డీలర్ల ద్వారా యూరియా పంపిణీ నిలిపివేత.?
నవతెలంగాణ – మల్హర్ రావు
యూరియా పంపిణీని పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 40 శాతం మేర డీలర్ల ద్వారా, మిగతా 60 శాతం పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే యూరియాకు ఈసారి కొరత ఏర్పడగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ ల ద్వారా పంపిణీ చేస్తేనే ఎరువులు పక్క దారి పట్టకుండా పారద్శకత ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విధానం అమలవుతుండగా.. మిగతా ప్రాంతాల్లోనూ అమలుచేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తాడిచెర్ల పిఏసిఎస్ ద్వారా 500 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లుగా పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య తెలిపారు.
డీలర్లకు నిలిపివేత..
ప్రస్తుతం డీలర్లకు యూరియా సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే పంపిణీ జరుగుతుంది. పీఏసీఎస్ లకు దూరంగా ఉన్న గ్రామాల్లో సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేస్తారు. ఇందుకోసం సహకార సంఘాలకు తోడు సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓల ద్వారా కూపన్లు జారీ చేయనుండగా.. పీఏసీఎస్ సీఈఓలు, ఉద్యోగులు యూరియా అందిస్తారు.