– గతంలో తెచ్చిన జీవోను రద్దు చేయాలి
– అరాచకవాదులపై చర్యలు తీసుకోవాలి
– ఎస్వీకే వెబినార్‌లో పైళ్ల ఆశయ్య, పెద్ది వెంకట్రాములు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ (వీడీసీ)లను రద్దు చేయాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కో కన్వీనర్ పైళ్ల ఆశయ్య, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారుడు పెద్ది వెంకట్రాములు డిమాండ్ చేశారు. దీని కోసం గతంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోను పునరుద్ధరించాలని కోరారు. గ్రామ అభివద్ధి కమిటీలను రద్దు చేసేందుకు, వారిపై చర్యలు తీసుకునేలా కాంగ్రెస్ సర్కార్ కొత్త జీవోను కూడా తీసుకురావాలని సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయంలో సోమవారం ”వీడీసీల ఆగడాలు – అరికట్టలేని ప్రభుత్వాలు ” అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ ఎవరైతే అడిగినంత డబ్బులివ్వరో, ఆ కులాల వారిని వీడీసీలు బహిష్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలు, ధనవంతులపై ఎలాంటి చర్యలుండవని తెలిపారు. వీడీసీల చేస్తున్నదని అన్యాయమని తెలిసినా ఆయా గ్రామాల్లో మిగిలిన కులాలు బహిరంగంగా బాధితులకు మద్ధతుగా నిలబడలేకపోతున్నారని తెలిపారు. దీంతో వీడీసీల సమాంతర పాలన కొనసాగుతున్నదని చెప్పారు. నిజామాబాద్‌లో అనేక గ్రామాల్లో సంఘ బహిష్కరణలు చేసినా, శ్రీరాముని ఆలయానికి వెళ్లే హిందూ మహిళలను అడ్డుకున్న స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజరు స్పందించడం లేదని తెలిపారు. రజకలు, వడ్డెరలు, ముదిరాజ్‌లు, గౌడ్‌లు ప్రతి కులం ఏదో ఒక గ్రామంలో బాధితులుగా మారుతున్నారని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా ప్రజాసంఘాలు, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు.
పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలోనూ వీడీసీలను వెంటనే రద్దు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణలో దాదాపు 50 నుంచి 60 నియోజకవర్గాల పరిధిలో 1,000కిపైగా గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ తదితర గ్రామపాలన కోసం వచ్చే ప్రాతినిథ్యంలో రిజర్వేషన్ అమలు తర్వాత తమ పెత్తందారీతనాన్ని నిలబెట్టుకునేందుకు వీడీసీలను బలోపేతం చేసుకున్నారని ఆరోపించారు. హిందువులపై భూస్వాములు దౌర్జన్యం చేస్తున్నా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని విమర్శించారు. బహిష్కరణకు పాల్పడ్డ వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు భయపడుతున్నాయనీ, గెలిపించే ఓట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీల వద్ద ఉన్నాయే తప్ప వీడీసీల వద్ద కాదని స్పష్టం చేశారు.
వీడీసీలను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES