– తెలంగాణ టూరిజానికి ప్రేరణ ఈ వేడుకలు : ‘మిస్ వరల్డ్’ పోటీలపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
– సామాన్యులకూ ప్రవేశం కల్పిస్తాంం: జయేశ్‌రంజన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ రాష్ట్రానికి దక్కిన గౌరవమనీ, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వేడుకకు అందరూ సహకరించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటళ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని పంచేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ వేడుకలు ప్రపంచ ఐక్యతకు చిహ్నమని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ అనేది అందం, ప్రతిభకు సంబంధించిన వేడుక మాత్రమే కాదనీ, మహిళా సాధికారిత, వైవిధ్యానికి సంకేతమని అన్నారు. తెలంగాణ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశమని తెలిపారు. ఇక్క్డడి ప్రత్యేకమైన వంటకాలు, శక్తివంతమైన కళారూపాలకు ఆధునికతను మిళితం చేసి తెలంగాణ గొప్పతనాన్ని ప్రదర్శించడం గర్వకారణమని చెప్పారు. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను ఆవిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని మంత్రి కోరారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ పటేల్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ పోటీలకు వచ్చే అతిథులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వేడుకలు తెలంగాణ టూరిజానికి గొప్ప ప్రేరణ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాన్యులకు సైతం ఎంట్రీ: జయేశ్ రంజన్
మిస్ వరల్డ్ పోటీలు కేవలం ధనవంతులు, వీవీఐపీలకు మాత్రమే అనే అభిప్రాయం లేకుండా సామాన్యులకు సైతం అవకాశం కల్పిస్తున్నట్టు పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, వంటకాలు, పర్యాటకాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకొనేందుకు ఇదో మంచి అవకాశమనీ, అందరం కలిసి ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. పోటీలను తిలకించాలనే ఆసక్తి ఉన్నవారు పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్ జూలియోమోర్లీ, ప్రముఖ సినీ నటులు సోనుసుద్, మిస్ వరల్డ్ ప్రతినిధి స్టీవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గొప్ప అనుభూతి: నందిని గుప్తా
తెలంగాణ గుర్తొచ్చిన ప్రతీసారి గొప్ప అనుభూతి కలుగుతుందని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పగా ఉంటాయని కొనియాడారు. చారిత్రక సంపదలైన చార్మినార్, ఛౌహముల్లా ప్యాలెస్, చుడిబజార్, పోచంపల్లి తదితర అనేక ప్రాంతాలు అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాదీ బిర్యానీ నుంచి ఇరానీ చారు వరకు అన్ని తనకెంతో ఇష్టమని అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్థి చెందుతోందని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెడికల్, ఐటీ రంగానికి ఐకానిక్‌గా నిలుస్తోం దని చెప్పారు. ఇక్కడి ప్రజల దక్కన్ లాంగ్వేజ్ అపూరూపమని పేర్కొన్నారు. తెలంగాణకు తప్పక రండంటూ ఆమె ఆద్యంతం రాష్ట్ర గొప్పతనాన్ని కొనియాడారు.
స్వాగత ఏర్పాట్లను పర్యవేక్షించిన జూపల్లి
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయాన్ని మంగళవారం సందర్శించిన మంత్రి జూపల్లి మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే వారికి స్వాగత సత్కారాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అతిథులకు విమానాశ్రయంలో తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలనీ అధికారులను ఆదేశించారు. జీఎంఆర్ ప్యాసెంజర్ ఎక్స్పీరియన్స్, పర్యాటక శాఖ, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సీఐఎస్‌ఎఫ్ అధికారులతో సమావేశ మయ్యారు. విమానాశ్రయాన్ని సుందరంగా అలంకరించాలని సూచించారు.
రాష్ట్రానికి దక్కిన గౌరవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES