నవతెలంగాణ – పరకాల
పరకాల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంలోని రైతు వేదిక వద్ద ఆదివారం ఉదయం దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. యూరియా కోసం భారీగా రైతులు తరలివచ్చి పొడవాటి క్యూలలో నిలబడవలసి వచ్చింది. ఈ క్రమంలో ఓ కుటుంబం జ్వరంతో బాధపడుతున్న తమ ఇద్దరు చిన్నారులను వెంట తీసుకొని ఉదయం 6 గంటలకే క్యూ లో నిలిచే దుస్థితి ఏర్పడింది. గంటల తరబడి లైన్లో ఉప్పటికీ, యూరియా బస్తాలు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్య మధ్యలో తల్లి అస్వస్థతతో ఉన్న తన చిన్నారులకు జ్వరం సిరప్ తాగిస్తు తిరిగి లైనులో నిలబడుతున్న పరిస్థితి రైతుల హృదయాలను కలచివేసింది.
ఇందుకు సంబంధించి నడికూడ మండలం ధర్మారం గ్రామానికి చెందిన బాషిక రాణి-రాజన్న దంపతులు జ్వరం కారణంగా అస్వస్థతతో ఉన్న రెండు సంవత్సరాల చంటిబిడ్డ, 8 సంవత్సరాల కుమారుడితో కలిసి సోమవారం ఉదయం పరకాల రైతు వేదిక వద్ద ఏర్పాటుచేసిన యూరియా పంపిణీ కేంద్రం వద్దకు రావడం జరిగింది. పిల్లలని చెట్టు కింద వదిలేసి తల్లిదండ్రులు ఇరువురు క్యూలైన్లో నిలబడ్డారు. గంటలు గంటలు వేచి చూసిన తమ వంతు రాకపోగా ఓవైపు మధ్య మధ్యలో చంటి పాపకు పాలు పడుతూ, జ్వరం సిరప్ అందిస్తున్న తీరు పలు హృదయాలను కలిచివేసింది.
గత నాలుగు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని ఎట్లాగైనా యూరియా దొరకక పోతుందా అని ఈరోజు పిల్లలతో సహా వచ్చామంటూ వారు నవతెలంగాణతో వాపోయారు. అవసరం మేరకు అందాల్సిన యూరియా ఇలా క్యూ లైన్లు కట్టి తీసుకోవాల్సి రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి రైతుల అవసరం మేరకు యూరియా పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.