సీనియర్ టీచర్లకు రక్షణ కల్పించాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐదేండ్ల పైబడి సర్వీసున్న టీచర్లందరూ రెండేండ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉత్తీర్ణులు కాకుంటే ఉద్యోగాన్ని వదులుకోవాలన్న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షిం చాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. సర్వీసులో ఉన్న సీనియర్ టీచర్ల ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని విన్నవించింది. ఆదివారం ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటికే నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం పదోన్నతి పొందాలంటే టెట్ అవసరమా? లేదా? అనే వివాదంపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మైనారిటీ విద్యా సంస్థల్లో నియామకాలకు టెట్ తప్పనిసరా? కాదా? అనే అంశంపై మహారాష్ట్రకు సంబంధించిన కేసుతోపాటు, ప్రమోషన్ల విషయంలో తమిళనాడు ఉపాధ్యాయుల కేసులను కలిపి విచారించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ ఒకటో తేదీన వెలువరించిన తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు నష్టదాయకంగా మారింది. ఉపాధ్యాయుల భవిష్యత్తు పట్ల సందిగ్ధత నెలకొన్నది. మైనారిటీ విద్యా సంస్థల కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన న్యాయమూర్తులు మైనారిటీ యేతర విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు సంబంధించి ఇంతటి కఠినమైన తీర్పును ఇవ్వడం విచారకరం. 20 ఏండ్ల నుంచి సర్వీసు చేస్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ ఉత్తీర్ణులు కావాలనడం భావ్యం కాదు. 2011 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ ఏర్పాటు అనంతరం 2015 లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనలు రూపొందించిన ఉత్తర్వుల్లో 23.08.2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత మినహాయించినట్టు స్పష్టంగా ఉంది. దీంతోనే 15 ఏండ్లుగా టెట్ రాయాలనే ఆలోచన ఉపాధ్యాయులకు రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా రెండేండ్లలో టెట్ పాస్ కావాలంటే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో 23.08.2010 తర్వాత నియామకమైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలనీ, అంతకు ముందు నియామకమైనవారికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
టెట్‌పై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES