ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘మంత్రుల నివాసాల ముట్టడి’
– ఫీజులు విడుదల చేయకుండా జీవితాలతో చెలగాటం
– ఆర్నెల్లుగా ఆందోళనలు చేస్తున్నాం
– విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం
– అరెస్టులు.. పలువురికి గాయాలు
– పోలీస్ స్టేషన్లకు తరలింపు
– రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
– అరెస్టులను ఖండిస్తున్నాం: ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి నాగరాజు
– నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
రాష్ట్రంలో గడిచిన ఆరేండ్ల నుంచి సుమారు రూ.8,158 కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలు ఉన్నాయని, వాటిని సర్కారు విడుదల చేయడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త ధర్నా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ‘మంత్రుల నివాసాల ముట్టడి’ చేపట్టారు. తమ సమస్యలను మంత్రులకు విన్నవించేందుకు వెళ్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర తోపులాట జరిగింది. విద్యార్థి నాయకులు తీవ్రంగా గాయపడగా.. పలువురి చొక్కాలను చింపి పోలీసులు దాడి చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ.. ఫీజుల బకాయి నిధులు విడుదల చేయకపోవడం వల్ల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని, దీనివల్ల పై చదువులకు వెళ్లలేక పోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 9 నెలలుగా గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలల్లో మెస్, కాస్మోటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా విడుదల చేయడం లేదని అన్నారు. కేజీబీవీలు, ఎస్సీ గురుకులాల్లో యూనిఫామ్, టెక్ట్స్ బుక్స్ పూర్తిస్థాయిలో అందించలేదన్నారు. పుస్తకాలు లేకుండా పాఠాలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరని, విద్యార్థులు చనిపోయినా, సమస్యలు వచ్చినా కనీసం విద్యారంగాన్ని పట్టించుకునే నాథుడే లేరన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు, యూనివర్సిటీల నిధుల బకాయిలు, పాఠశాల అభివృద్ధి కోసం ‘మన ఊరు మనబడి’ బకాయిలు ఇలా సమస్తం పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా చూడాలని, ప్రత్యేక జీవో తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. చొక్కాలను చింపేశారు. అనంతరం అరెస్టు చేసి బొల్లారం, కార్ఖానా, బోయినపల్లి, తిరుమలగిరి పోలీసు స్టేషన్ల్‌కు వారిని తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్, లెనిన్ గువేరా, అవినాష్, జె.రమేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కెవై.ప్రణరు, శ్రీకాంత్, తరంగ్, అరుణ్, వంశీ, లిఖిత్, చరణ్, తనిష్క, తరుణ్, కౌశిక్, సాయి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాల్లోనూ..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బస్టాండ్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ అధికారి జగన్ మోహన్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. జయశంకర్- భూపాలపల్లి జిల్లాలోని జాతీయ రహదారిపై విద్యార్థులు బైటాయించి పెద్దఎత్తున ధర్నా చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.
సంగారెడ్డిలో కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద బైటాయించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకి వినతిపత్రం అందజేశారు. మెదక్ పట్టణంలో విద్యార్థులు ర్యాలీ, సిద్దిపేట పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి.. ధర్నా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు. కలెక్టరేట్‌లో ఏఓకు వినతిపత్రం అందించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి సత్యనారాయణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
ఫీజులు అడిగితే దాడులు చేస్తారా?
రాష్ట్రంలో ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి, దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు ఖండించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో కోరారు. అరెస్టులకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. ”మంత్రుల నివాసాల ముట్టడి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, అశోక్, నాయకులు కార్తీక్, ప్రణరు, లెనిన్, అవినాష్, శ్రీకాంత్ తదితరులను అరెస్టు చేశారు. అశోక్‌రెడ్డి చొక్కా చించేశారు. శ్రీకాంత్ కాలికి రక్తం వచ్చేలాగా గాయాలు చేశారు. విద్యార్థులను రౌడిల్లా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వ్యాన్లలో వేశారు. హన్మకొండ, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమంగా అరెస్టు చేశారు. కనీసం సమస్యలు చెప్పుకోకుండా పోలీసులు నిర్బంధం ప్రయోగిస్తున్నారు” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం ఏక్కడుందని..? ప్రశ్నించారు. ఫీజులను విడుదల చేసి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రకటనలో హెచ్చరించారు.
– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు