– సర్వస్వం కోల్పోయినా… తక్షణ సాయం అందలే
– కరెంట్, తాగునీటిని పునరుద్ధరించాలి
– పంటలకు ఎకరాకు రూ.20 వేలు చెల్లించాలి : కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– పరిశీలన పోచారం ప్రాజెక్ట్ సందర్శన
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/భిక్కనూర్/ హవేలీఘనపూర్
భారీ వర్షాలతో ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. వరదతో సర్వస్వం కోల్పోయిన వారికి ఇప్పటికీ ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించకపోవడం తగదనీ, వెంటనే సాయం ప్రకటించి ఆదుకోవాలని కోరారు. పంట నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బృందాలను పంపి అంచనా వేసి, తక్షణమే పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలో వరదలకు ముంపునకు గురైన బీఆర్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, జీఆర్ కాలనీ కౌండిన్య నగర్‌లో పార్టీ నాయకులతో కలిసి శుక్రవారంనాడాయన ఇంటింటికీ తిరిగి బాధితులతో మాట్లాడారు. అదే సమయంలో అటుగా వచ్చిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో మాట్లాడారు. ముంపునకు గురైన కాలనీలకు యుద్ధప్రాతిపదికన తాగునీరు, కరెంట్ సరఫరాను పునరుద్ధరించి భోజన సదుపాయం కల్పించాలని సూచించారు. అందుకు కలెక్టర్ స్పందించి, వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు.అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ ‘కామారెడ్డి పట్టణంలో వరదను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తే, ఇంత పెద్దఎత్తున నష్టం జరిగి ఉండేది కాదు. ఇండ్లలోకి వరద చేరడంతో సరుకులు, సర్టిఫికేట్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఒక్కో కుటుంబానికి పది లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినా, ప్రభుత్వం ఇప్పటికీ తక్షణ సాయం ప్రకటించలేదు. వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డాయి. వారికి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం భోజనం, నీటి సౌకర్యం కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు.
కామారెడ్డి పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా వరదల వల్ల అనేక గ్రామాల్లో విద్యుత్, తాగునీరు లేక ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని జాన్‌వెస్లీ అన్నారు. వెంటనే ప్రభుత్వం అలాంటి గ్రామాలను గుర్తించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కామారెడ్డి జిల్లాకు రూ.2000 కోట్లు ప్రకటించాలని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధుల కోసం డిమాండ్ చేయాలని సూచించారు. భిక్కనూర్ మండలం లక్ష్మిదేవునిపల్లి గ్రామాన్ని సందర్శించి వరదలతో నష్టపోయిన పంటలను జాన్‌వెస్లీ పరిశీలించారు. రైతులు తిరిగి పంటలు సాగు చేయాలన్నా, పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించాలన్నా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పారు. ఎడ్లకట్ట వాగును సందర్శించి, దానిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు, ఆర్.వెంకట్రాములు, శోభన్ నాయక్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట గౌడ్, కొత్త నరసింహులు, మాజీ కౌన్సిలర్ రేణుక, అరుణ్, మోహన్, శ్రీను, సత్యం, రాహుల్, నితిన్ తదితరులు ఉన్నారు.
ప్రమాదాన్ని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలం పోచారం ప్రాజెక్ట్ సందర్శించిన జాన్‌వెస్లీ బృందం
భారీ వర్షాలలో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి గాల్లో పర్యటన చేస్తున్నారని, జిల్లా అధికారులు పైపై పరిశీలనలు చేసి, క్షేత్రస్థాయి ఇబ్బందులను గుర్తించడంలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు.
మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండల పరిధిలోని పోచారం ప్రాజెక్టు, పరిసర పంట పొలాలను శుక్రవారం సీపీఐ(ఎం) బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రాంత బాధితులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం ప్రాజెక్టు ఎనిమిది అడుగులపైకి పొంగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రోడ్డు మరమ్మతులు ఆలస్యం కావడంతో హైదరాబాద్‌కి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేసి తక్షణమే రైతులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. భారీ వర్షాలు, వరదలను పసిగట్టడంలో, అప్రమత్తమవ్వడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. రాజిపేట్ గంగమ్మ వాగులో పడి చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పోచారం ప్రాజెక్టు వరదతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలని, లేదంటే న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాడుతా మన్నారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు డిజి.నర్సింహారావు, జిల్లా కార్యదర్శి కె.నర్సమ్మ, నాయకులు వెంకట్రాములు, శోభన్ నాయక్, అడివయ్య, ఏ.మల్లేశం, కె.మల్లేశం, సంతోష్, అజరు, గౌరీ, కొమురయ్య, అశోక్, నర్సింలు, సాయిలు, నాగమణి, వై.దుర్గ, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
వరద బాధితులను ఆదుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES