బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను సస్పెండ్ చేయడం, తర్వాత ఆమె రాజీనామాతో మరోసారి ప్రాంతీయ పాలక పార్టీల తీరుతెన్నులు చర్చలోకి వచ్చాయి. నిజానికి ఈ చర్చ మే నెలలోనే మొదలైంది. కెేసీఆర్‌కు కవిత రాసిన లేఖ అమెరికాకు బయలుదేరు తుండగా లీక్ కావడం ఇందులో మొదటి ఘట్టం. తిరిగొచ్చాక మొదట రాసిన దాన్ని మించి సంచలన విషయాలు చెప్పి షాకిచ్చారు.తమ పార్టీని బీజేపీతో విలీనం చేయడానికి పార్టీలో కీలకవ్యక్తులు కుట్రపన్నారని వెల్లడించారు. లిక్కర్ కుంభకోణంలో తాను జైలులో ఉన్నప్పుడే ఈ విషయం దష్టికి వచ్చిందని, తను అడ్డుకున్నానని ఆమె అప్పుడు చెప్పారు. ఈ అంశం పార్టీ అధినేత దష్టికి తీసుకురావడానికి తాను రాసిన అంతర్గత లేఖను లీక్ చేయడం కూడా కుట్రలో భాగమని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్ దేవుడేనని కానీ చుట్టూ దెయ్యాలున్నాయని తీవ్రభాషలో మాట్లాడారు. రజతోత్సవ సభలో కెేసీఆర్ బీజేపీపైన రెండు నిమిషాలు మాత్రమే చెప్పి కాంగ్రెస్ ఏకైక విలన్ అని ప్రకటించడం ముందే సందేహాలు పెంచగా కవిత ఆరోపణలు దాన్ని మరింత వేడెక్కించాయి. ఆమె మాటలపై వెనువెంటనే కేటీఆర్ ముక్తసరిగా, అదే సమయంలో కచ్చితంగా వ్యతిరేక దిశలోనే మాట్లాడారు తప్ప మళ్లీ ఎలాంటి బహిరంగ స్పందన రాలేదు. అప్పటి నుంచి ఆమెకూ పార్టీకి మధ్య దూరం పెరిగిందే గాని తగ్గింది లేదు. తనకున్న ఒకటి రెండు పదవులు పార్టీ వేరేవారికి కేటాయిం చడం, ఆమె తన జాగృతి వేదికకే పరిమితం కావడం జరుగుతూ వచ్చింది.
ఆరోపణల నిర్ధారణ
ఇలాంటి తరుణంలో కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్, హరీశ్‌రావు తదితరులపైన వచ్చిన ఆరోపణలను సిబిఐకి నివేదించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించడంతో కవిత మరోసారి బహిరంగ విమర్శలు సంధించారు. హరీశ్‌రావు చేసిన తప్పులను కేసీఆర్ ఎప్పుడో గుర్తించారనీ, అందుకే రెండవసారి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టి ఆలస్యం చేశారని వ్యాఖ్యానించారు. హరీశ్ వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, బీజేపీతోనూ టచ్‌లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అయితే మేనెలలో వలె ఈసారి ఆమె బీజేపీని ప్రస్తావించింది దాదాపు లేదు.తనపై ఆక్రమ కేసు పెట్టారని అనడం తప్ప కేంద్రం వేధింపుల వంటి మాటలు మాట్లాడలేదు. కేసీఆర్‌పౖౖె సిబిఐ దర్యాప్తు అంటే తెలంగాణ భగ్గుమనలేదని, బంద్‌కు పిలుపివ్వలేదని విమర్శించారు. మే నెలలో ఆమె దాడి కేటీఆర్‌పై ప్రధానంగా జరిగితే ఈ దఫా హరీశ్‌ను, మాజీ ఎంపీ సంతోష్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.ఆ వెంటనే ఆమెపై సస్పెన్షన్ వేటువేయడం, మరుసటి రోజునే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా ప్రకటించడం జరిగిపోయాయి. ఇదంతా జరిగినప్పుడు లండన్‌లో ఉన్న హరీశ్‌రావు శుక్రవారం రాత్రి తిరిగిరాగానే ఇతరులు చేసిన ఆరోపణలనే ఆమె వినిపించారనీ, వాటిని తన విజ్ఞతకే వదిలేస్తున్నానని సరిపెట్టారు. హరీశ్ ఎప్పుడూ కేసీఆర్ నాయకత్వం గురించి మాత్రమే మాట్లాడటం కూడా గమనించదగ్గదే. ఇక కేటీఆర్,అలాగే అధికారిక ప్రతినిధులు, నాయకులూ తాము హరీశ్‌తోనే ఉన్నామని సంకేతాలతో కవితపై ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ నోరు మెదపని కేసీఆర్ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలపై కేంద్రీకరించాలని పార్టీ వారికి చెప్పినట్టు సమాచారం. జాగృతి పేరుతో కూడా కొందరు కవిత వైఖరి సరికాదని విమర్శిస్తుంటే, కేటీఆర్ జాగృతి కార్యకర్తలను చేర్చుకునే ప్రక్రియ ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుల పేరుతో కొంతమంది మొదటి దఫా కవితకు మద్దతుగా మాట్టాడితే ఇప్పుడు మాత్రం హరీశ్‌పై దాడిని ఖండిస్తున్నారు. వారి కుటుంబ తగాదాలు తమకు ఆపాదించవద్దని ముఖ్యమంత్రితో సహా పాలక నేతలు ఎదురు వడ్డిస్తుంటే, బీజేపీ నేతలు, కేంద్రమంత్రులూ సిబిఐ విచారణకు సిద్ధమని చెప్పే బదులు ప్రభుత్వం రాసిన లేఖ సమగ్రంగా లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాహుల్‌గాంధీ సిబిఐని మోడీ చేతిపనిముట్టుగా తిట్టిపోస్తుంటే మీరెలా దాని దగ్గరకు వెళతామంటున్నారని కెేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్, హరీశ్‌లు సిబిఐ విచారణకు వెళ ్లకుండా ఆపాలని హైకోర్టులో ఒకటికి రెండుసార్లు కేసులు వేసినా కోర్టు తోసిపుచ్చింది.
బీజేపీ పేరెత్తలేదే?
కవిత వ్యాఖ్యలు కొత్త ప్రశ్నలు తీసుకువచ్చాయి. దేవుడైన కేసీఆర్ దెయ్యాలను ఎందుకు చుట్టూ పెట్టుకున్నారు? హరీశ్‌రావు లేదా మరెవరు తప్పుచేసినా ప్రభుత్వాధినేతగా ఆయనే బాధ్యత వహించాలి కదా? ఆయన ఏమీ చేయలేదనుకుంటే కవిత ఎందుకు మౌనంగా ఉన్నారు? నీటిపారుదలశాఖలో తప్పు చేస్తే ఆలస్యంగా నైనా ఆర్థిక శాఖ ఇవ్వడం ప్రమోషనేకదా? ఆయనకు ఎంతో ప్రియమైన కుమార్తెగానే గాక ఎంపీగా పనిచేసి ఎమ్మెల్సీగా కూడా ఉన్న కవిత తమ హయాంలో తప్పు జరిగిందని అంగీకరించినట్టే కదా? గతంలో దీనిపై ఇంత చర్చ జరిగినా, నష్టం కలిగినా ఎందుకు నోరువిప్పలేదు? ఇప్పుడు అంతర్గతంగా తను కోరుకున్నది జరగలేదు గనకే వీటిని ముందుకు తెచ్చారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. తనపై ఇంత కుట్ర జరిగినా అన్నగా లేదావర్కింగ్ ప్రెసిడెంటుగా కేటీఆర్ కనీసం పలకరించలేదని, ఆయన కూడా హరీశ్ కుట్రకు గురికావలసి వస్తుందని హెచ్చరిస్తున్న కవిత, అన్నీ ఆరోపించి జై కేసీఆర్ అంటూ ముగించడం కొసమెరుపు. ఆమె వ్యూహం ఏమైనా కావచ్చు గాని దీనివల్ల తనే అస్పష్టతకు అవకాశమిచ్చారు. పైగా బీజేపీతో విలీనమంటూ గతంలో లేఖ రాసిన ఆమె ఇప్పుడు ఆ ఊసే తీసుకురాలేదు. రేవంత్ రెడ్డిపైనే కుట్ర ఆరోపణ చేయడం మరో విశేషం. మేము చెప్పిన మాటలే ఆమె చెప్పారని బీజేపీ నేతలు బల్లగుద్ది చెబుతుంటే, కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్ కుమార్తెనే అవినీతి జరిగిందని అంగీకరించారు కదా అని ఎదురుదాడి చేస్తున్నారు. ఇతరులు చేసిన ఆరోపణనే కవిత వినిపించిందని హరీశ్ స్వయంగా వ్యాఖ్యానించడం కూడా ఇందుకు తగినట్టే ఉంది. ఇదంతా ఒక కుటుంబ ప్రహసనమనీ, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమనే మాట కూడా బలంగానే వినిపిస్తున్నది. రాజీనామా చేసిన కవిత తాను ప్రజాజీవితంలోనే ఉంటానంటూ స్పష్టమైన సమాధానం దాటేస్తున్నారు. ఓటమి, ఎమ్మెల్యే నిష్క్రమణలు, కుటుంబ కలహాలు, ప్రభుత్వ విచారణలతో ఉక్కిరి బిక్కిరవుతున్న బీఆర్‌ఎస్‌కు ఇది గోరుచుట్టమీద రోకటిపోటులాంటిదేననడం నిస్సందేహం. కానీ ఆ పార్టీ నాయకులెవరూ రేవంత్ ప్రభుత్వాన్ని తప్ప బీజేపీపై చిటికెంత తీవ్రవిమర్శ చేయడానికి సిద్ధపడకపోవడం మాత్రం వాస్తవం.
ప్రాంతీయ పాలకుల విన్యాసాలు
మరోవైపున రేవంత్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి తమపై కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ చెబుతుంటే ఆ పార్టీ నాయకులు జగన్‌తో కలసి వ్యవహరిస్తున్నారని టీడీపీ దాన్ని బలపర్చే మీడియా వాదనగా ఉంది.ఇంకోవిధంగా వైఎస్ కుటుంబంలో జగన్, షర్మిల మధ్య వచ్చిన వివాదాలను పోల్చి మాట్లాడటం జరుగుతున్నది.షర్మిల మొదట వైఎస్‌ఆర్‌టీపీ పెట్టి సరిగ్గా ఎన్నికల తరుణంలో అటూ ఇటూ ఊగిసలాడి చివరకు కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. ఆ తర్వాత ఏపీకి కార్యక్షేత్రం మార్చారు. ఎన్నికల్లో రాజకీయంగా పెద్ద ప్రభావం చూపింది లేదుగానీ చెల్లెలే విమర్శ చేయడమన్నది ఏపీ ఎన్నికల్లో బాగా ప్రచారం పొందింది. ప్రతికూల తీర్పునకూ అదీ ఒక కారణమై ఉండొచ్చు. వాస్తవానికి కుటుంబ విషయాలు తెచ్చి కాంగ్రెస్ పెరుగుదలను పక్కదోవ పట్టిస్తున్నారని కొంతమంది ఏపీ నేతలు ఫిర్యాదు చేశారనేది తెలిసిందే. ప్రాంతీయ నేతల కుటుంబాల్లో ఆస్తులు, అధికారాల పంపిణీల్లో తేడాలు ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకూ చూస్తున్నవే. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్నాటక, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర ఇలా చాలాచోట్ల చాలా ఉదాహరణలున్నాయి.వీటికి విధానాలు, ప్రజాప్రయోజనాల కంటే వ్యక్తిగతంగా తమకు పదవులు దక్కలేదన్న అసహనం, మరొకరికి ఎక్కువలాభం జరిగిందనే ఉక్రోశం కారణమవుతుంటాయి.
కుటుంబ సభ్యులైనంత మాత్రాన రాజకీయాల్లో పాల్గొనరాదని ఎవరూ అనరు. విధానాల పరంగా వేర్వేరు రాజకీయాలతో పనిచేయవచ్చు కూడా, కానీ బంధుత్వాల ఆధారంగానే ప్రజలిచ్చిన అధికారంలోనో లేదా ఆర్థిక ప్రయోజనాల్లోనో పెద్దపీట కావాలనే పేచీలు ప్రజలకు సంబంధం లేనివి. ఆయా ప్రాంతీయ పార్టీలను నిలబెట్టే ఆర్థిక, సామాజికశక్తులు కొన్ని వ్యతిరేకంగా మారినప్పుడు ఆ పార్టీలు చీలిపోవడం లేదా కలహించుకోవడం చూస్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చి ముప్పయి ఏండ్లు పూర్తయితే ఇప్పుడు లోకేశ్ నాయకత్వం గురించి బహిరంగంగానే సంకేతాలివ్వడం జరుగుతున్నది. జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కీలకపాత్రలు చేపట్టడం తెలిసిందే.కాంగ్రెస్ వంటి జాతీయపార్టీలోనూ ఈ లక్షణాలు ఉన్నా అనేక ఇతర కోణాలు పనిచేస్తుంటాయి. నెహ్రూ కుటుంబంలో రాజీవ్‌గాంధీ ప్రధాని కావడం కూడా ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలోనే సాధ్యమైనా తర్వాత సోనియాó, రాహుల్‌గాంధీలు ప్రభుత్వాల సారథ్యం తీసుకోలేదు, నిర్ణయాత్మక నేతలుగానే ఉన్నారు.
ఆచరణే గీటురాయి
ఇతరులను కుటుంబ పార్టీలుగా తిట్టిపోసే బీజేపీలోనూ వారసత్వాల జాబితా పెద్దదే. ఆయా పార్టీల్లో తలదూర్చి రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో తన పట్టు పెంచుకోవడం దాని వ్యూహం. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ యువనాయకులతో ఎక్కువగా కలసి వ్యవహరిస్తుంటారు. ఆ పైన కేసుల ప్రయోగం మరొకటి, ఏమైనా పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం కాపాడు కోవలసింది ఆ పార్టీల నాయకులూ శ్రేణులే. బీఆర్‌ఎస్ అంత ర్గత వివాదాల్లోనూ ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఇందులో బీజేపీ/ కేంద్రం తెరవెనక నిర్వహించే పాత్రేమిటో త్వరలో తెలియకపోదు. ఎందుకంటే తెలంగాణలో మూడు పార్టీలూ తక్కిన ఇద్దరూ బీజేపీతో కుమ్మక్కయినట్టు ఆరోపిస్తుంటాయి. ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలదీ అదే పరిస్థితి. కనుకనే తెలుగునాట ప్రాంతీయ పార్టీలేవీ బీజేపీ మతరాజకీయాలను సూటిగా ఎదుర్కొనే పరిస్థితి లేదు. కవిత కూడా గతంలో వలే ఇప్పటికైతే బీజేపీ పేరెత్తడం లేదు. ఈ అంతర్గత బహిరంగ యుద్ధాలు చివరకు ఏ మలుపు తీసుకునేది ఆచరణలో చూడవలసిందే. కానీ ఇలాంటివాటితో విశ్వసనీయతకు విఘాతం అనివార్యమే. లౌకిక ఎజెండాతో తమ రాష్ట్రాల ప్రజల హక్కుల కోసం నిలబడితేనే ఏపార్టీకైనా, నాయకులకైనా సార్థకత సాధ్యం.
తెలకపల్లి రవి
బీఆర్‌ఎస్ కలహాలు, అదృశ్య కారణాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES