Saturday, May 10, 2025
Homeట్రెండింగ్ న్యూస్ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

- Advertisement -

– మాక్లూర్‌లో రైతుల రాస్తారోకో
– మద్దతు తెలిపిన తెలంగాణ రైతు సంఘం నాయకులు

నవతెలంగాణ-మాక్లూర్‌
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుటనున్న ప్రధాన రహదారిపై రైతులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రైతులకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్‌, నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మ్యాచర్‌ వచ్చినప్పటికీ కొనుగోళ్లు వేగవంతం చేయడం లేదని, దాంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లారీల సమస్య ఉండటంతో తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, జిల్లా కలెక్టర్‌ బాధ్యత తీసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. రాస్తారోకోతో ఇరువైపుల వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు అటుగా వచ్చిన అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ రాస్తారోకో చేస్తున్న రైతులతో మాట్లాడి.. వారం రోజుల్లో ధాన్యాన్ని తరలిస్తామని హామీనిచ్చారు. దాంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మాక్లూర్‌ మండల కార్యదర్శి కొండ గంగాధర్‌, రైతులు రవి, భాజన్న, సాయిలు, రాజు, శేఖర్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -