Wednesday, May 7, 2025
Homeప్రధాన వార్తలుకాడి కింద పడేసిన సీఎం

కాడి కింద పడేసిన సీఎం

- Advertisement -

– ఆయన మాటలు తెలంగాణ భవిష్యత్తుకు శాపం
– అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చారు.. ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారు
– ఉద్యోగులను అవమానిస్తున్నారు
– ఓ వైపు దివాలా మాటలు- మరో వైపు తెలంగాణ రైజింగ్‌ గొప్పలు : సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అధికారం కోసం ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కాడి కింద పడేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మంగళ వారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్య మంత్రి మాటలు తెలంగాణ భవిష్యత్తు కు శాపంగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీల అమలు కోసం అడిగితే సీఎం తప్పిం చుకుతిరుగుతున్నారని తెలిపారు. ఉద్యోగులను అవమానిస్తున్నారని తప్పు పట్టారు. ఒకవైపు దివాలా మాటలు మాట్లాడుతూ మరో వైపు తెలంగాణ రైజింగ్‌ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ను, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరిస్తాం కానీ, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని కేటీఆర్‌ హెచ్చరించారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ఎన్నికల వేళ కేసీఆర్‌ చెప్పిన మాటలు ప్రస్తుతం అక్షరసత్యాలయ్యాయని తెలిపారు. రేవంత్‌ రెడ్డి అసమర్థ, దక్షత లేని ముఖ్యమంత్రి అని సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగుల త్యాగాలపై ఎన్నో మాటలు మాట్లాడిన సీఎం, ఇప్పుడు వారిని అవమానిస్తున్నారని వాపోయారు. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా రేవంత్‌ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన అంశాలనే ఉద్యోగులు అడుగుతున్నారని తెలిపారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా? అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఉన్న విద్యుత్‌, తాగునీరు ఇప్పుడెందుకు రావడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆదాయం పెరిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ చేతిలో పెడితే, మొదట శ్వేతపత్రం విడుదల చేసి బీఆర్‌ఎస్‌ రూ.6 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ దుష్ప్రచారం చేశారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడేమో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.8.50 లక్షల కోట్ల అప్పు చేసిందంటున్నారని తప్పుపట్టారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నడుపుతున్నారా? లేదా సర్కస్‌ను నడుపుతున్నారా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ సర్కార్‌ రాష్ట్రానికి రూపాయి కూడా ఆదాయం పెంచలేకపోయిందని విమర్శించారు. నెలకు రూ.2 వేల కోట్ల అప్పులు మాత్రమే చెల్లిస్తోందని స్పష్టం చేశారు. మరో పదేండ్లలో ఏడాదికి రూ.2.67 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అప్పుల్లో తెలంగాణ 28వ స్థానంలో ఉందని పార్లమెంటులో కేంద్రమే చెప్పిందని గుర్తుచేశారు. గడిచిన పదేండ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాష్ట్రాన్ని అప్పగించే నాటికి ఈ అంశంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉందని చెప్పారు. రేవంత్‌ సర్కార్‌ వచ్చాక బంగారు తెలంగాణను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు.
రాష్ట్రం దివాళా తీసిందని ఎవరన్నా బజారున పడతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.170 కోట్ల లంచం ఇచ్చి..ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి పోతే అపాయింట్‌మెంట్‌ ఇస్తలేరని అంటున్నారనీ, 43 సార్లు ఢిల్లీకి వెళ్లి రూ.43 కూడా తీసుకురాలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్‌ ఫోటోలన్నీ బయటపెడతామని హెచ్చరించారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని చేయని సీఎం…. రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆదాయం ఎలా పెరుగుతోంది? అని ప్రశ్నించారు. రూ.వేల కోట్లతో ఫార్మా కంపెనీ పేరుతో లగచర్ల భూములు లాక్కున్నారనీ, ముఖ్యమంత్రి వియ్యంకుని అప్పులన్నీ రైట్‌ ఆఫ్‌ అయ్యాయని తెలిపారు. జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌ మూడింతలు పెరిగిందనీ, 2 వేల ఎకరాలు కొన్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌ రెడ్డి 17 నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. హెలికాప్టర్ల కోసం మంత్రులు ఘర్షణ పడుతుంటే, ఉద్యోగులవి గొంతెమ్మ కోరికలంటూ సీఎం అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం దుర్మార్గపు ఆలోచనను ఉద్యోగ సంఘాలు అర్థం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సచివాలయం ముందు తన దుశ్శాసన పర్వాన్ని ఆవిష్కరించారని తప్పుపట్టారు. పెట్రోల్‌ ధరను రూ.200 చేస్తాననడం వంటి అడ్డగోలు మాటలు మానుకొని సంపద పెంచే ఆలోచన చేయాలని సీఎంకు సూచించారు.
పాలన చేతగాని రేవంత్‌ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదని హితవు పలికారు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పైసల్లేవ్‌ కానీ, అందాల పోటీలు నిర్వహించేందుకు పైసలున్నాయా? అని ప్రశ్నించారు. పరిపాలన చేతగాక పోతే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలా కాదని తెలంగాణ రాష్ట్రాన్ని తిడతాం, కేసీఆర్‌ను దూషిస్తామంటే ఊరుకోబోమనీ, నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండలిలో బీఆర్‌ఎస్‌ పక్షనేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, వేముల ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -