Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమద్యం వ్యాపారంలో వారిదే హవా

మద్యం వ్యాపారంలో వారిదే హవా

- Advertisement -

– ప్రతియేడూ ‘సిండికేట్‌’ గుప్పెట్లోనే దుకాణాలు
– నవంబర్‌ నాటికి ముగియనున్న పాత దుకాణాల లైసెన్సు
– 2025-27 నోటిఫికేషన్‌కు సిద్ధమైన సర్కారు
– దరఖాస్తు రుసుం, లాటరీ విధానం.. ప్రభుత్వానికి కాసుల పంట!
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో మద్యం వ్యాపారం మరోసారి వేలాది దరఖాస్తులకు, కోట్లాది రూపాయల ఆదాయానికి కేంద్ర బిందువుగా నిలువబోతోంది. మద్యం దుకాణాల గడువు ముగియక ముందే, ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటించి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధమైంది. ప్రతి దరఖాస్తుకూ రూ.3 లక్షలు, లైసెన్స్‌ ఫీజులు, టర్నోవర్‌ ట్యాక్స్‌ వసూలుకు ఎక్సైజ్‌ శాఖ వచ్చే ఏడాదికి ఏర్పాట్లు చేసింది. గతంలో రూ.2లక్షలుగా ఉన్న దరఖాస్తు రుసుమును రూ.3 లక్షలకు పెంచినా, దరఖాస్తుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గలేదు. మద్యం విషయంలో ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఈ వ్యాపారంలో సిండికేట్లదే హవా నడుస్తోంది. ముఖ్యంగా లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించడం, ఒకే వ్యక్తికి అనేక దుకాణాలు కేటాయించే అవకాశం ఇవ్వడం సిండికేట్‌ల పట్టును మరింత బిగిస్తోంది. ఏండ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్న కొందరి చేతుల్లోనే మళ్లీ షాపులు కేంద్రీకృతం కానున్నాయి.

రాష్ట్రంలో డిసెంబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈసారి దరఖాస్తు రుసుము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. దీంతోపాటు ఒక వ్యక్తికి ఎన్ని దుకాణాలైనా కేటాయించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో ఒక వ్యక్తికి ఒకే దుకాణం కేటాయించే పద్ధతి ఉండగా, ఇప్పుడు లాటరీలో ఎన్ని దుకాణాలు వస్తే అన్నింటినీ తీసుకోవచ్చు. దీంతో డబ్బున్న పెద్ద వ్యాపారులు, ముఖ్యంగా సిండికేట్‌లు భారీగా దరఖాస్తులు వేసి, ఒకేసారి అనేక దుకాణాలను చేజిక్కించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

సిండికేట్ల చేతుల్లోనే..!
మద్యం వ్యాపారంలో భారీ లాభాలు వస్తుండటంతో, ఈసారి కొత్తవారు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ దాదాపు 80శాతం మద్యం దుకాణాలు సిండికేట్‌ల చేతుల్లో ఉన్నాయి. గతంలో ఒక గ్రూపు ఏకంగా వెయ్యి దరఖాస్తులు అందజేసింది. మరికొన్ని గ్రూపులు వందల సంఖ్యలో దరఖాస్తు చేశాయి. గత పాలసీల గణాంకాలు చూస్తే, దరఖాస్తుల సంఖ్య ఏయేటికాయేడు భారీగా పెరుగుతోంది. పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 2021-23తో పోలిస్తే 2023-25లో దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఈసారి దరఖాస్తు రుసుము పెంచినా, సిండి కేట్‌లు ఏమాత్రమూ వెనక్కి తగ్గేలా లేరు.

కాసుల పంటగా దరఖాస్తు రుసుం, లాటరీ
మద్యం వ్యాపార నియంత్రణకు పాలసీ తీసుకురాకుండా.. కేవలం ఆదాయం మీదనే దృష్టిసారిస్తున్న ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు పేరుతో దరఖాస్తు రుసుము, లాటరీ విధానం తీసుకొచ్చి రూ.కోట్లలో ఆదాయం జమ చేసుకుంటోంది. ఇది ఏయేటికాయేడు రెట్టింపు అవుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పరిశీలిస్తే..
– కరీంనగర్‌ జిల్లాలో 2021-23లో 94 దుకాణాలకు 1720 దరఖాస్తులురాగా రూ.34.40కోట్లు ఆదాయం వచ్చింది. గతేడాది 4,040 దరఖాస్తులకుగాను రూ.80.80 కోట్ల ఇన్‌కం వచ్చింది.
– జగిత్యాల జిల్లాలో 2021-23లో 71 దుకాణాలకు 1471 దరఖాస్తులకుగాను రూ.29.42కోట్ల ఆదాయం రాగా.. 2023-25లో 2,636 అప్లికేషన్లకు రూ.52.72 కోట్లు వచ్చాయి.
– రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 దుకాణాలకు 2021-23లో 1080 దరఖాస్తులురాగా రూ.21.60 కోట్లు సర్కారుకు ఆదాయం వచ్చింది. 2023-25సంవత్సరానికి ఏకంగా 2,610 దరఖాస్తుల ద్వారా రూ.52.20 కోట్లు వచ్చాయి.
– పెద్దపల్లి జిల్లాలో 77 దుకాణాలకు 1080 దరఖాస్తులకుగాను రూ.21.60కోట్ల ఆదాయంరాగా 2023-25లో ఏకంగా 2,022 దరఖాస్తుల ద్వారా రూ.40.44 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

బెల్టు షాపుల విజృంభణ
గ్రామాల్లో మెడికల్‌ షాపులు ఉన్నాయో లేదో కానీ.. వీధికో బెల్ట్‌ షాపు వెలిసింది. అధికారిక వైన్‌షాపులు అందుబాటులో లేని వేళ, రాత్రి వేళల్లో వీటిపైనే వినియోగదారులు ఆధారపడుతున్నారు. దీనిని వైన్‌షాపుల యజమానులే ప్రోత్సహిస్తూ బెల్టు షాపుల నిర్వాహకులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా మద్యం బాటిళ్లను కాటన్ల కొద్దీ అమ్ముతున్నారు. దీని గురించి ఎక్సైజ్‌ శాఖ వారికి తెలిసినా మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్టుగా వదిలేస్తు న్నట్టు తెలిసింది. మద్యం వ్యాపారులు చెప్పినట్టుగా పోలీసులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. దాంతో వారు ఒక్క బీరుపై రూ.10, మద్యం బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నా చర్యల్లేవ్‌. ఇది ప్రభుత్వానికి నష్టాన్ని కలిగించడమే కాకుండా, అక్రమ దందాను ప్రోత్సహిస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad