Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం'గ్లోబల్‌ డిజిటల్‌, ఇన్నోవేషన్‌ హబ్‌' గా తెలంగాణ

‘గ్లోబల్‌ డిజిటల్‌, ఇన్నోవేషన్‌ హబ్‌’ గా తెలంగాణ

- Advertisement -
  • మంత్రి శ్రీధర్‌ బాబు
    నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
    తెలంగాణను ‘గ్లోబల్‌ డిజిటల్‌, ఇన్నోవేషన్‌ హబ్‌’ గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆహ్వానించారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఏఐ, డిజిటల్‌ ఎకానమీ అండ్‌ రిమోట్‌ వర్క్‌ అప్లికేషన్స్‌ ఓమర్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ ఓలామాతో గురువారం ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణను ‘ఏఐ కేపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబ్‌’ గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ తదితర ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్స్‌ ఛేంజ్‌’ వల్ల ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రభుత్వ పాలన తదితర రంగాల్లో కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. హైదరాబాద్‌లో తెలంగాణ భాగస్వామ్యంతో ‘ఏఐ’ ఆర్‌అండ్‌ డీ సెంటర్‌ను ప్రారంభించేందుకు ముందుకు రావాలని యూఏఈ మంత్రి ఓమర్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ ఓలామాను ఆహ్వానించారు.

    నానో జీసీసీలు, డిజిటల్‌ హబ్‌ల ఏర్పాటుకు…
    ‘తెలంగాణ దేశంలో నాలుగో అతిపెద్ద యూఏఐ ఆర్థిక వ్యవస్థగా ఉంది. జూలై 2025 నాటికి రూ.1.26 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. చెల్లింపులు, బ్లాక్‌చెయిన్‌, డిజిటల్‌ వాణిజ్యంలో కొత్త ఆవిష్కరణలకు ఫిన్‌టెక్‌ శాండ్‌బాక్స్‌ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో యూఏఈ డిజిటల్‌ ఆర్థిక సంస్థలకు భారత్‌లో ప్రవేశ కేంద్రంగా హైదరాబాద్‌ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది’ అని మంత్రి శ్రీధర్‌ బాబు యూఏఈ మంత్రి ఓమర్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ ఓలామాకు వివరించారు. జీసీసీల ఏర్పాటుకు రాష్ట్రం అన్ని రకాలుగా అనుకూలమనీ, ఇక్కడ యూఏఐ కంపెనీలు నానో- జీసీసీలు, డిజిటల్‌ హబ్‌లను ప్రారంభించేలా చొరవ చూపాలని కోరారు.

    ‘తెలంగాణ-యూఏఈ ఫ్యూచర్‌ స్కిల్స్‌ అకాడమీ’..
    డీప్‌-టెక్‌, ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరిన్‌ ఫండ్స్‌, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలకు మంచి అవకాశాలు ఉన్నాయని సూచించారు. ‘ఏఐ, స్టార్టప్‌ సమ్మిట్‌’ను యూఏఈతో కలిసి నిర్వహించేందుకు తెలంగాణ ఆసక్తిగా ఉందనీ, ఇందుకు సహకరించాలని కోరారు. స్మార్ట్‌ మొబిలిటీ, లాజిస్టిక్స్‌, గ్రీన్‌ ఎనర్జీ, గృహ నిర్మాణం, ఇ-గవర్నెన్స్‌ తదితర రంగాల్లో ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ సంస్థలు మంచి అవకాశాలున్నాయని చెప్పారు. గేమింగ్‌లో ‘తెలంగాణ-యూఏఈ ఫ్యూచర్‌ స్కిల్స్‌ అకాడమీ’ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్‌ బాబు యూఏఈ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు.

    ‘స్టార్‌ గేట్‌’ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవ్వండి
    యూఏఐ మంత్రి ఓమర్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ ఓలామా

    తెలంగాణను ‘గ్లోబల్‌ డిజిటల్‌, ఇన్నోవేషన్‌’ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూఏఐ మంత్రి ఓమర్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ ఓలామా ప్రశంసించారు. ఏఐ, డిజిటల్‌ ఎకానమీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, గేమింగ్‌ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 100 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో యూఏఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఏఐ ఆధారిత ‘స్టార్‌ గేట్‌’ ప్రాజెక్టు గురించి మంత్రి శ్రీధర్‌ బాబుకు వివరించారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. త్వరలో యూఏఐలో నిర్వహించనున్న ‘ఫిన్‌ టెక్‌ స్టార్టప్స్‌’ సమ్మిట్‌ లో తెలంగాణ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad