– ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక బయట పెట్టాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-సిటీబ్యూరో
మెట్రో రైల్ చార్జీలను 30శాతం పెంచాలన్న ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక మేరకే ఈ పెంపుదల ఉంటుందని ఎల్‌అండ్‌టీ సంస్థ చెబుతున్నదని, ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) తరపున విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నాణ్యమైన, మెరుగైన చౌక రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే పేర్కొ న్నారు. ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రో రైల్‌కు నష్టాలు వస్తున్నాయన్న కారణంతో టికెట్ ధరలు పెంచితే ఆక్యుపెన్సీ రేట్ తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఎల్‌అండ్‌టీకి వస్తున్న నష్టాలకు ఆ సంస్థనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌లో టికెట్ల ద్వారా 50శాతం, రియల్ ఎస్టేట్ ద్వారా 45శాతం, ప్రకటనల ద్వారా 5శాతం ఆదాయాన్ని సమకూర్చు కోవాలని స్పష్టంగా రాసుకున్నారని, ఎల్‌అండ్‌టీ సంస్థ ఇతర పద్ధతులపై దృష్టి పెట్టకుండా టికెట్ల ధరలు పెంపుదలపై దృష్టి పెట్టడం సమంజసం కాదన్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో ట్రైన్‌లకు బోగీలు పెంచడం ద్వారా ఆక్యుపెన్సీని పెంచుకొని ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందని, ఇప్పటికే పార్కింగ్ ఫీజులూ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు నష్టం చేసే మెట్రో చార్జీల పెంపుదలను వెంటనే ఉపసంహరిం చుకోవాలని, లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మెట్రో చార్జీల పెంపు ప్రతిపాదనలను విరమించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES