ఆర్‌టీఐ ప్రశ్నకు బదులివ్వని కేంద్రం
గోప్యంగా బీబీఎస్ అధ్యక్షుని వివరాలు
న్యూఢిల్లీ : భారతీయ భాషా సమితి (బీబీఎస్) ఛైర్మన్ చాము కుమార్ శాస్త్రి విద్యార్హతలు, బయోడేటాను కేంద్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. సమాచార హక్కు చట్టం కింద ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక అడిగిన సమాచారాన్ని అందజేయడంలో కేంద్రం విఫలమైంది. బీబీఎస్ అధ్యక్షుడిగా చాము కుమార్ శాస్త్రి 2021లో నియమితులయ్యారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్కృత భారతిలో సభ్యుడు. చిన్నారుల కోసం శిబిరాల వంటివి ఏర్పాటు చేసి వాటి ద్వారా సంస్కృత అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది.
శాస్త్రికి ఏ ప్రాతిపదికన జీతాన్ని నిర్ణయించారో తెలియజేయాలని ఆ పత్రిక కోరింది. అయితే దానికి కూడా విద్యా శాఖ నుండి సమాధానం రాలేదు. శాస్త్రి బయోడేటా ప్రతిని కేంద్ర ప్రజా సమాచార అధికారి (సీపీఐఓ) అందజేయలేదు. బయోడేటాను, ఇతర వివరాలను అందజేయాలంటూ చేసిన అభ్యర్థనపై మొదటి అప్పీలెట్ అధికారి సుమన్ దీక్షిత్ మార్చి 20న స్పందించారు. కోరిన సమాచారం అందుబాటులో లేదని బదులిచ్చారు. ‘కోరిన, అందించిన సమాచారానికి సంబంధించిన ముఖ్యమైన కోణం నుండి మీ అప్పీలును పరిశీలించాము. ఉన్నత విద్యాశాఖకు చెందిన సీపీఐఓ (ఎల్-11) రికార్డులలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందజేయడం జరిగిందని గుర్తించాము’ అని ది టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. 2023 డిసెంబర్ నుండి శాస్త్రికి ప్రతి నెల రెండున్నర లక్షల రూపాయలు చెల్లించారు. కేంద్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జీతం కంటే ఇది ఎక్కువ అని ‘ది టెలిగ్రాఫ్’ తెలిపింది.
ఆయన ఏం చదివారు?జీతం ఏ లెక్కన ఇచ్చారు?
- Advertisement -
- Advertisement -