. మంచైనా చెడైనా కుటుంబ సభ్యులే మనకు తోడుగా నిలబడేది. కనుక ఇంట్లో వాళ్లను మోసం చేసి అనవసరంగా సమస్యలు తెచ్చుకోవద్దు. అలాంటి వారందరికీ రాధిక జీవితం ఒక గుణపాఠం లాంటిది.

– వై వరలక్ష్మి,
9948794051

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad