సమాజం అభివద్ధి పథంలో పయనించాలంటే ప్రజలు విద్యావంతులు కావాలి. అందుకు విద్య ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి. అది వారికి అర్థమయ్యే భాషలో ఉండాలి. ప్రజలు తాము మాట్లాడే భాషలో రాయడానికి, చదవడానికి అనుకూలతలు ఉండాలి. తమ అంతర్గత భావాలను రమణీయంగా పదంగానో, పాటగానో… ప్రక్రియ ఏదైనా కానీ వెలువరించగలిగే స్వేచ్ఛ ఉండాలి. అందుకోసం అహర్నిశలు పాటుపడిన మహౌన్నతమూర్తి, ప్రజల మనిషి, ప్రజాకవి కాళోజీ.
తెలంగాణ భాష, యాసను తన అణువణువు నింపుకోవడమే కాదు, ఆయన రచనల్లోనూ ప్రతిఫలింపజేసిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు. వారి 100వ జయంతి సందర్భంగా తెలంగాణ భాష, సంస్కతుల పరిరక్షణ భూమికగా ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 9 వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా 2014 నుండి జరుపుకుంటున్నాము.
”తెలంగాణ భాష అంతా ‘తౌరక్యాంధ్ర ‘ మని ఎవడో అన్నడు. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష? ఇక సహించవద్దు. అందుకనే నేను గిట్లనే మాట్లాడ్త, గిట్లనేరాస్త అని జిద్దుకు రాయాలె. జిద్దేంది అసలు మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్లల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషల్నన్న నువ్వు రాసే ధైర్నం జేయి. మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలె. దానికి బాస చాన ముఖ్యమయింది. ఎవని యాసల, ఎవని భాషల వాడు రాయాలె. తెలుస్తదా అన్నది లేనేలేదు” అని మన భాషని బతికించుకోవడం కోసం ఉద్యమించిన కాళోజీ, మహాకవి దాశరథి అన్నట్లుగా తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం”. ఆయన రాసేది కవితైనా, కథయినా అందులో ప్రతిధ్వనించేది తెలంగాణ ప్రజల గుండెచప్పుడు. జన సందోహంలోంచి పుట్టుకొచ్చిన అందమైన శబ్దాలు కాళోజి కవిత్వమంతటా పరచుకొని ఉంటాయి.
కాళోజీ ఏం రాసినా, ఏం చేసినా ప్రజల గొడవే ఆయన గొడవ. ప్రజల భాషలో ప్రజల హదయాలను ప్రదర్శిస్తూ కదిలించిన కలం ఆయనకే సొంతం. ”అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతప్తి.
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి
అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు.. అంటూ సమస్యలకు ఎదురీదే తత్వాన్ని బోధించిన కాళోజీ తన మాటలు, చేతలు, రాతలద్వారా తరతరాలకు తరగని స్ఫూర్తిని అందించాడు. విషయం ఏదైనా నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రకటించగలిగే కాళోజీ ప్రజల భాషకు తానే ఒక పల్లకి అయి మోసాడు.
కాళోజీ వంటి కవులు, రచయితలు, భాషావేత్తల కషి ఫలితంగానే ప్రస్తుతం మనం జరుపుకునే ఈ తెలంగాణ భాషా దినోత్సవం. వారికి భాష పట్ల గల శ్రద్ధ, అవిరామ శ్రమ, పట్టుదలల ఫలితంగానే పాఠ్యపుస్తకాలలోనూ, సాహిత్యంలోనూ పెనువిప్లవాలు ఉద్భవించాయి. అమ్మ ఒడి నుంచి సాహిత్య శిఖరం అంచుల వరకు తెలంగాణ భాష ఎగబాకుతూ ప్రజలందరికీ చేరువయ్యింది.
తెలంగాణ నుంచి ఒకరు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఒకరు, రాయలసీమ వైపు నుండి మరొకరు ఒకచోట కూడి తెలుగులో మాట్లాడుకుంటే ఒక్కొక్కరు మాట్లాడే తీరు ఒక్కోలాగా ఉంటుంది. అంతా తెలుగే. కాకపోతే ధ్వని ఉచ్చారణ, పదాల ఎంపిక, వాక్య నిర్మాణం, ఊనిక, స్వరంలో విభిన్నత గోచరిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్న సందర్భంలో వారి మాటల్లోనూ వ్యత్యాసం గమనించవచ్చు. భాష సహజత్వానికి నిదర్శనాలే ఇవన్నీ. సమానధర్మం అనేది మాత్రం ఒకటి ఉంటుంది. అందువల్ల ఏ జీవద్భాషలోనూ నూటికి నూరుపాళ్ళు ఏకరూపత ఉండదు. భాషను గురించి సరిగ్గా తెలియని వాళ్లే తాము మాట్లాడేదే సిసలైన భాష అని అహంభావాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ ఒకే భాషలో అంతర్భాగాలుగా వివిధ మాండలికాలు, యాసలు వర్ధిల్లుతూనే ఉంటాయి. అందుకే భాషా వివక్షలను, భేషజాలను వదిలిపెట్టి ఎవరి భాషను వారు పుష్టిమంతం చేసుకోవడం ఉత్తమం. వ్యక్తుల నుండి గాని, రచయితల నుండి గాని సహజమైన సజనాత్మక శక్తి బయటకు రావడానికి సహజ వాగ్వ్యవహారంగా ఉన్న జీవద్భాష ప్రధానపాత్ర పోషిస్తుంది.
భాష మానవుడికి గల అమూల్యమైన శక్తి. బహుళ ప్రయోజనకారి. భాషతో జాతి ముందుకు పోతుందనేది నిర్వివాదమైన అంశం. పలికినట్లే రాయగల ప్రత్యేకత కలిగిన మన తెలంగాణ భాషను మంచి సమాజం కోసం, మానవతా పరిమళం విరజిమ్మే వ్యవస్థ కోసం పలుకుబడుల భాషగా మలచుకోవడమే తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీకి మనమిచ్చే నివాళి.
డా. ఉప్పల పద్మ, 9959126682