తియాన్‌జిన్ రేవు పట్టణం షాంఘై సహకార సమితి (ఎస్.సి.వో) శిఖరాగ్ర సమావేశానికి ఘనంగా ఆతిథ్య మిచ్చింది. ఎస్.సి.వో తన పరిధిని విస్తరించుకుని ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలు, ఇంధన రంగాలను కూడా చేర్చుకుంది. భారత్, పాకిస్తాన్‌లు 2017లో దీనిలో పూర్తి స్థాయి సభ్యులుగా చేరగా తర్వాత ఇరాన్ 2023లో, బెలారస్ 2024లో చేరాయి. 21వ శతాబ్ది సవాళ్లనూ అవకాశాలను ఎస్.సి.వో స్వీకరించిందని చెప్పడానికి సంకే తమా అన్నట్లు చైనా ఇటీవలి కాలంలో సాధించిన ఆశ్చర్యకర పురోగమనాన్ని ప్రతిబింబించే ప్రదర్శన నిర్వహించింది. శిఖరాగ్ర వేదిక పక్కనే వున్న మీడియా కేంద్రం వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో మానవశక్తి రోబోలనూ, కృత్రిమ మేధ ఎ.ఐ తో నడిచే వ్యవస్థను ప్రదర్శించింది. భద్రతనూ జవాబుదారీతనాన్ని పెరుగు పర్చుకునే క్రమంలో ఎ.ఐ ని ఉపయోగించుకోవడంలో చిక్కులను తగ్గించుకోవడానికి సహకరించుకోవాలని సభ్యదేశాలు అంగీకారానికి వచ్చాయి.
ప్రస్తుతం క్లిష్టమైన సమయం నడుస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతలో ఎద్దు వచ్చిపడిన తరహాలో టారిఫ్ దురాక్రమణ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో తియాన్‌జిన్ సమావేశం కీలకంగా దృష్టిని ఆకర్షిం చడం సహజం. అమెరికాను మళ్లీ గొప్ప స్థానంలోకి తీసుకు రావాలంటున్న (ఎం.ఎ.జి.ఎ) ట్రంప్ ఎజెండాతో ఇప్పటి వరకూ నిబంధనల ప్రకారం నడుస్తున్న వాణిజ్య వ్యవస్థను తనకే అత్యధిక లాభాలు చేకూర్చే విధంగా ద్వైపాక్షిక ఒప్పందాల దిశలోకి మారుస్తున్నది. ఈ కారణంగా- అమెరికా నాయకత్వంలోని ప్రపంచ వ్యవస్థకు మరింత వేగవం తమైన తక్షణ ప్రతిస్పందన కావాలనే హడావుడి పెరిగిన అంశాన్ని ఇది పట్టి చూపించింది. ఈ మార్పు నిస్సందే హంగా ఒక బహుళ ధృవ ప్రపంచం అవసరాన్ని నాటకీయమైన రీతిలో కళ్లకు కట్టింది.
ట్రంప్ ఉన్మాదానికి పాఠం
ఇండియా రష్యా నుంచి చమురు కొని ఎక్కువ లాభానికి అమ్ముకుంటున్నదనే సాకు ప్రధానంగా ముందుకు తెచ్చి భారత్, బ్రెజిల్ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు దారుణంగా వేటు వేశాయి. నిజానికి ట్రంప్ ఉన్మాదపూరితంగా తయారైనాడు. ”ఇండియా మాపై అంతటి హెచ్చు టారిఫ్‌లు విధించింది. మాతో వాణిజ్యం చేసే అనేక దేశాలు ఆ కారణంగా దానికి అమ్మకాలు చేయలేకపోతున్నాయి.” అనీ, భారత దేశ ”ఆర్థిక వ్యవస్థ నిర్జీవంగా” తయారైందనీ, దాంతో వ్యాపారం చేయడమంటే ”కోరి ఏకపక్ష వినాశనం” కొని తెచ్చుకోవడమేననీ నోరు పారేసుకున్నాడు. సైనిక ఘర్షణల విరమణలో తన పాత్రకు భారత్ తగినంత గుర్తింపునివ్వలేదని కూడా ట్రంప్ కుదేలైపోయాడు. ఆయన సహాయకులొకరైతే రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి భారత్ కారణమనేంత వరకూ వెళ్లారు. ఇవన్నీ ఎంత వరకూ నిజాలో ఎవరైనా ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ సందేశం భారత్‌కు మాత్రమే కాదు. తమకు సంతృప్తికరమైన విధంగా ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునే విధంగా భారత్‌ను లొంగదీసుకోవడమే ఇక్కడ అమెరికా ప్రధానోద్దేశం.
బహుళ ధృవ ప్రపంచ దృశ్యం, సామర్థ్యం, సత్తా ఏమిటో తియాన్‌జిన్ చూపెట్టింది. సీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోడీలు అక్కడ వుండటం సుస్థిర ప్రపంచ వ్యవస్థను నొక్కి చెప్పింది. ప్రాంతీయ, ప్రపంచ భద్రత పై ఎస్.సి.వో కేంద్రీకరించింది. తియాంజియన్ డిక్లరేషన్ ఏ మాత్రం అస్పష్టత లేకుండా ఇలా ప్రకటించింది: ”ఇజ్రాయిల్, అమెరికాల సైనిక దాడులను తీవ్రంగా ఖండించింది. అవి అంతర్జాతీయ చట్టాలనూ ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించేవిగా వున్నాయి. ఇరాన్ సార్వభౌమాధికారానికి తూట్లు పొడిచేవిగా జరిగాయి” అని పేర్కొంది. గతంలో ఈ ఒక్క అంశంపై ఎస్.సి.వో చేసిన ప్రకటనపై ఇండియా తీసుకున్న అస్పష్టమైన వైఖరికి పూర్తి భిన్నం. ఈ నిర్ణయం తీసుకోవడంలో తాము పాలుపంచుకోలేదని అప్పట్లో విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. ‘విచారం వెలిబుచ్చడం’ వరకే పరిమితమై చర్చలు జరపాలనీ, దౌత్య మార్గాలు చూడాలనీ చెప్పింది. గాజాలో ఇజ్రాయిల్ మారణకాండ పట్ల కూడా గతంలో ఇదే వైఖరిని ప్రకటించింది. అమెరికా ఆ నేరంలో కడదాకా భాగస్తురాలైంది. ఈ వైఖరి మార్పును తియాన్‌జిన్ తీర్మానం నొక్కి చెబుతున్నది. పాలస్తీనా, ఇజ్రాయిల్ ఘర్షణ తీవ్రం కావడం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. అనేకానేక పౌర మరణాలు, గాజాలో విపత్కరమైన మానవీయ సంక్షోభ పరిస్థితులకు కారణమైన చర్యలను ఖండించింది.
ప్రధాన సంకేతం
తియాన్‌జిన్ సమావేశానికి ముందు మోడీ, జిన్‌పింగ్‌లు శిఖరాగ్ర సమావేశం జరిపినప్పుడే గాలి ఎటు వీస్తున్నదీ స్పష్టమైపోయింది. భారత్, చైనాలు భాగస్వాములేగానీ విరోధులు కాద’న్నది ఉమ్మడి స్ఫూర్తిగా వచ్చిన ప్రధాన సందేశం. బహుళ ధృవ ప్రపంచం, వాణిజ్య స్వేచ్ఛను ప్రముఖంగా చెబుతూ న్యాయమైన, సహేతుకమైన పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారాలను కనుగొనాలని ఈ రెండు గొప్ప పొరుగు దేశాలు అవగాహనకు వచ్చాయి. విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నట్టుగా ప్రపంచ వాణిజ్య సుస్థిరత సాధించడంలో ఉభయ దేశాల ఆర్థిక వ్యవస్థల పాత్రను ప్రస్తావించాయి. విధానపరమైన స్వీయ నిర్ణయాధికారాన్ని ఇరుదేశాలు పాటిస్తాయి. ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకునే దిశలో బహుముఖ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని సీ జిన్‌పింగ్ పేర్కాన్నారు. మొత్తం భారత్, చైనా సంబంధాలను సరిహద్దు సమస్యను బట్టి మాత్రమే నిర్ణయించరాదని కూడా ఆయన చెప్పారు. దీన్నే అలంకార భాషలో ”డ్రాగన్ గజరాజుతో నృత్యం చేసే సమయం ఆసన్నమైందని” అభివర్ణించారు. బీజేపీ ఐ.టి విభాగం బలగాలు చైనా పైన దాని నాయకత్వం పైన విషం కక్కిన తీరు గమనించిన భారతీయ వీక్షకులు ఈ మొత్తం సందేశంలో దాగివున్న విచిత్రాన్ని తేలిగ్గా తెలుసుకోగలరు.
ఒక విధంగా చెప్పాలంటే తియాన్‌జిన్ రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి సజావుగా జరిగిన కొనసాగింపు. దురదృష్టవశాత్తు అక్కడ సీ జిన్‌పింగ్, పుతిన్ వ్యక్తిగతంగా పాల్గొనలేకపోయారు. జులై 5న బ్రిక్స్ సమావేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి టారిఫ్‌ల హెచ్చింపునూ ఇరాన్‌పై దాడులనూ ఖండిం చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. ఆ బృందం విడుదల చేసిన ప్రకటన కూడా మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయిల్ సైనిక చర్యలపై విమర్శలు చేసింది. అయితే తన సభ్యదేశమైన రష్యాను ఉపేక్షించి యుద్ధంలో చితికిపోయిన ఉక్రెయిన్‌ను ఒక్కసారి ప్రస్తావించింది.
బ్రిక్స్ షాంఘై ప్రభావం
బ్రిక్స్‌ను బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కలసి స్థాపించాయి. అయితే గతేడాది ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్టు, ఇధియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను కూడా కలుపుకొని విస్తరించింది. ఈ కూటమిలో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా వున్నాయి. గతేడాది ఏర్పరచుకున్న ఈ విభాగంలో బెలారస్, క్యూబా వియత్నాం వున్నాయి. ప్రవర్ధమాన దేశాలు స్పందించడానికి, ప్రత్యామ్నాయాలు చూసుకోవడానికి, ఆర్థిక భాగ స్వామ్యం వైవిధ్యభరితం చేసుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం నిజంగా అత్యుత్తమ అవకాశం సమకూర్చింది.
బ్రిక్స్ కూటమి ప్రపంచ ఆర్థిక దృశ్యాన్ని త్వరితగతిన మార్చేస్తున్నది. సృజనాత్మకమైన వాణిజ్య ఒప్పందాలు, వ్యూహాత్మక ఆర్థిక చొరవలతో బ్రిక్స్ అంతర్గత వాణిజ్యం పాశ్చాత్య దేశాల ప్రాబల్యంలోని మార్కెట్లకు శక్తివంతమైన ప్రతిశక్తిగా ఆవిర్భవిస్తున్నది. ఇటీవల సంవత్సరాలలో బ్రిక్స్ దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని గణనీయంగా పెంచు కున్నాయి. ఉమ్మడి జీడీపీ లెక్కలు, విస్తరిస్తున్న వినియోగదారుల పునాదితో ఈ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు అంతర్గత వాణిజ్యాన్ని సాధనంగా మార్చుకుని సంప్రదాయిక ప్రపంచ కరెన్సీపై, పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై పరాధీనతను తగ్గించుకోగలుగుతున్నాయి. ఉదాహరణకు 2022లో బ్రిక్స్ అంతర్గత వాణిజ్యం 60వేల కోట్ల డాలర్ల పైనే వుంది. డాలర్‌తో సంబంధం లేని స్థానిక ఆర్థిక సహకారం దిశలోకి ప్రయత్నపూర్వకంగా మరలడాన్ని ఇది సూచిస్తుంది.
తమదైన శైలిలో చెట్టపట్టాలేసుకుని తిరిగే ట్రంప్, మోడీ ‘పప్పీ ఝప్పీ’ మార్కు దౌత్య పోకడల అసలు రంగేమిటో తాజా టారిఫ్ దాడితో తేలిపోయింది. అమెరికా ఆదేశాలకు లోబడి ఇండియా వాణిజ్య ఒప్పందానికి రాలేక పోయింది. విశాల భౌగోళిక దృష్టితో భారతదేశ ప్రయోజనాలను ట్రంప్ చూడటం లేదని తేలిపోయింది. ఆసియాలో బలాబలాల సమతుల్యతకు సంబంధించి భారత దేశం విలువేమిటో ఆయనకు తెలియలేదని అర్థమైపోయింది.
గొప్పలకు తూట్లు, అసలు నిజాలు
అయితే మోడీ, బీజేపీ నాయకత్వం లోని ప్రభుత్వం కోసం కన్నీరు కార్చే వారెవరూ వుండరు. భారత అమె రికా సంబంధాలను గమనిస్తున్న వారికి మాత్రం ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఇది ఎప్పుడో జరగవలసి వున్నదే. ఆపరేషన్ సిందూర్ తర్వాత మోడీ ప్రభుత్వం ఎన్ని గొప్పలైనా పోవచ్చు. కానీ కాల్పుల విరమణకు తానే కారణ మంటూ ఉన్మాద పూరితంగా ట్రంప్ ఏకపక్షంగా చెప్పుకోవడం చూసినప్పుడు ఆయన వీరిని పూచికపుల్లగా కూడా చూడబోరని తేలిపోయింది. ఇండియా, పాకిస్తాన్‌లను ఒకే గాటకట్టి చూడటంతో ప్రాంతీయ, ప్రపంచ బలాల తాసులో ఇండియా విలువెంతో చెప్పినట్టయింది. ఆ విధంగా అది వ్యూహాత్మక ప్రాధాన్యత కోల్పోయింది. జాతీయ ప్రయోజనాలు వ్యూహపరమైన స్వతంత్రత ప్రమాణంగా ఒక స్వతంత్ర విదేశాంగ విధానం వుండాలని వామపక్షాలు ఎప్పుడూ హెచ్చరిస్తూనే వచ్చాయి.
సామ్రాజ్యవాదం తీరు ”పులి మచ్చలు మార్చుకోలేద”న్నట్టే వుంటుంది. వామపక్షాన్ని అటుంచి-అమెరికా విదేశాంగ నీతిలో అత్యంత ఉద్దండుడైన హెన్రీ కిసింజర్ కూడా సూటిగా ఈ మాటే చెప్పాడు. ”అమెరికాకు శత్రువుగా వుండటం ప్రమాదకరం. వాటేసుకోవడం ప్రాణాంతకం”. కానీ ఆ విధంగా విధాన స్పష్టత ఆరెస్సెస్, బీజేపీ కూటమి ఇవ్వలేవు.
ఇది వాస్తవాన్ని కండ్లు విప్పి చూడాల్సిన సమయం. అమెరికా భౌగోళిక, రాజకీయ, వ్యూహాత్మక క్రీడలో సహా యక పాత్రగా వుండే మార్గం నుంచి విడగొట్టుకోవడానికి ఈ సంధి దశను ఓ అవకాశంగా చూడాలి. బ్రిక్స్, షాంఘై క్రమం ద్వారా వ్యక్తమైన మార్గంలో పేద దేశాలతో నిజమైన భాగస్వామ్యం పెంచుకోవాలి. ఈలోగా సుంకాల యుద్ధం రంగాల వారీగా ప్రసరించే ప్రభావాన్ని ప్రభుత్వం అధ్యయనం చేయాలి. ఇందులో మరీ ఎక్కువగా దెబ్బ తినే చిన్న పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయ రంగాలను ఆదుకునే విధాన చర్యలు ఉధృతం చేయాలి. అమెరికాతో వాణి జ్యంలో దానిపై ఆధారపడటాన్ని వదులుకోవడం వల్ల కలిగే పెద్ద దెబ్బను తట్టుకోవడానికి ఉపకరించే దోహదకారులు కావలిసినన్ని వున్నాయి.
(సెప్టెంబరు 3 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
స్వతంత్ర విదేశాంగ విధానం ప్రధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES