-ఆర్థిక లోటుపై ప్రభావం ఉండదు
-ద్రవ్యోల్బణం తగ్గొచ్చు
-ఎస్బీఐ కీలక రిపోర్ట్
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపునతో ప్రభుత్వం రూ.3,700 కోట్ల ఆదాయం మాత్రమే కోల్పోయే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఓ రిపోర్ట్‌లో తెలిపింది. జీఎస్టీ రేట్ల శ్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.48వేల కోట్ల నష్టం జరగొచ్చని ప్రభుత్వం ఇటీవల అంచనా వేసిన విషయం తెలిసిందే. పన్నుల తగ్గింపు ద్వారా వినియోగం, వృద్ధి పెరగడంతో నష్టం రూ.3,700 కోట్లకు పరిమితమవుతుందని ఎస్బీఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఇది ఆర్థిక లోటుపై ఎటువంటి ప్రభావం చూపదని వెల్లడించింది. ఈ నెల 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న 5, 12, 18, 28 శ్లాబుల స్థానంలో రెండు శ్లాబులను ఎత్తివేసి 5 శాతం, 12 శాతం శ్లాబుల విధానాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు విలాస వస్తువులపై 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. జీఎస్టీ రేట్ల సవరణలతో బ్యాంకింగ్ రంగానికి వ్యయం తగ్గి, సానుకూల ప్రభావం ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. దాదాపు 295 వస్తువుల జీఎస్టీ రేట్లు 12 శాతం నుంచి 5 శాతం లేదా సున్నాకు తగ్గడంతో ఆ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25-30 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అంచనా. మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం 2026-27 నాటికి 65-75 బేసిస్ పాయింట్లు దిగిరావొచ్చని పేర్కొంది. డిమాండ్ పెరగడంతో మరోవైపు జీడీపీ 0.1-0.2 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. రేట్ల తగ్గింపునతో ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, ఆటోమొబైల్స్, సిమెంట్, ఇన్సూరెన్స్ రంగాలు లబ్ధి పొందుతాయని విశ్లేషించింది.
జీఎస్టీ రేట్ల తగ్గింపుతో రూ.3,700 కోట్ల నష్టం!
- Advertisement -
- Advertisement -