బంజారా, లంబాడా, సుగాలీల ఎస్టీ హోదా పిటిషన్ విచారణ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
బంజారా, లంబాడా, సుగాలీల ఎస్టీ హోదాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సమాధానం ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మూడు వర్గాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మరికొందరు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి, అల్లంకి రమేశ్ ఈ ఏడాది జూలై 24న పిటిషన్ దాఖలు చేశారు. బంజారా, లంబాడాలు, సుగాలీలు గిరిజనులు కాదని, 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి అక్కడి అసలైన గిరిజనులకు ఉద్దేశించిన హక్కులను కొల్లగొట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఆంధ్రా ప్రాంతంలో ఎస్టీలుగా గుర్తించారని, కానీ హైదరాబాద్ స్టేట్‌లో కాదని స్పష్టం చేశారు. కాసు బ్రహ్మానందం రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఏదైనా ఒక రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఒక కులానికి చెందిన వారు ఎస్టీలు, మరికొన్ని జిల్లాల్లో బీసీలుగా ఉండడం సరికాదని అభిప్రాయపడ్డారని అందువల్లే ఆ మూడు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ, ఏపీలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో తెలంగాణలో వారిని తిరిగి బీసీ సామాజిక వర్గంలో చేర్చాలని ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ జె.కె మహేశ్వరి, జస్టిస్ విజరు బిష్ణోరులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు గతంలో మాదిరిగా వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం ఆర్టికల్ 342కు వ్యతిరేకమని వాదనలు వినిపించారు. ఈ వర్గాలు విద్యా, ఆర్థిక అంశాల్లో ఎస్టీ జాబితాల్లోని ఇతర వర్గాల కంటే అభివృద్ధి చెందారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. తద్వారా నిజమైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9 కి వాయిదా వేసింది.