– ఆర్టీసీని ప్రభుత్వం పరిరక్షించాలి
– ఎంవి యాక్ట్, విద్యుత్ బస్సుల విధానాన్ని సవరించాలి
– 20న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటాం : ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సమ్మె నోటీసు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ- ఐఎన్‌టీయూసీ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్-సీఐటీయూ) డిమాండ్ చేశాయి. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ విధానాలను మార్చుకోవాలని కోరాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకోవాలనీ, 17 డిమాండ్ల సాధన కోసం 11 జాతీయ కార్మిక సంఘాలు, రంగాల స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని ప్రకటించాయి. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక శాఖ కమిషనర్‌కు సోమవారం హైదరాబాద్‌లో ఎస్‌డబ్ల్యూయూ వైస్ చైర్మెన్ జి అబ్రహం, ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి విఎస్ రావు సమ్మె నోటీసును అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొనడం ద్వారా ఆర్టీసీ కార్మికుల హక్కులు, చట్టాలు రక్షించబడతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల దేశంలోని ఆర్టీసీలు తీవ్రమైన ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు.
125వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టీసీలకు కల్పించిన ప్రత్యేక హక్కుల రక్షణను నిర్వీర్యం చేస్తూ ఎంవి యాక్ట్‌ను అమలు చేస్తున్నాయని తెలిపారు. 2019 డిసెంబర్ నుంచి ఆర్టీసీ కార్మికోద్యమంపై ఆంక్షలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. యూనియన్లు, యాజమాన్యం మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లేవని వివరించారు. సామాజిక భద్రతా పథకాలైన పీఎఫ్, ఎస్‌ఆర్బీఎస్, ఎస్బీఈటీ ట్రస్ట్‌లను ట్రస్టీలు లేకుండానే నిర్వహిస్తూ నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని విమర్శించారు. మెజార్టీ కార్మిక సంఘాన్ని నిర్ణయించేందుకు ఎనిమిదేండ్లుగా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల్లేవని తెలిపారు. ఎనిమిది గంటల పనివిధానం పది, 12 గంటల మాటగానే మారిందని పేర్కొన్నారు. మోటార్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యాక్ట్-1961ను అసలు పట్టించుకోవడం లేదని తెలిపారు. 29 చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లఉ అమలైతే కార్మికులు కట్టుబానిసలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కోడ్‌లు అమలైతే సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, ఉమ్మడి బేరసారాల హక్కు వంటివి ఉండబోవని స్పష్టం చేశారు. ఇప్పుడు 14 రోజుల ముందు నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్లొచ్చని తెలిపారు. కోడ్‌లు అమలైతే 60 రోజుల ముందు సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ బస్సుల విధానం వల్ల మొత్తం జీసీసీ పద్ధతిలోనే నడపాలని నిర్దేశిస్తున్నదని తెలిపారు. టెండర్లు కూడా కేంద్రం స్థాయిలోని సీఈఎస్‌ఎల్ సంస్థ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం విద్యుత్ బస్సులను తేవాలని నిర్ణయించినందున కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూయూ నాయకులు సాయిరెడ్డి, నగేశ్ పటేల్, జక్రయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు ఎవి రావు, ప్రచార కార్యదర్శి పి రవీందర్‌రెడ్డి, కార్యదర్శి జిఆర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గీత, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES