Wednesday, May 7, 2025
Homeఎడిట్ పేజివాళ్లు కేనిబాల్స్‌ కాదు!

వాళ్లు కేనిబాల్స్‌ కాదు!

- Advertisement -

మనుషుల్ని పీక్కు తినేవారిని ‘కేనిబాల్స్‌’ అంటారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వంతో సంబంధంవున్న ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్‌ ఉద్యోగులందర్నీ కలిపి నరమాంస భక్షకులతో పోల్చారు మన ముఖ్యమంత్రి వర్యులు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా తెలిసే గత ఎన్నికల సందర్భంగా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. అవే కాంగ్రెస్‌ను ఒడ్డుకు చేర్చాయి. తీరా గెలిచాక అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఇటు ఆర్టీసీ కార్మికులకు తానేమీ చేయలేనని చేతులెత్తేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు వంటింటి కుందేళ్ళనీ, అధికార పార్టీకి అంటకాగుతుంటారని ప్రస్తుత, గత పాలకులకు గట్టి నమ్మకం. వారు అపర ధర్మరాజులనీ, వారికి కోపమేరాదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఊహాలోకాల్లో విహరిస్తుందనుకుంటా.
”అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు
అజాత శత్రువే (ధర్మరాజుకు ఇంకో పేరు) అలిగిన నాడు
సాగరములన్నియు ఏకముగాకపోవు” నన్న క్రిష్ణరాయబారంలోని పద్యము ఈ పాలకుల చెవులు చిల్లులు పడేలా ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోండి! పాలకులతో దగ్గరగా ఉంటే ఏవైనా పైరవీలవుతాయేమోగాని సాధారణ సమస్యలు, అదీ ఉద్యోగులందరికీ సంబంధించిన సమస్యలు పరిష్కారం కావు. ఈ విషయం అనుభవపూర్వకంగా 2018-23 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులందరికీ తెలిసొచ్చింది. వారంతా కుతకుతా ఉడికిపోయారు.
తమ ఆర్థిక డిమాండ్లే తప్ప సాధారణ ప్రజల సమస్యలు పట్టించుకోరనే అపప్రధ ప్రభుత్వ ఉద్యోగులపై ఉంది. పాలనా యంత్రాంగాన్ని సాధారణ ప్రజల నుండి విడదీసిన ఇంగ్లీషోడి పథకంలో భాగమే అదంతా. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ పాలకులు దాన్ని కొనసాగించారు. చాలామంది నాయకులు ఆ బురద కడుక్కోలేకుండా ఉన్నారు. సర్వీసు రూల్స్‌ పేర ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ పార్టీల వైపు చూడనివ్వలేదు మన పాలకులు. సాధారణ ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమానికి దూరంగా ప్రభుత్వ ఉద్యోగులనుంచారు. కనీసం ఇంగ్లండ్‌లో సివిల్‌ సర్వెంట్స్‌ యూనియన్‌ బ్రిటిష్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌లో సభ్యత్వం కలిగి ఉంది. అలాంటి స్థితి మన దేశంలో లేదు. తమ సభ్యులకు రాజకీయ ‘కాలుష్యం’ అంటకుండా చూసుకోవాలని కొందరు నాయకుల ప్రయత్నం. అపుడు తాము పాలకులకు అంటకాగచ్చని వారి భావన.
ఇటు ప్రభుత్వోద్యోగులు, అటు ఆర్టీసీ కార్మికులు ఆందోళనబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 1973-74 నాటి ఇందిరాగాంధీ రోజులకెళ్ళిందను కుంటా. ఆనాడు ఆమె ఇన్సూరెన్స్‌, బ్యాంకు, ప్రభుత్వరంగ కార్మికులను ‘హైవేజ్‌’ ఐలాండర్లని పిలిచింది. దేశమంతా దరిద్రంలో మగ్గిపోతూంటే అత్యధిక వేతనాలున్న ద్వీపాలుగా ఉన్నారని ఆ ఉద్యోగుల్ని తెగనాడింది. అసంఘటిత కార్మికులకు, సంఘటిత కార్మికులకు, సామాన్య రైతులకు, మహిళలకు ఇచ్చే రాయితీలను, సంక్షేమ పథకాలను ప్రభుత్వోద్యోగులకిచ్చే జీతాలతో పోటీ పెట్టి బెదిరించ చూడటం రాష్ట్ర కార్మికోద్యమం ఆమోదిస్తుందా? పైగా ఆర్థికేతర డిమాండ్లే తమ వాటిలో అత్యధికం ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పేది ఈ ప్రభుత్వం వినదా?!
తెలంగాణ ఏర్పడ్డాక మన శాసన సభ్యుల వేతనాలు, అలవెన్స్‌లు 163 శాతం పెరిగినాయట! మరి ఏ ఒక్క రంగంలోని కార్మికులు, ఉద్యోగులకు ఏపాటి పెరిగినాయో చెప్పగలరా? ప్రభుత్వానికి ఏ సంబంధంలేని ప్రయివేటురంగ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని అడిగినా గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలకులకు కడుపునొప్పెందుకు? ఆర్టీసీ కార్మికులకు 2022 ఏప్రిల్‌ నుండి రావాల్సిన లీవ్‌ ఎన్‌కాష్‌మెంట్‌ మనిషికి ఆరు లక్షల రూపాయల చొప్పున ఏడున్నర వేల మందికి రాకపోతే వారికి కడుపుమండదా? ఐదు నెలల గ్రాట్యుటీ బకాయిలు ఇవ్వకపోయినా అందరికీ ‘రెస్పాన్సిబిలిటీ’ ఉంది కాబట్టే ఇంతకాలం ఆగారు రేవంత్‌రెడ్డిగారూ!
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు లక్షన్నర ఖాళీ పోస్టులున్నాయి. వాటిని నింపకుండా చిరుద్యోగులపై పడ్డది ప్రభుత్వం. ఔట్‌సోర్సింగ్‌ వారిని తొలగిస్తారట! ఇదేం అన్యాయం? డబ్బుల్లేవని బీదరుపులు అరిచే పాలకులు ఏమవసరమని అందాలపోటీలకు రూ.200 కోట్లు మంజూరు చేశారు? ప్రతిదానికీ ప్రతి మంత్రీ హెలీకాఫ్టరెక్కి పయనమవు తున్నారు. ముఖ్యమంత్రి తాను వాడలేదంటున్నారు. నమ్ముదాం. తన సహచర మంత్రుల ‘గాలి చక్కర’్లకి బాధ్యతెవరిది? అది అవసరమా?! కేంద్రం నుండి రావాల్సిన బకాయిలపై నోరెందుకెత్తరు మహాశయా? అసలు జీఎస్‌టీ తమ పథకమేనన్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి బకాయిపడ్డ ఎస్‌జీఎస్‌టీ బకాయిల కోసమైనా కేంద్రంతో ఘర్షణపడ్డ ఒక్కటి కూడా కానరాదు. సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్‌ల్లో మన వాటా కోసం ప్రభుత్వం నోరు పెగలద్దు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ఇవ్వాల్సిన నిధులు అడగరా? తాగునీటి పథకాల కోసం రూ.15 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘమే సిఫారసు చేసింది. దానికీ దిక్కులేదు. ఈ నిధులన్నీ రాబట్టగలిగితే ఇంత బీదరుపులు అరవాల్సిన దుస్థితి ఉండదుకదా.
రావాల్సిన వాటి కోసం కేంద్రంతో తగాదా పడటం ఆపి ప్రభుత్వ ఉద్యోగులతో యుద్ధం చేయటం ఏం న్యాయం?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -