Tuesday, May 6, 2025
Homeఆటలుఆస్కార్‌ తీన్‌మార్‌

ఆస్కార్‌ తీన్‌మార్‌

- Advertisement -

– మియామి గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ సొంతం
మయామీ (యుఎస్‌ఏ) : ఆస్ట్రేలియన్‌ ఎఫ్‌1 డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి హ్యాట్రిక్‌ కొట్టాడు. 2025 ఎఫ్‌1 సీజన్‌ తొలి ఆరు రేసుల్లోనే వరుసగా మూడో విజయం, ఓవరాల్‌గా నాల్గో విజయం నమోదు చేశాడు. ఆదివారం ఫ్లోరిడాలోని మయామి గార్డెన్స్‌ అంతర్జాతీయ రేసు ట్రాక్‌పై జరిగిన ఫైనల్లో ఆస్కార్‌ పియాస్ట్రి అదరగొట్టాడు. సవాల్‌తో కూడిన 57 ల్యాప్‌ల మమామీ ట్రాక్‌ను 1.28.51.587 (ఒక గంట 28 నిమిషాల 51 సెకండ్ల, 587 మిల్లీ సెకండ్ల)లో పూర్తి చేసిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి చాంపియన్‌గా నిలిచాడు. మెక్‌లారెన్‌కే చెందిన మరో డ్రైవర్‌ ల్యాండో నోరిస్‌ రెండో స్థానంలో నిలిచాడు. పియాస్ట్రి కంటే 4.630 సెకండ్ల తర్వాత రేసు ముగించిన నోరిస్‌ మరోసారి సహచర డ్రైవర్‌ తర్వాతి స్థానానికి పరిమితం అయ్యాడు. జార్జ్‌ రసెల్‌, మాక్స్‌ వెర్‌స్టాపెన్‌, అలెక్స్‌ ఆల్బన్‌లు టాప్‌-5లో నిలిచాడు. ఆస్కార్‌ పియాస్ట్రి 25 పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. ల్యాండో నోరిస్‌ 18 పాయింట్లు, రసెల్‌ 15, వెర్‌స్టాపెన్‌ 12, ఆల్బన్‌ 10 పాయింట్లు దక్కించుకున్నారు. సీజన్లో ఓవరాల్‌గా నాల్గో రేసు గెలిచిన ఆస్కార్‌ పియాస్త్రి డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రీతో మొదలైన ఆస్కార్‌ పియాస్ట్రి జోరు.. మయామీలోనూ కొనసాగింది. బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రీ, సౌదీ అరేబియా గ్రాండ్‌ ప్రీ టైటిళ్లను సాధించిన ఆస్కార్‌.. మయామీ గ్రాండ్‌ ప్రీతో హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు. ఎఫ్‌1 చరిత్రలో సీజన్‌ తొలి ఆరు రేసుల్లో నాలుగింట విజయాలు సాధించిన డ్రైవర్‌గా మైకా హక్కినెన్‌ (1998) తర్వాతి స్థానంలో ఆస్కార్‌ పియాస్ట్రి నిలిచాడు. వరుసగా మూడు రేసులు గెలుపొందిన ఆస్ట్రేలియన్‌ డ్రైవర్‌గా ఆలన్‌ జోన్స్‌, జాక్‌ బ్రాబమ్‌ సరసన ఆస్కార్‌ పియాస్ట్రి నిలిచాడు. వెర్‌స్టాపెన్‌ పోల్‌ పొజిషన్‌తో రేసును మొదలెట్టినా.. ఆస్కార్‌ పియాస్ట్రి పేస్‌ను ఎవరూ అందుకోలేకపోయారు. ఆరంభం నుంచీ ముందంజ వేసిన ఆస్కార్‌ స్పష్టమైన వ్యత్యాసంతో చాంపియన్‌గా అవతరించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -