జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు డీజీపీ ఆదేశాలు
బందోబస్తుపై సమీక్ష జరిపిన జితేందర్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో శనివారం జరగనున్న గణపతి విగ్రహాల సామూహిక నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ నగర పోలీసు కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం గణేశ్ నిమజ్జనోత్సవానికి సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతో పాటు వివిధ జిల్లాల్లో ఏర్పాటు పోలీసు బందోబస్తుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరంగా అత్యంత కీలకమైన ఈ నిమజ్జనోత్సవం పూర్తయ్యేంత వరకు పోలీసు అధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా మెలగాలని ఆయన ఆదేశించారు. జరిగిన బందోబస్తు ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ.. అవాంఛనీయ శక్తుల కదలికలపై నిరంతరం నిఘా వేసి ఉంచాలని ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఆదేశించారు. మూడు కమిషనరేట్లతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలలో మతపరమైన సున్నిత ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలనీ, అల్లర్లకు ప్రేరేపించేవారిని ముందస్తుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవాలని కూడా ఆదేశించారు. అవసరమైన అదనపు బలగాలను కూడా బందోబస్తు కోసం సిద్ధంగా ఉంచామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరిగే సామూహిక గణేశ్ నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలను ఇవ్వడానికి డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కంట్రోల్ రూం నుంచి అదనపు డీజీ మహేశ్ భగవత్ నేతృత్వంలో పర్యవేక్షణ అధికారుల బృందం పని చేస్తుందని చెప్పారు.
గణేశ్ నిమజ్జనం పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES