Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమోడీ-షాకు బీహార్‌ భయం

మోడీ-షాకు బీహార్‌ భయం

- Advertisement -

– ఎన్నికల్లో ఓడిపోతే ‘పట్టు’ తప్పడం ఖాయం
– ఎన్డీఏలో కీలక భాగస్వామి నితీశ్‌ దూరమయ్యే ప్రమాదం
– బీజేపీ తదుపరి అధ్యక్షుడి ఎంపికలో మాట చెల్లుబాటుపైనా డౌటే..
– కాషాయపార్టీపై ఆరెస్సెస్‌ ఆధిపత్యం పెరిగే ఛాన్స్‌
– అందుకే విజయం కోసం అడ్డదారులు
– ఎస్‌ఐఆర్‌ అందులో భాగమే

బీజేపీలో ప్రధానంగా వినిపించే పేర్లు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. గుజరాత్‌ రాష్ట్రంలో మోడీ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయనకు కుడిభుజంగా అమిత్‌ షా ఎంతో కీలకంగా వ్యవహరించేవారు. మోడీ ప్రధాని అయిన తర్వాత కూడా బీజేపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పారు. ఇప్పుడు అత్యంత కీలకమైన కేంద్ర హోంశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలను నియంత్రించే సర్వాధికారాన్ని మోడీ-షా ద్వయం కలిగి ఉంది. కానీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే వీరి ఆధిపత్యానికి గండిపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే వీరిద్దరూ బీహార్‌ ఎన్నికల్లో అభద్రతాభావానికి గురౌతూ, విజయం కోసం అందుబాటులో ఉన్న అన్ని అడ్డదారుల్ని తొక్కుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే బీహార్‌లో ఏకంగా లక్షల సంఖ్యలో ఓటర్లనే తొలగించే దుర్మార్గ రాజకీయానికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ప్రభుత్వాల్ని కూల్చడంలో ‘ద్వయం’
ప్రతిపక్షపాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటం, అక్కడ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం వంటి చర్యలతో మోడీ-షా ద్వయం ప్రజల్లో అపఖ్యాతిని మూటగట్టుకున్నది. ఇప్పుడీ ఇద్దరినీ చూసి, ప్రత్యర్థుల కంటే సహచరులు, మిత్రులే ఎక్కువగా భయపడుతున్నారు. ముఖ్యంగా యూపీ సీఎంగా ఉన్న యోగి విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. మోడీ తర్వాత యోగినే అంటూ బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది అమిత్‌ షాకు ఆగ్రహాన్ని తెప్పించిందనీ, యూపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో వీరి వైరం కనిపించిందని ఆ సమయంలో కథనాలు వచ్చాయి. ప్రోటోకాల్‌ ప్రకారం ప్రధాని తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండో స్థానంలో ఉంటారు. కానీ అమిత్‌ షా అప్రకటితంగా రెండోస్థానంలో కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బీహార్‌ రాష్ట్రం చాలా కీలకం. కేంద్రంలో అధికారానికి సరిపడా ఎంపీ సీట్లు లేని కారణంగా బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యూ)పై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి బీహార్‌ సీఎంగా పని చేస్తున్న నితీశ్‌కు రాజకీయంగా స్థిరత్వం తక్కువ. కూటములను మార్చటం ఆయనకు కొత్తేం కాదు. బీహార్‌లో ఇప్పటికే నితీశ్‌ సర్కారుపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నితీశ్‌తో కలిసి బీహార్‌లో బీజేపీ పోటీ చేస్తుంది. ఒకవేళ అక్కడ ఓటమి పాలైతే దాని ప్రభావం దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో ఉంటుందనే భయం, ప్రస్తుత ప్రభుత్వ అస్తిత్వంపైనా ఆ ప్రభావం పడుతుందని మోడీ-షా ద్వయం భావిస్తున్నది. అందువల్ల బీహార్‌ విజయం నితీశ్‌కంటే బీజేపీకే అత్యవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ ఓడిపోతే ఆయన బీజేపీతో ఉంటాడనే గ్యారెంటీ కూడా లేదు. అదే జరిగితే పార్టీలో, ప్రభుత్వంలో మోడీ-షా ద్వయం పెత్తనానికి గండి పడటం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీ తదుపరి అధ్యక్షుడి ఎంపిక, ఎన్నిక విషయంలో వీరి మాట చెల్లుబాటూ సందేహమే. ఇప్పటికే మోడీ-షా ద్వయం వల్ల ఆరెస్సెస్‌తో బీజేపీకి దూరం పెరిగిపోయిన విషయం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ విషయం స్పష్టమైంది. బీహార్‌ను కోల్పోతే బీజేపీపై ఆరెస్సెస్‌ పెత్తనం పెరుగుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. అందుకే బీహార్‌లో వివాదాస్పద స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ద్వారా నడిపిస్తున్నదని ప్రతిపక్షాపార్టీలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎస్‌ఐఆర్‌ ద్వారా తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించి, ఎన్నికల్లో విజయం సాధించాలన్నదే బీజేపీ అసలు లక్ష్యంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

సీనియర్లకు చెక్‌
రాజస్థాన్‌లో బీజేపీ సీఎంగా ఒకప్పుడు చక్రం తిప్పిన వసుంధర రాజే సింధియాను అథ:పాతాళానికి తొక్కేసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘకాలంగా పాలించి, ప్రధాని రేసులో నిలిచిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి సీఎం పదవి చేపట్టకుండా ‘ద్వయం’ జాగ్రత్త పడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మహారాష్ట్రలో శివసేనను చీల్చింది. శివసేనలోని మరో కీలక నాయకుడు ఏక్‌నాథ్‌ శిండేను ముందుంచి, ఆ పార్టీని నిట్టనిలువునా చీల్చటంలో మోడీ-షా ప్రణాళిక ఉంది. ఆ తర్వాత శిండేను సీఎంగా చేసి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కకుండా చేయటంలో బీజేపీ విజయం సాధించింది. మహారాష్ట్రలో కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీ రెండు వర్గాలుగా చీలగా, అజిత్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్సీపీ మహారాష్ట్రలోని ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో 2016లో జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీకి నాయకత్వ శూన్యత ఏర్పడింది. దాన్ని అవకాశంగా తీసుకొని జయలలిత స్నేహితురాలు శశికళను ఏఐఏడీఎంకేకు దూరం చేసింది. ఆ తర్వాత ఆ పార్టీని నడిపించిన పన్నీర్‌సెల్వం, పళని స్వామిల మధ్య వైరాన్ని సృష్టించటంలో మోడీ-షా ద్వయం విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా స్నేహంగా ఉంటూనే పలు పార్టీలు, నాయకులను తొక్కివేయటంలో వీరిద్దరూ ఆరితేరారని, ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ఇవే విషయాలపై కలవరపడుతున్నాయనే రాజకీయ చర్చా జరుగుతోంది.

రాజ్యాంగబద్ధ సంస్థలే ఆయుధాలు
తమ రాజకీయ భవిష్యత్తు కోసం మోడీ-షా ద్వయం ఎంతకైనా తెగిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తమ మాట వినని వారిని కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలతో వేధించటం, తద్వారా వారిని తమ దారిలోకి తెచ్చుకోవటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ రాజకీయాల్లో అశాంతిని రేపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ రాజకీయ మనుగడ, అవసరాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, దేశ భవిష్యత్తును వీరు ప్రమాదంలో పడేస్తున్నారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad