Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంస్థానిక ఎన్నికల కంటే రిజర్వేషన్లే ముఖ్యం

స్థానిక ఎన్నికల కంటే రిజర్వేషన్లే ముఖ్యం

- Advertisement -
  • సాధించేదాకా పోరాటం ఆపబోం
  • యూరియా కొరత అసలు దోషి కేంద్రమే
  • కాళేశ్వరం అవినీతిపై చర్యలకు సీబీఐ మినహా మరో మార్గం లేదు
  • కేసీఆర్‌ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకోబోం
  • కల్వకుంట్ల అవినీతిని బయట పెట్టి కవిత మంచి పని చేశారు
  • వారం రోజుల్లో మండల, జిల్లా కమిటీలు పూర్తి
  • అక్టోబర్‌లో ఇన్సూరెన్స్‌తో కూడిన కాంగ్రెస్‌ సభ్యత్వం
  • పార్టీ ప్రతిష్టను పెంచిన ‘మంత్రులతో ముఖాముఖి’
  • అధ్యక్షుడిగా ఏడాది పూర్తయిన సందర్భంగా 15న కామారెడ్డిలో సభ : ఇష్టాగోష్టిలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో చర్చించి చట్టాన్ని తీసుకొచ్చామని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా తొక్కిపెట్టిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుకుంటే 24 గంటల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయని చెప్పారు. సెప్టెంబర్‌ 30లోపు హైకోర్టు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందనీ, అయితే కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను హైకోర్టు దృష్టికి తీసుకెళతామని చెప్పారు. స్థానిక ఎన్నికల కంటే తమ పార్టీకి బీసీ రిజర్వేషన్లే ముఖ్యమన్నారు. రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను కేంద్రంపై తమ పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో విలేకర్లతో మహేశ్‌కుమార్‌ ఇష్టాగోష్టిలో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతకు అసలు దోషి కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రైతులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం విచారణ కమిషన్‌ నివేదిక నేపథ్యంలో ఆ కేసును సీబీఐకి అప్పగించడాన్ని కొన్ని పార్టీలు తప్పుపడుతున్నారని విమర్శించారు. అయితే సీబీఐ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్న మాట వాస్తవమేననీ, కానీ ఇంత కీలకమైన కేసును అప్పగించేందుకు సీబీఐ మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతిపై చర్చ జరగకుండా కవిత రూపంలో బీఆర్‌ఎస్‌ కొత్త నాటకం మొదలు పెట్టిందని వ్యాఖ్యానించారు. పవర్‌, డబ్బు విషయంలో అన్నచెల్లెల మధ్య పంచాయితీ నడుస్తున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పరిణామాల వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారంటూ అనడం సరైందికాదన్నారు. రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న గులాబీ పార్టీలో సీఎం తలదూర్చాల్సిన అవసరం లేదని చెప్పారు. స్థానికంగా కార్యకర్తలు అంగీకరించిన పది మంది ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకున్నామని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తన పదవికి రాజీనామా చేసి, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసారా? అనే ప్రశ్నకు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అయితే దానం సభ్యత్వం రద్దు కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందనే విశ్వాసం పెరగడంతో బరిలోకి దిగేందుకు ఐదారు మంది పోటీ పడుతున్నారని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. వారంలో మండల, జిల్లా కమిటీలను పూర్తి చేస్తామన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించామనీ, మిగతా పార్టీ పదవులను వెంటనే భర్తీ చేస్తామన్నారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పని చేస్తున్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు తనకు సంపూర్ణంగా సహకారమందిస్తున్నారని సంతృప్తిని వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అధ్యక్షుడిగా తాను కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించానని గుర్తు చేశారు. అక్కడే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారని చెప్పారు. గాంధీభవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ చేపట్టిన కార్యక్రమం పార్టీ ప్రతిష్టను పెంచిందని తెలిపారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు సీఎం సిద్ధారామయ్య, సుఖేందర్‌ సుఖ్‌ ఈ కార్యక్రమం గురించి వాకబు చేశారని వివరించారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. అక్టోబర్‌లో పార్టీ సభ్యత్వ ప్రక్రియ ప్రారంభిస్తామనీ, సభ్యత్వం పొందిన ప్రతి ఒకరికి ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad