Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయందేశంలో పెరుగుతున్న సామాజిక అసమానతలు

దేశంలో పెరుగుతున్న సామాజిక అసమానతలు

- Advertisement -

నాటి రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు..
– కార్పొరేట్‌ కంపెనీలకు బీజేపీ పెద్దపీట : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– నెల్లుట్లలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ-జనగామ

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేపడుతూ ముందుకు సాగుదామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా లింగాలఘన్‌పూర్‌ మండలం నెల్లుట్ల గ్రామంలో సోమవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జాన్‌వెస్లీ ప్రారంభించారు. అంతకుముందు రైతాంగ సాయుధ పోరాట యోధులను స్మరిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటికీ స్ఫూర్తి అని అన్నారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది ఉద్యమకారులు, ప్రజలు తాము అనుకున్న లక్ష్యం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు. అమరులను స్మరిస్తూ ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం నాడు కమ్యూనిస్టు పార్టీ ప్రజలను ఐక్యం చేసిందని గుర్తు చేశారు. అన్నింటినీ ఓర్చుకొని ప్రజలు పోరాడి అజేయులుగా నిలిచారని చెప్పారు.
ఆ ఉద్యమ ఫలితంగా భూసంస్కరణలు అమలయ్యాయని తెలిపారు. ఇది కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితమేనన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటం నిర్వహించి 79 సంవత్సరాలు అవుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాట విషయాలను స్మరిస్తూనే భవిష్యత్‌లో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.

కేంద్రంలో బీజేపీ మత ఘర్షణలు రెచ్చగొడుతూ పాశవిక కాషాయ పాలన సాగిస్తోందన్నారు. కార్మికులతో పాటు ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. దేశంలో రోజురోజుకూ సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు కమ్యూనిస్టుల నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమాల్లో ప్రజలు సంఘటితమై కలిసిరావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్‌ బందగి లాంటి అనేకమంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నేలకొరిగినట్టు గుర్తు చేశారు. జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ముగింపు సభలో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నట్టు తెలిపారు.

అంతకుముందు జనగామ పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద జాన్‌వెస్లీ ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇర్రి అహల్య, బోట్ల శేఖర్‌, రాపర్తి రాజు, సింగారపు రమేష్‌, నాయకులు జోగు ప్రకాష్‌, బూడిద గోపి, బోడ నరేందర్‌ యాకయ్య, చుంచు విజయేందర్‌, చందు నాయక్‌, మహేందర్‌, నాగరాజు, బొడ్డు కరుణాకర్‌, దేవదానం, పందిళ్ళ కళ్యాణి, దాస గాని సుమా, శంకరయ్య వెంకటేష్‌ ఉప్పలయ్య నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad