– ఆరుగురు చిన్నారులకు విముక్తి
– నిందితుల నుంచి రూ.5 లక్షలు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్
నవతెలంగాణ-మియాపూర్
పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి ఆరుగురు పిల్లలకు విముక్తి కల్పించారు. నిందితుల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు, సిద్ధిపేటకు చెందిన చెలుకూరి రాజు, మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నరసింహారెడ్డి, బాలరాజు ఒక ముఠాగా ఏర్పడ్డారు. రాజు నాలుగేండ్ల కిందట కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆడ శిశువును కిడ్నాప్ చేసి రూ.42వేలకు విక్రయించాడు. అప్పటి నుంచి తన సహచరులతో కలిసి కిడ్నాప్‌లు కొనసాగించాడు. హైదరాబాద్, సంగారెడ్డి, లింగంపల్లి, కాచిగూడ ప్రాంతాల్లో ఐదేండ్లలోపు చిన్నారులను రాజు గుర్తించేవాడు. రాజు, ఆసిఫ్, రిజ్వానా కలిసి కిడ్నాప్ చేసేవారు. అనంతరం ఆ పిల్లలను పెద్దమొత్తంలో డబ్బులకు అమ్మేవారు. ఆగస్టు 26వ తేదీన లింగంపల్లిలో అఖిల్‌ను కిడ్నాప్ చేశారు. ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముఠాపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో సోమవారం ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి అఖిల్(5), అమ్ములు (8నెలలు), లాస్య(5), అరుణ్(2), ఆద్వీక్(2), ప్రియ(1)ను రక్షించారు. పిల్లల తల్లిదండ్రు లను ఇంకా గుర్తించలేదు. వీరిని జిల్లా బాల సంరక్షణ అధికారికి అప్పగిం చారు. నిందితులను విచారించగా.. పటాన్‌చెరువుకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను స్వయంగా అమ్మినట్టు వెల్లడైంది. ఈ ముఠా సభ్యులకు ఇతర వ్యక్తులతో ఏదైనా సంబంధం ఉందా అనే విషయంలో దర్యాప్తు జరుపు తున్నట్టు డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన మియాపూర్ ఏసీపీ, చందానగర్ సీఐ విజరు, డీఐ భాస్కర్‌నాయక్‌ను డీసీపీ అభినందించారు.
పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES