స్పీకర్, మండలి చైర్మెన్ విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభాధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వాధికారులు, పోలీసు శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఆయా శాఖలపై చర్చ జరుగుతున్నప్పుడు సంబంధితాధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందించాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమావేశాలు సజావుగా నిర్వహించడానికి పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భారీ వర్షాలు కురిసి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో పనిచేసి సభ్యులు సరైన సమయానికి సభలకు చేరుకునేలా సహకరించాలని సూచించారు. సభా సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే అడ్డుకునేందుకు చర్యలు తీసుకుని, సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు.
విజయవంతం చేయండి : చైర్మెన్ సుఖేందర్‌రెడ్డి
కౌన్సిల్ చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని చెప్పారు. అవసరమైన నోడల్ అధికారులు, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని సూచించారు. తెలంగాణ పోలీసు దేశంలోనే సమర్ధవంతమైనదని ప్రశంసించారు. వారి ఆధ్వర్యంలో శాసనమండలి సమావేశాలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సహకారం అందిస్తాం : సీఎస్ రామకృష్ణారావు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు మాట్లాడుతూ సభలు సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహాచార్యులు, జీఏడీ కార్యదర్శి రఘనంందన్‌రావు, అదనపు కార్యదర్శి (ఫైనాన్స్) రాయ రవి, డైరెక్టర్ ప్రోటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, ఏడీజీ ఆర్డర్ మహేశ్ భగవత్, అదనపు లా అండ్ ఆర్డర్ విక్రమ్‌సింగ్ మాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సుధీర్‌బాబు, అవినాష్ మహంతి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కరుణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్‌టెన్షన్ పొందిన చీఫ్ సెక్రటరీ కె. రామకష్ణారావుకు ఉన్నతాధికారులంతా శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలకు సహకరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES