Wednesday, November 5, 2025
E-PAPER
Homeఆటలుఐఎస్‌ఎల్‌కు మార్గం సుగమం!

ఐఎస్‌ఎల్‌కు మార్గం సుగమం!

- Advertisement -

టెండర్ల ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగల్‌
పర్యవేక్షకుడిగా జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు

న్యూఢిల్లీ : ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఎఫ్‌)కు సుప్రీంకోర్టులో ఊరట లభించిందని చెప్పవచ్చు. ఏఐఎఫ్‌ఎఫ్‌ నూతన రాజ్యాంగంపై అభ్యంతరాలతో వేసిన పిటిషనుపై సుదీర్ఘ విచారణ చేసిన సుప్రీంకోర్టు.. మంగళవారం నాటి ఆదేశాల్లో ఎన్నికలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్రస్తుత కార్యవర్గం పూర్తి పదవీ కాలం ఉండనుంది. ఇటీవల పార్లమెంట్‌ ఆమోదం పొందిన జాతీయ స్పోర్ట్స్‌ బిల్లుకు అనుగుణంగా ఏఐఎఫ్‌ఎఫ్‌ నూతన రాజ్యాంగాన్ని పరిశీలించేందుకు మరింత సమయం పడుతుందని ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) నిర్వహణకు మాస్టర్‌ రైట్స్‌ అగ్రీమెంట్‌ (ఎంఆర్‌ఏ) పునరుద్ధరణకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈ ఏడాది ఐఎస్‌ఎల్‌ సీజన్‌ నిలిచిపోయింది. ఐఎస్‌ఎల్‌ క్లబ్‌లు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వేతనాలు నిలిపివేశారు. భారత ఫుట్‌బాల్‌ భవిష్యత్‌ ప్రమాదంలో పడుతున్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. ఐఎస్‌ఎల్‌ సహా భారత ఫుట్‌బాల్‌ టోర్నమెంట్ల నిర్వహణకు అవసరమైన కమర్షియల్‌ భాగస్వాములను ఎంచుకునేందుకు టెండరు ప్రక్రియను మొదలుపెట్టమని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. ఈ టెండరు ప్రక్రియను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు పర్యవేక్షించనున్నారు. ఏఐఎఫ్‌ఎఫ్‌తో ఐఎస్‌ఎల్‌ మాస్టర్‌ రైట్స్‌ ఒప్పందాన్ని 15 ఏండ్లకు కుదుర్చుకోవాలని రిలయన్స్‌కు చెందిన ఫుట్‌బాల్‌ స్పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఐఎస్‌ఎల్‌ వాయిదా పడగా.. ఈ ఏడాది భారత ఫుట్‌బాల్‌ సీజన్‌ అక్టోబర్‌లో సూపర్‌ కప్‌ నుంచి షురూ కానుందని ఇటీవల ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -