ఏండ్లు గడుస్తున్నప్పటి పరిస్థితులు మారడం లేదు. ఎక్కడ ప్రశ్నించే గొంతులు, కలాలు ఉద్భవించినా చిదిమేసే కుట్రలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ (2017 సెప్టెంబరు 5) హత్యోదంతం ఒక హెచ్చరికగా భావించినప్పటికీ ఆ హెచ్చరిక వెలుగులో గ్రామీణ స్థాయిలోనూ నిజమైన పాత్రికేయులపై కుట్రలు, దాడులు, హత్యాకాండలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నాలుగో స్తంభాన్ని నిటారుగా నిలబెట్టుకోల్సిన పరిస్థితి గతం కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం నమ్ముతున్న, మనం ప్రేమిస్తున్న ప్రజాస్వామ్యం ప్రశ్నార్ధకమవుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుగా చెప్పుకునే నాలుగో స్తంభం ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టివేయ బడులతోంది. ఒకరకంగా కత్తుల వంతెన మీద వేలాడుతోంది. చంపడమో, భయపెట్టడమో, దాడి చేయడమో లాంటి చర్యలతో అసమ్మతి గొంతు నుమలడమనేది వందశాతం ఫాసిస్టు చర్యగా భావించక తప్పదు. మరింత సూటిగా చెప్పాలంటే ఇదో రకమైన పిరికి చర్యగానే భావించాలి. ఈ చర్యే ప్రస్తుతం జరుగుతుందనేది కాదనలేని సత్యంగా కనిపిస్తోంది. ఈ చర్య ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ విషయంలోనూ జరిగిందంటే కాదనగలమా?
అయితే చరిత్రలోకి ఒకసారి తొంగిచూస్తే అనేక అంశాలు అవగతమవుతాయి. సత్యం గురించి మాట్లాడిన వారందరి మీద అవిచ్ఛిన్నంగా దాడి కొనసాగిన విషయం బోధపడుతుంది. ప్రభువులనూ, పీఠాధిపతులనూ ప్రశ్నించిన నేరానికి సత్యాన్వేషి ”సోక్రటీస్”ను విషమిచ్చి చంపారు. విశ్వగ్రహ కూటమికి భూమి కేంద్రం కాదన్నందుకు ”కోపర్నికస్”ను సజీవ దహనం చేశారు. అంతరిక్షాన్ని సశాస్త్రీయంగా పరీక్షించి నిర్వచించిన నేరానికి ”గెలీలియో” ను చిత్రం చిత్రహింసలకు గురిచేశారు. ఆ కొనసాగింపులో భాగమే గౌరీ లంకేశ్ హత్య ఇది. కాదనలేని నగసత్యం. ఇదంతా జ్ఞానం మీద, సాహిత్యం మీద, అనాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా దాడి కొనసాగుతూనే ఉందనడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి? గౌరీ లంకేష్ ఒక సీనియర్ జర్నలిస్ట్. ప్రజాస్వామ్య భావాలకు ప్రచారకర్త. ప్రజల ప్రతినిధి. స్వేచ్ఛ కోసం, సత్యం కోసం ఆరాటపడిన ఉద్యమకారిణి. బహుశా ఇవాల్టి ప్రపంచంలో యాక్టివిస్ట్ కాకపోతే ఏ జర్నలిస్టుకైనా జన పక్షం వహించడం సాధ్యం కాదేమో అనేది గౌరి లంకేశ్ అంతరంగం. లంకేశ్ తను పుట్టిన దేశాన్ని, తను నివసించిన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నమ్మిందనేది తన జీవన సరళి తెలుపుతుంది. ఆమె మాట్లాడిన ప్రతి మాటలో, చేసిన ప్రతి పనిలో, రాసిన ప్రతి అక్షరంలో ఈ నమ్మకం అంతర్లీనంగా కనపడుతుంటుంది. ఆమె జరిపిన చర్చల్లో, చేసిన వాదనల్లో, పాల్గొన్న పోరాటాలలోనూ అంతర్లీనంగా కనిపిస్తుంటుంది. అయితే ఆమె నమ్మిన దేశంలో, అతి గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకునే దేశంలో ఆమె నిర్భయంగా తిరిగిన తన ప్రపంచం మధ్యనే, ఆమె ఇంటి గేటు వద్దనే అంత సులభంగా కాల్చి పడేయగలగడం ప్రజాస్వామ్య దేశంలో చెల్లుబాటు కావడం సిగ్గుచేటు కాకుండా పోవడాన్ని ఏమనుకోవాలి?
గౌరీలంకేశ్ భయాలకు తావు లేకుండా ముందుకు సాగింది. తనెప్పటికీ ఈ వ్యవస్థను నమ్మడానికే సిద్ధపడిందనేది మరువొద్దు. అంతేకాదు, మానవ చరిత్రలోని అత్యున్నత విలువల కోసం గొంతెత్తి, దాని ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకున్న మహోన్నత స్త్రీ. పురుషుల జాబితాలో గౌరీలంకేశ్ పేరు కూడా చేరిందనేది గుర్తించాలి.ఈ నేపథ్యంలో నాలుగో స్తంభాన్ని నిటారుగా నిలబడకుండా ఆధిపత్యం ద్వారా కావచ్చు, భయపెట్టడం ద్వారా కావచ్చు, నిర్మూలించడం ద్వారా కావచ్చు, మరేదైనా పద్ధతిలోనైనా కట్టడి చేయడమైనా కావచ్చు , అది నిలబడకుండా చిందరవందర చేస్తున్నా పరిస్థితులను అధిగమించాల్సిన అవసరం, ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యమైన మార్పు దిశగా ప్రయాణించడం నేటి నాలుగో స్తంభంలో భాగస్వాములైన వ్యక్తులు, శక్తులు దాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతిఒక్క జర్నలిస్టు గౌరీలంకేష్‌ను, జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఆమె తరహాలో యాక్టివిస్ట్ కలిగిన జర్నలిస్టుగా ముందుకు సాగడం నేర్చుకోవాలి.అదే జర్నలిస్టులుగా మనమిచ్చే నిజమైన నివాళి.
రాజేందర్ దామెర