నవతెలంగాణ – దామరచర్ల
వేసవి కాలంలో పండించిన ధాన్యానికి ఇప్పటివరకు ప్రభుత్వం బోనస్ డబ్బులు విడుదల చేయకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మలోతు వినోద్ నాయక్ చెప్పారు. దామరచర్ల సీపీఐ(ఎం) కార్యాలయంలో ఎర్ర నాయక్ అధ్యక్షతన శనివారం జరిగిన మండల కమిటీ సమావేశంలో ప్రజా సమస్యల గురించి చర్చించిన అనంతరం ఆయన మాట్లాడారు.
మళ్లీ వర్షాకాలం పంటలు వేయడానికి రైతులు ప్రైవేటు వ్యక్తుల నుండి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డట్లు చెప్పారు. రైతాంగమంతా కూడా అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతులకు సరిపడా యూరియా అందించడంలో వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ఇవ్వడంలో విఫలమైందని చెప్పారు. గ్రామ స్థాయిలలో వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
మరో మూడు నెలలు అయితే ఈ సీజన్ ధాన్యం కూడా కొనుగోలు కూడా ప్రారంభం కానున్నందున తక్షణమే ప్రభుత్వం వేసవి కాలం కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులను అందరిని సమీకరించి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దయానంద్ పాపా నాయక్, కోటిరెడ్డి, ఖాజా మొహిద్దిన్, సుభాని ,చంద్రకళ ,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.