- 20వ రోజుకు చేరినా స్పందించని ఛత్తీస్‌గఢ్ సర్కారు
- రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఆటంకం
- బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో డిమాండ్ల సాధన కోసం నిరసన చేపట్టిన జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకున్నది. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఎంలో పని చేస్తున్న 14వేల మంది కాంట్రాక్టు సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం కూడా విదితమే. అయినప్పటికీ అక్కడి బీజేపీ సర్కారులో మాత్రం ఎలాంటి చలనమూ కనబడటం లేదు. దీంతో రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. విద్యా సంస్థలలో వైద్య పరీక్షలు జరగటం లేవు. ఫలితంగా రోగులు, రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూస్తోంది. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోని బీజేపీ
కాగా 25 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అక్కడి బీజేపీ సర్కారు ఉత్తర్వుల్విటం, ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న 14 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించటం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం విదితమే. కాగా న్యాయబద్ధమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉద్యోగులు ప్రారంభించిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు గత నెల 18న ఆందోళన ప్రారంభించారు. తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలనీ, మెరుగైన వేతనాలు అందించాలనీ, ఇతర ప్రయోజనాలు కల్పించాలని వారు ప్రధానంగా కోరుతున్నారు. ఉద్యోగుల పది డిమాండ్లలో నాలుగింటిని ఎన్‌హెచ్‌ఎం ఎగ్జిక్యూటివ్ కమిటీ గత నెల 13న ఆమోదించిందని అధికారులు చెబుతుండగా.. నిర్దిష్ట చర్యలేవీ తీసుకోలేదని ఉద్యోగ సంఘం ఆరోపించింది. సమ్మెను కొనసాగించాలన్న యోచన తమకేమీ లేదనీ, అయితే ప్రభుత్వం చర్చలకు అవకాశం కల్పించడం లేదని ఉద్యోగాన్ని కోల్పోయిన హేమంత్ కుమార్ సిన్హా చెప్పారు. కాంట్రాక్ట్ ఆరోగ్య కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని 2023 శాసనసభ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చిందని ఎన్‌హెచ్‌ఎం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అమిత్ మిరి గుర్తు చేశారు. ఇది ప్రధాని మోడీ ఇచ్చిన గ్యారంటీ అని కూడా చెప్పారని తెలిపారు.
చేష్టలుడిగి చూస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం : కాంగ్రెస్
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన తర్వాత కూడా తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని డాక్టర్ మితి వాపోయారు. ఈ కాలంలో ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు 160కి పైగా వినతి పత్రాలు అందించామని చెప్పారు. దీంతో విధిలేని పరిస్థితులలో నిరసన చేపట్టాలని 16 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నిర్ణయించారనీ, సమ్మె కొనసాగిస్తున్నామని తెలిపారు. కాగా ఉద్యోగుల సమ్మె విషయంలో ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందనీ, నిరసనకారులపై లాఠీఛార్జీ చేయిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తోందని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. వారి డిమాండ్లను నెరవేర్చాలని తెలిపింది.