అమెరికా పత్తి వద్దు.. ఆదిలాబాద్ పత్తి ముద్దు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవి కుమార్
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బస్టాం ఎదుట ఆందోళన
పత్తి ప్రతులను దహనం చేసే యత్నం
అడ్డుకున్న పోలీసులు స్వల్ప ఉద్రిక్తత
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆసియాలోనే ఆదిలాబాద్ పత్తికి మంచి డిమాండ్ ఉందని, కానీ అమెరికా పత్తికి అనుమతి ఇచ్చేలా సంకాన్ని ఎత్తివేయడం సరైన నిర్ణయం కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవి కుమార్ అన్నారు. అమెరికా పత్తి దేశ రైతన్నలకు ఉరి అన్నారు. శనివారం బస్టాండ్ ఎదుట అమెరికా పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అమెరికా పత్తి ప్రతులను దహనం చేసే యత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరుగగా కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. విదేశీ వస్తువులపై సుంకాన్ని తగ్గించడంతో దేశ వ్యాపారులకు ఇబ్బందులు వస్తాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవి కుమార్ అన్నారు.
ఆసియాలో ఆదిలాబాద్ పత్తికు మంచి డిమాండ్ ఉందన్నారు. దీనికి అధనంగా అమెరికా ఉత్పత్తి అయిన పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేయడంతో దేశ వ్యాపారులు ఆ పత్తికి మొగ్గుచూపుతారన్నారు. దాని కారణంగా రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గి నష్టాపోయే ప్రమాదాలున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కేంద్రం నిర్ణయం ఉపసంహరించుకోవాలి
అమెరికా నుండి జీరో టారీఫ్ తో పత్తి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవలిని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల దేశంలోని రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అన్నారు. రైతులు భవిష్యత్తులో పత్తిని గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేక అప్పుల పాలై పత్తి పంటను పండించడమే మానేస్తారని అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ పత్తి పంటనే ప్రధాన ఆధారం రైతులు దివాలా తీస్తే అనువారియంగా దీని ప్రభావం అన్ని రంగాల మీద పడుతుందని అన్నారు. తద్వారా జిల్లా ఆర్థికంగా దివాలా తీస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానాన్ని ప్రజలందరూ, రైతులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అందుకోసం సీపీఐ(ఎం) నిర్వహించే పోరాటాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, పూసం సచిన్, అన్నమొల్ల కిరణ్, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న ఆర్. మంజుల,ఆర్.సురేందర్,నెల్ల స్వామి ఆత్రం కిష్టన్న, నాయకులు కే.ఆశన్న, బొజ్జ గంగారం, పోచక్క పాల్గొన్నారు.
