– నేడు, రేపు రైల్వే స్టేషన్ల వద్ద ధర్నాలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైల్వే రంగంలో ప్రయివేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిమాండ్‌పై సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. వీటికి కొనసాగింపుగా బుధ, గురువారాల్లో రైల్వే స్టేషన్ల వద్ద ధర్నాలు జరపనున్నట్టు తెలిపారు. కోట్లాది ప్రజానీకానికి అతి పెద్ద ప్రజా రవాణాగా ఉన్న రైల్వే రంగాన్ని కాపాడుకునేందుకు వీలుగా ప్రజలంతా ఈ ధర్నాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇటీవల కాలంలో వరసగా రైల్వే ప్రమాదాలు సంభవిస్తున్నాయని గుర్తు చేశారు. లోకో పైలెట్లు, రైల్వే మేనేజర్లు, ట్రాక్ మెయింటెనర్లు, రైల్వే ఉద్యోగుల్లో నియమించిన వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు, వందలాది ప్రయాణీకులు ప్రమాదాల్లో మరణిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే ప్రమాదాల్లో ఎక్కువమంది పేద, వలస కార్మికులే ఉంటున్నారని తెలిపారు.అయినా అంబానీ, అదానీలకు రైల్వే రంగాన్ని కారుచౌకగా కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ చూస్తోందని విమర్శించారు. రైల్వే ప్రయాణీకుల భద్రతను పటిష్టపర్చాలనీ, ఉద్యోగులకు సురక్షితమైన పని పరిస్థితులు కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణను అడ్డుకోవాలనీ, రైల్వే విస్తరణ, భద్రత కోసం అవసరమైన నిధులను కేటాయించి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
రైల్వేలో ప్రయివేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES