– జేఏసీ నేతలతో మంత్రి పొన్నం భేటీ
– సమస్యలు పరిష్కరిస్తామని హామీ
– చర్చలు సఫలం : జేఏసీ ప్రతినిధులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 7 నుంచి తలపెట్టిన సమ్మె పలు నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. సమ్మె విరమణ కోసం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు రోజులుగా కార్మిక సంఘాల నాయకులతో వేర్వేరుగా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీఎమ్‌యూ ప్రధాన కార్యదర్శి ఇ అశ్వత్థామరెడ్డి నేతృత్వంలోని జేఏసీతో సోమవారం మంత్రి చర్చలు జరిపారు. అనంతరం తమ జేఏసీలోని కార్మికులు సమ్మెలో పాల్గొనబోరని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మంగళవారం ఉదయం టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రితో భేటీ తర్వాత సమ్మెపై తమ వైఖరిని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. అనంతరం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని మరో జేఏసీ ప్రతినిధులు ఈదురు వెంకన్న, ఎమ్ థామస్‌రెడ్డి, కే హన్మంతు ముదిరాజ్‌లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటలపాటు పలు అంశాలపై చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనీ, ఇప్పటికే పలు డిమాండ్లను పరిష్కరించామంటూ మంత్రి జేఏసీ ప్రతినిధులకు వివరించారు. చర్చలు శాంతియుత వాతావరణంలో సామరస్యంగా జరిగాయనీ, తమ డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించినందుకు సమ్మెను వాయిదా వేస్తున్నామని అనంతరం జేఏసీ ప్రతినిధులు సచివాలయం వద్ద మీడియాకు తెలిపారు. డిపోల్లో సమస్యలు, ఉద్యోగులు, కార్మికులపై పనిభారం, ఒత్తిళ్లు, కొత్త రిక్రూట్‌మెంట్లు, ఉద్యోగ భద్రత, సింగరేణి తరహా కారుణ్యనియామకాలు, వేతన సవరణ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపు, విద్యుత్ బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలనే పలు అంశాలను మంత్రి వద్ద ప్రస్తావించామని నేతలు తెలిపారు. సమ్మె వాయిదా తాత్కాలికమేననీ, ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే, మరోసారి సమ్మె తేదీ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమ్మె వాయిదా వేస్తున్నట్టు జేఏసీ నేతల ప్రకటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ పక్షపాతిగా ఉంటుందని తెలిపారు.
ఆర్టీసీ సమ్మె వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES