నవతెలంగాణ – గోవిందరావుపేట
ఘన నివాళిలు అర్పించిన జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలో మంగళవారం దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి వారికీ ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భముగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహా నేత అని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ లాగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన గొప్ప నేత రాజశేఖర్ రెడ్డి అన్నారు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది.
ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడని ఉద్వేగంతో ఎల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108, 104 లు ఎమర్జెన్సీ సేవలు, ఇందిరమ్మ గృహ కల్పనా, విద్యార్థులకు ఫీజ్ రీ- ఇంబర్సుమెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల పంట రుణ మాఫీ లాంటి పథకాలతో ఎంతో మంది పేదలను అభివృద్ధి పరిచిన మహనీయుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.