ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు చెంచాలు

– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు చెంచాలుగా మారారని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దళితుల భూములను ప్రభుత్వం గుంజుకుంటుంటే ఎందుకు మాట్లాడటం లేదని ఆయన వారిని ప్రశ్నించారు. బడంగ్‌పేట్‌లోని దావుద్‌ఖాన్‌ గూడలో భూములు కోల్పోయిన దళితులు సాగిస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దావుద్‌ ఖాన్‌ గూడలోని సర్వే నంబర్‌-2 లో అసైన్డ్‌ భూమి ఆక్రమణలకు వ్యతిరేకంగా గత 12 రోజులుగా బాధితులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమణల వెనుక విద్యాశాఖ మంత్రి హస్తం ఉందని ఆరోపించారు. తక్షణమే మంత్రిని భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.మంత్రి ప్రోద్బలంతోనే పోలీసులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై,దళితులపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. మీర్‌ పేట్‌, మేడ్చల్‌, మేడిపల్లి, బుద్వేల్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, మొకిలాలో తరతరాలుగా సేద్యం చేసుకుంటున్న దళితుల అసైన్డ్‌ భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్నదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను ప్రభుత్వం గుంజుకుని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నదని ప్రవీణ్‌కుమార్‌ ఈ సందర్భంగా విమర్శించారు.
గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలి
నేడు గన్‌ పార్క్‌ వద్ద శాంతియుత సత్యాగ్రహ దీక్ష
గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్‌లోని గన్‌ పార్క్‌ వద్ద శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల టీచర్‌ పోస్టులు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్ల పరీక్షలు పూర్తయిన తర్వాతే గ్రూప్‌-2 నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెలలోనే ఐబీపీఎస్‌,ఆర్‌ఆర్‌ బీ వంటి అనేక పరీక్షలు ఉండటం వల్ల అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షల షెడ్యూలు విడుదల కావటంతో లక్షలాది మంది గ్రూప్‌-2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన గ్రూప్‌-2 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయటాన్ని ఆయన హెయమైన చర్య అని విమర్శించారు. గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ -1 తో సహా అన్ని పరీక్షల పేపర్లు లీకేజీ కావడం వల్లనే ఈ దుస్థితి నెలకున్నదని గుర్తుచేశారు. గ్రూప్‌-2 అభ్యర్థుల విన్నపం మేరుకు మరో మూడు నెలలు ఆ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతి పరీక్షకు మధ్య మూడు నెలల గ్యాప్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని గతంలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

 

Spread the love