– వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో
– రైతులతో మాట్లాడి శాంతింపచేసిన ఎస్ఐ రాజేందర్
నవతెలంగాణ – రాయపర్తి
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. రాత్రనకా.. పగలనకా.. విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారక సంఘం భవనానికి రెండు లారీ లోడుల యూరియా వచ్చిందని సమాచారంతో మంగళవారం తెల్లవారు 4 గంటల నుండి రైతులు క్యూ లైన్ కట్టారు. సమయం ఉదయం పది కావస్తున్న టోకెన్ లు, యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన రైతులు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
దాంతో రోడ్డుకు ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అదను దాటుతున్న పంటకు వేసేందుకు యూరియా సరిపడా దొరకడంలేదని రైతులు బాధపడుతున్నారు. వ్యవసాయ పనులు మానుకుని రైతులు, ఇంటి పనులు మానుకుని మహిళలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట క్యూలో పడిగాపులు కాస్తున్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బస్తాలు ఇచ్చేంతవరకు రాస్తారోకోను నిర్వహిస్తామని రైతులు తెగేసి చెప్పారు. రాస్తారోకో ఘటన స్థలానికి విచ్చేసిన ఎస్ఐ ముత్యం రాజేందర్ రైతులతో మాట్లాడి రైతుల ఆక్రోశాని శాంతింప చేశారు.
వచ్చిన యూరియాను రైతులకు అందజేస్తాం
యూరియా బస్తాలు వచ్చినప్పటికీ రైతులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని “నవతెలంగాణ” రాయపర్తి పిఎసిఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డిని వివరణ కోరగా… రెండు లారీల్లో 888 యూరియా బస్తాలు వచ్చినట్లు తెలిపారు. గతంలో 15 మందికి టోకెన్ లు ఇచ్చి యూరియా బస్తాలు ఇవ్వలేదని వారికి మొదటగా ఇచ్చిన తర్వాత టోకెన్ ఉన్న ప్రతి రైతుకు యూరియా బస్తాలు ఇస్తామని వివరించారు. రైతుల తాకిడి ఎక్కువగా ఉండడం, బస్తాలు పంపిణీ చేస్తే తోపులాట జరుగుతుందని ఆలోచనతో ఒక్కరోజు గడువు తీసుకొని పోలీసుల సహకారంతో యూరియా బస్తాలు ఇస్తామని తెలిపారు.