– ఉద్యోగుల సమస్యలపై కాలయాపన
– ఒక్క సమావేశం కూడా నిర్వహించని ఉపముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలోని కమిటీ
– ఆర్థికేతర సమస్యలూ పరిష్కారానికి నోచుకోని వైనం
– నేడు ఉద్యోగ జేఏసీతో నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో నియామకమైన త్రిసభ్య కమిటీ సమావేశం
– ఐదు డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీపైనే ప్రధాన చర్చ
– ఉద్యోగుల్లో అయోమయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘నన్ను కోసినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను. రూ.18,500 కోట్లలోనే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పులు, వడ్డీలు, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. విద్యుత్, ఆసరా పెన్షన్లు, ఏ పథకాలు ఆపి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగుల సమరం ప్రజలపైనా?. కొత్త కోర్కెలు కోరొద్దు. వాటి కోసం ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాము బోనస్‌లు అడగడం లేదనీ, ఉద్యోగులకు రావాల్సిన హక్కులనే అడుగుతున్నామని ప్రకటించాయి. గతేడాది అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ జేఏసీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. డీఏలపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కానీ వారం రోజుల తర్వాత అంటే అదేనెల 30న ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇంకోవైపు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చైర్మెన్‌గా, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా నియ మించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు కూడా ఆ కమిటీలో ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు సంబంధించి ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శాఖల వారీగా ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కానీ ఈ ఏడు నెలల కాలంలో ఒక్కసారి కూడా భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కాలేదు. ఇక ఆర్థిక సమస్యలను ఈ ఏడాది మార్చి తర్వాత పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమల్లోకి వచ్చాక ఇప్పుడేమో ‘నన్ను కోసినా ఆదాయా నికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను’అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లంతా అయోమయంలో పడ్డారు. సీఎం వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
భట్టి మాటలు బుట్టదాఖలు
రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రాధాన్యతా క్రమంలో చెల్లిస్తామన్నారు. నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు విడుదల చేస్తామంటూ ఈ ఏడాది మార్చి ఏడో తేదీన శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. కానీ ఆచరణలో అది సాధ్యం కాలేదు. దీంతో ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు నీటి మూటలుగా మిగిలాయి. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినా అమలు కాలేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇప్పుడు అధికారుల కమిటీ ఏం చేస్తుందో…
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేకపోయిందనీ, ఉద్యోగుల సమస్యలపై సమాధానం చెప్పలేకే ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేకపోయిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ చైర్మెన్‌గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ సభ్యులుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం (జీవో నెంబర్ 572) ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమస్యలపై సంప్రదింపులు, చర్చలు జరపాలని ఆదేశించారు. పెండింగ్ సమస్యలను గుర్తించి అధ్యయనం చేయాలని కోరారు. ప్రత్యేకంగా ఆచరణీయమైన సిఫారసులతో నివేదికను రూపొందించాలని సూచించారు. పారదర్శకంగా సమావేశాలను నిర్వహించాలని కోరారు. అయితే ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం చేతులెత్తేయగా… అధికారుల కమిటీ ఎలా పరిష్కరిస్తుందో వేచిచూడాల్సిందే.
ఉద్యోగుల సమస్యలు ఎన్నో…
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ-కుబేర్‌లో వివిధ రకాల పెండింగ్ బిల్లులు సుమారు రూ.పది వేల కోట్లు ఉన్నాయి. వాటిని దశలవారీగా విడుదల చేయాలని కోరుతున్నారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. డీఎస్సీ-2003 వారికి కేంద్ర ప్రభుత్వ మెమో 754,755ను అమలు చేస్తూ వెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలనీ, పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలి. వేసవి కాలంలోనే ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశమివ్వాలి. సకాలంలో పదోన్నతులను కల్పించేందుకు డీపీసీలను ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్లపైనే ప్రధానంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ జేఏసీతో జరిగే నవీన్ మిట్టల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించే అవకాశమున్నది.
నాడు మంత్రివర్గ ఉపసంఘం.. నేడు అధికారుల కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES