Wednesday, September 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగుల ఆరోగ్య పథకానికి పచ్చజెండా

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి పచ్చజెండా

- Advertisement -

– నగదు రహిత వైద్యం కోసం హెల్త్‌కేర్‌ ట్రస్టు ఏర్పాటు
విధివిధానాల రూపకల్పనకు 8న సీఎస్‌తో సమావేశం
– పెండింగ్‌ బిల్లుల కోసం నెలకు రూ.700 కోట్లు చెలిస్తాం
– త్వరలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు
– 317 జీవో బాధితులకు డిప్యూటేషన్లు
– ఆర్నెల్ల తర్వాత మరో డీఏ
– ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం : జేఏసీ నేతలతో భేటీలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్‌ భట్టి విక్రమార్క
– 8 నుంచి బస్సుయాత్ర, అక్టోబర్‌ 12న చలో హైదరాబాద్‌ వాయిదా : ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ శ్రీనివాసరావు ప్రకటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)కి సంబంధించి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నగదు రహిత వైద్యం అందించడం కోసం హెల్త్‌కేర్‌ ట్రస్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈహెచ్‌ఎస్‌ విధివిధానాల రూపకల్పన కోసం ఈనెల ఎనిమిదో తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)తో సమావేశం ఉంటుందని భట్టి విక్రమార్క వివరించారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు సంబంధించి నెలకు రూ.700 కోట్లు తప్పనిసరిగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే నెలకు రూ.750 కోట్లు చెల్లిస్తామన్నారు. త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో స్థానికత కోల్పోయిన 317 జీవో బాధితులకు డిప్యూటేషన్లు కల్పిస్తామన్నారు. ఆర్నెల్ల తర్వాత తర్వాత మరో డీఏ చెల్లిస్తామని ప్రకటించారు. మిగిలిన డీఏలను పీఆర్సీలో కలుపుతామని అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇవ్వడంతో ఉద్యోగ జేఏసీ తలపెట్టిన ఉద్యమ కార్యాచరణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈనెల ఎనిమిది నుంచి 19 వరకు నిర్వహించే బస్సుయాత్ర, అక్టోబర్‌ 12న చలో హైదరాబాద్‌ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉద్యోగ జేఏసీ నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీఎస్‌ కె రామకృష్ణారావు చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్‌ అధికారులు నవీన్‌ మిట్టల్‌, సందీప్‌కుమార్‌ సుల్తానియా, బిఎండీ ఎక్కా, లోకేశ్‌కుమార్‌, క్రిస్టినా జెడ్‌ చోంగ్తు, రఘునందన్‌రావు, కృష్ణభాస్కర్‌తోపాటు ఉద్యోగ జేఏసీ చైర్మెర్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ పుల్గం దామోదర్‌రెడ్డి, కోచైర్మెన్‌ చావ రవి, జి సదానందంగౌడ్‌, వంగ రవీందర్‌రెడ్డి, పి మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఎ సత్యనారాయణ, అనిల్‌కుమార్‌, టి లింగారెడ్డి, కె లక్ష్మయ్య, జి స్థితప్రజ్ఞ, ఎ వెంకట్‌, కటకం రమేష్‌, కస్తూరి వెంకటేశ్వర్లు, బి శ్యామ్‌, పి కృష్ణమూర్తి, రాధాకృష్ణ, ఎన్‌ తిరుపతి, ఎన్‌ సోమయ్య, ఎండీ అబ్దుల్లా, మణిపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌, ఉమాదేవి, బి కొండయ్య, శ్రీకాంత్‌, కృష్ణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ రద్దుపై సీఎంతో చర్చిస్తామన్నారు : జగదీశ్వర్‌
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకే ఉద్యమ కార్యాచరణను వాయిదా వేస్తున్నామని ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ చెప్పారు. ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు కాదన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమేనని స్పష్టం చేశారు. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ సోమవారం ఇందిరాపార్క్‌ వద్ద, ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన సభల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరయ్యారని గుర్తు చేశారు. సీపీఎస్‌ రద్దుపై సీఎంతో చర్చిస్తామంటూ మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని అన్నారు. త్వరలోనే పీఆర్సీని నివేదికను తెప్పించుకుని అమలు చేస్తామన్నారని చెప్పారు. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌పై విద్యాశాఖ కార్యదర్శితో ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఉంటుందన్నారు. సచివాలయంలో కారుణ్య నియామకాలను చేపడతామన్నారని చెప్పారు. 13 ఏండ్ల నుంచి రాష్ట్రంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ లేదన్నారు. త్వరలోనే సీఎస్‌ నేతృత్వంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామన్నారని వివరించారు. ఒక డీఏ ఇచ్చారనీ, మరో డీఏ ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల కోసం నెలకు రూ.700 కోట్లు చెల్లిస్తామన్నారని వివరించారు. అవసరమైతే రూ.750 కోట్లు ఇస్తామన్నారని అన్నారు. నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు చేస్తామన్నారని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలపడంతోపాటు ప్రభుత్వాన్ని అడిగే హక్కుందన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు చెప్పారు.

ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేయాలి : దామోదర్‌రెడ్డి
ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సమస్య 25 ఏండ్లుగా పరిష్కారం కాలేదనీ, వెంటనే పరిష్కారం చేయాలని ఉద్యోగ జేఏసీ అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ పుల్గం దామోదర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పర్యవేక్షణ అధికారుల్లేక విద్యావ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ కార్యదర్శి, సంచాలకులతో ఉపాధ్యాయ సంఘాల సమావేశాన్ని నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని చెప్పారు.

కొత్త మండలాల్లో క్యాడర్‌ స్ట్రెంత్‌ పెంచుతామన్నారు : శ్రీనివాసరావు
కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లలో క్యాడర్‌ స్ట్రెంత్‌ను పెంచుతామంటూ మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగ జేఏసీ సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతుల కమిటీ (డీపీసీ)ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో బదిలీ అయిన అధికారులను తిరిగి వారి సొంత స్థానాలకు బదిలీ చేయాలంటూ కోరామనీ, పరిశీలిస్తామన్నారని అన్నారు. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌పై విద్యాశాఖ కార్యదర్శితో సమావేశం ఉంటుందన్నారు. అధికారులకు సొంత వాహనాలను మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు, డీఏల విడుదల, పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు మరింత సమయం కావాలని మంత్రివర్గ ఉపసంఘం కోరిందన్నారు. ఈహెచ్‌ఎస్‌ విధివిధానాల కోసం సోమవారం సీఎస్‌తో సమావేశం ఉంటుందని అన్నారు. అందుకే కార్యాచరణను వాయిదా వేశామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -