Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబడుల్లో తగ్గుతోన్న చేరికలు

బడుల్లో తగ్గుతోన్న చేరికలు

- Advertisement -

– ఆందోళన కలిగిస్తున్న ఎన్‌రోల్‌మెంట్స్‌
– ఆ విద్యార్థుల నమోదు 25 లక్షలు పడిపోయిన వైనం
– ఎంఓఈ తాజా నివేదిక


న్యూఢిల్లీ : భారత్‌లోని స్కూళ్లలో చేరుతున్న చిన్నారుల సంఖ్య తగ్గిపోతున్నది. వారి నమోదు ఆందోళ నకరంగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాదీ ఎన్‌రోల్‌మెంట్‌ పడిపో తున్నది. 2023-24తో పోలిస్తే.. 2024-25లో అంగన్వాడీ, ప్రీస్కూల్‌, 1 నుంచి ఐదోతరగతి వరకు చూసుకుంటే 3 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థుల మొత్తం నమోదు 25 లక్షలు తగ్గిపోయింది. సాక్షాత్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ(ఎంఓఈ) తాజాగా విడుదల చేసిన యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడీఐఎస్‌ఈప్లస్‌) డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల నమోదు తగ్గిపోవటంపై మేధావులు, విద్యావేత్తలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తాజా నివేదిక డేటా ప్రకారం… భారత్‌లో అన్ని పాఠశాలల్లో (ప్రభుత్వ, ఎయిడెడ్‌, ఇతర స్కూళ్లు) 2023-24లో 12.09 కోట్ల మంది విద్యార్థులు (3-11 ఏండ్ల వయసున్నవారు) ఫౌండేషన్‌ దశల్లో చేరారు. ఇది 2024-25లో ఇది 24.93 లక్షలు తగ్గి.. 11.84 కోట్లుగా ఉన్నది. ఇక 1 నుంచి 12వ తరగతి వరకు చూసుకుంటే విద్యార్థుల నమోదు సంఖ్య 11 లక్షలు తగ్గింది. అంటే.. 24.8 కోట్ల నుంచి 24.69 కోట్లకు పడిపోయింది. ఇది 2018-19 నుంచి ఇప్పటి వరకు అత్యంత కనిష్టస్థాయి కావటం గమనార్హం.

జనన రేట్లలో తగ్గుదల.. పెరుగుతున్న వలసలు
స్కూళ్లలో నమోదవుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోవటంపై విద్యాశాఖలోని ఉన్నతాధికారులు పలు కారణాలు చెప్తున్నారు. ఇందులో రెండు ప్రధాన అంశాలున్నాయి. అవి జనన రేటు తగ్గుదల, వలసలు పెరిగిపోవటం. ప్రాథమిక పాఠశాలల్లో నమోదు సంఖ్య అధికంగా తగ్గటానికి దేశంలో జనన రేటు తగ్గుదల కారణం కావచ్చని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. యూపీ, బీహార్‌, మేఘాలయ మినహా.. అన్ని రాష్ట్రాలూ తక్కువ సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయని వివరించారు. 2021 నాటికి భారత్‌లో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్‌) 1.91కి పడిపోయింది. ఇది భర్తీ స్థాయి 2.1 కంటే తక్కువగా ఉన్నదని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2021 డేటా చెప్తున్నది.2012-13 నివేదికలో.. భారత్‌లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 26.3 కోట్లుగా ఉన్నది. అయితే 2021-22 డేటా ప్రకారం ఆ సంఖ్య 26 కోట్లకు తగ్గిపోయింది. 2022-23లో 24.8 కోట్లకు దారుణంగా పడిపోయింది. 2021-22తో పోలిస్తే ఈ తగ్గుదల ఆరు శాతం (1.22 కోట్ల మంది విద్యార్థులు) కావటం ఆందోళనకరమని విద్యావేత్తలు చెప్తున్నారు. కాగా 2023-24 నుంచి 2024-25 మధ్య మిడిల్‌ స్కూల్‌ (ఆరు నుంచి 8వ తరగతి) మొత్తం విద్యార్థుల నమోదులో సుమారు ఆరు లక్షల పెరుగుదల ఉన్నదని అధికారులు వివరించారు. అలాగే స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) కూడా మెరుగుపడిందనీ, 89.5 శాతం నుంచి 90.3 శాతానికి పెరిగిందని చెప్పారు. డ్రాపౌట్‌ రేట్లు కూడా 3.7 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గినట్టు వివరించారు. ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తి కూడా మెరుగుపడిందని ఉన్నతాధికారులు చెప్పారు. 2014-15లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా.. 2024-25 నాటికి ఇది ప్రతి పది మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. స్కూళ్లలో విద్యార్థుల నమోదు తగ్గిపోవటంపై విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో విద్యకు రూ.లక్షల కోట్లు కేటాయించి, వెచ్చించినా.. ఆశించిన ఫలితాలు రాకపోటం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని అంటున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పుడే మంచి ఫలితాలుంటాయని గుర్తు చేస్తున్నారు. స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, మేధావులు సూచిస్తున్నారు.

విద్యారంగంపై కార్పొరేట్ల పంజా
భారత్‌లో రోజురోజుకూ కొత్త స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చదువుల్లో నాణ్యతను విస్మరించి కేవలం మార్కులు, గ్రేడ్లకే ప్రాధాన్యతినిస్తున్నాయి. కారణం.. విద్య అనే కీలకమైన రంగంపై ప్రభుత్వాల పర్యవేక్షణ లోపించటమే. ఫలితంగా కార్పొరేట్లు ఈ రంగంలోకి ప్రవేశించి విద్యను వ్యాపారం చేస్తున్నాయి. అత్యధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రజల జీతాలు, ఆదాయాలు ఉండటంలో లేవు. దీంతో ఈ ఖరీదైన విద్యను భరించలేని విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ పిల్లల చదువులకు మధ్యలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టిస్తున్నారు. మరికొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించటంతో చదువుల్లో నాణ్యత కొరవడుతోందని విద్యావేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఈ రంగంపై ప్రభుత్వాలు మరింత దృష్టిని పెట్టాల్సిన అవసరాన్ని వారు వివరిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad