పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. ఈపాప టాలెంట్ చూస్తే మతిపోవాల్సిందే. ఐదు నెలల వయసులోనే అద్భుతాలు సష్టిస్తుంది. అమ్మానాన్నలను గుర్తుపట్టాల్సిన సమయంలో అన్నీ గుర్తు పట్టేస్తుంది. ఆట బొమ్మలతో ఆడుకోవలసిన వయసులో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే అన్ని నేర్చేసింది. పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఈ పాప టాలెంట్ చూస్తే తెలుస్తుంది.
బిడ్డ మారాం చేయడాన్ని ఆపడం కోసం తల్లి చేసిన చిన్న ప్రయత్నం ఆ చిన్నారిలోని అద్భుత జ్ఞాపకశక్తిని వెలికి తీసింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన దెందె సుస్మిత, ప్రవీణ్ దంపతులు తమ నాలుగు మాసాల రియాన్షి ఆడించడం కోసం తల్లి వివిధరకాల కూరగాయలు, జంతువులు, జాతీయ నాయకుల ఫొటోలు, వివిధ రకాల పండ్లు, పలు దేశాల పతకాలను చూపిస్తూ, వాటి పేర్లు చెబుతూ ఆడించడం అలవాటు చేసింది. కొన్ని పేర్లు చెబితే వాటిని పట్టుకునేది. పాపకు ఉన్న జ్ఞాపకశక్తిని గుర్తించి మరిన్ని కొత్తరకం బొమ్మలను చూపిస్తూ వీడియో తీసి మిత్రులకు పంపేవారు. వారి సూచన మేరకు యూట్యూబ్లో పెట్టారు. ఆ వీడియోలను అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు చేయాలని పంపారు. వీడియోలు చూసిన నిర్వాహకులు రియాన్షీని సూపర్ టాలెంటెడ్ కిడ్‌గా గుర్తించి అవార్డు, మెడల్ తో పాటు లైవ్ నోబెల్ అవార్డు గుజరాత్ అందజేశారు. ప్రస్తుతం పాప రియాన్షీ వయస్సు 23 నెలలు. కనీసం మాటలు కూడా పూర్తిగా రావు. అయినా నాలుగు సంవత్సరాల వయసులో చదవాల్సిన క్లామ్ జాయి బుక్స్‌ను అవలీలగా మనం అడిగిన 20 రకాల కేటగిరీల 360 ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టేస్తుంది. చిన్నారి జ్ఞాపకశక్తి గురించి తెలుసుకున్న స్థానికులు, బంధు మిత్రులు అభినందించారు.
గర్భవతిగా అధ్యయనం
‘నా ఫ్యామిలీలో అంతా నెగిటివ్ సిచ్యువేషన్ ఉండే. నాకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే దాన్ని. ప్రెగెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తే పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుదల, భవిష్యత్తు ఎదుగుదల ఉంటుందని యూట్యూబ్లో సెర్చ్ చేసి వందల వీడియోలు వినేదాన్ని. డాక్టర్స్ సలహాలు, ఇతర కిడ్స్ టాలెంట్ వీడియోలు వింటూ కాలం గడిపే దాన్ని. డెలివరీ సమయంలో నాకు కావాల్సిన మెటీరియల్ అంతా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను’ అంటుంది సుస్మిత.
తల్లి ప్రయత్నం భవితకు బాటలు
సుస్మిత తనకున్న విద్యా పరిజ్ఞానం, సమాజం పట్ల అవగాహన, పిల్లల పట్ల జాగ్రత్త, ముందుచూపుతో వారి పాప భవిష్యత్తుకు బాటలు వేసింది. కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవడం గొప్ప విజయం. అలాంటి ప్రయత్నం చేసింది సుస్మిత. మూడు నెలల వయస్పులోనే ఆ పాపకున్న అద్భుత గ్రహణశక్తిని తల్లి గుర్తించింది. ఆ టాలెంట్‌ని మరింత పెంపొందించేందుకు వివిధ రకాల ఫ్లాష్ కార్డ్స్ ప్రయత్నించింది. ఎలాగైనా తమ పాప ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని రియాన్షీ ఫ్లాష్ కార్డులు గుర్తించడంలోని అద్భుతాలను వీడియోలో చిత్రీకరించి, గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, సూపర్ టాలెంట్ కిడ్ పోటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘సూపర్ టాలెంటెడ్ కిడ్’గా ఆ చిన్నారి గుర్తించబడింది. నోబుల్ వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్‌కు కూడా ఎలిజిబుల్ అవ్వడమే కాకుండా అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ చిన్నారి ఇంత చిన్న వయస్సులోనే ఇంతటి ప్రతిభను కనపర్చటం, ఈ అవార్డు దక్కటం తమకు ఎంతో తప్తినిచ్చిందంటారు.
తల్లి సుస్మిత పాపను భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకునే దిశగా శిక్షణ ఇప్పించి, ఆమె బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామంటారు.
ఇప్పుడే ఇలా భవిష్యత్తులో మరెలాగో
వయస్సు, అనుభవంతో సంబంధం లేదు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని రుజువు చేసింది చిన్నారి రియాన్షీ.
ఆమె జ్ఞాపకశక్తి పెరుగుదల, భవిష్యత్తు ఏ ఉన్నతమైన స్థానంలో ఉంటుందో మనం ఊహించలేం.. ఆమె టాలెంట్‌కు అనుగుణంగా సలహాలు సూచనలతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తగిన శిక్షణ, నైపుణ్యం, విద్యను అందించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు.
5 సంలోపు మెదడుకు పదును పెట్టాలి
ప్రతి బిడ్డ పుట్టిన నాటి నుండి ఐదు సంవత్సరాలలోపు బ్రెయిన్ ఎదుగుదల ఉంటుంది కాబట్టి మంచి అలవాట్లు, విద్యా, మంచి లక్షణాలు అందించగలిగితే పిల్లలు ఎలాంటి విజయాన్నైనా ఈజీగా సొంతం చేసుకుంటారు అని నిరూపించింది రియాన్షీ. ప్రతి తల్లి సుస్మితలా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గడగోజు రవీంద్ర చారి, 9848772232