నవతెలంగాణ – కంఠేశ్వర్
3 ఏళ్ల చిన్నారికి శస్త్రచికిత్స లేకుండానే అరుదైన గుండె ప్రొసీజర్ నిర్వహించి, రంధ్రం మూసివేసి పాప ప్రాణాలను మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు కాపాడారు. ఈ మేరకు సోమవారం నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు.
నిజామాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు మరో ప్రాణరక్షక విజయాన్ని నమోదు చేశారు. కేవలం 3 సంవత్సరాల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని (పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్ – పిడిఏ) ఎటువంటి శస్త్రచికిత్స చేయకుండా, ప్రత్యేక పరికరం (డివైస్ క్లోజర్) సహాయంతో విజయవంతంగా మూసివేశారు. ఈ విధానం నిజామాబాద్‌లో తొలిసారిగా అమలు చేయబడటం విశేషం. ఈ చికిత్సను సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ సదానంద రెడ్డి, డాక్టర్ సందీప్ రావు విజయవంతంగా పూర్తి చేశారు.
డాక్టర్ సదానంద రెడ్డి మాట్లాడుతూ..పుట్టిన వెంటనే సహజంగా మూసుకుపోవాల్సిన చిన్న రక్తనాళం మూసుకుపోకపోతే దానిని పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్ (పిడిఏ) అంటారు. దీని వల్ల పిల్లల్లో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, గుండెపై భారం వంటి సమస్యలు వస్తాయి. గతంలో దీని కోసం ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే ఉండేది. అయితే, ఇప్పుడు డివైస్ క్లోజర్ పద్ధతితో శస్త్రచికిత్స అవసరం లేకుండానే సురక్షితంగా చికిత్స చేయవచ్చు. రోగి త్వరగా కోలుకోవడంతో పాటు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయి అని వివరించారు.
డాక్టర్ సందీప్ రావు మాట్లాడుతూ..ఈ విజయం నిజామాబాద్‌లోనే అధునాతన గుండె చికిత్సలు అందుబాటులో ఉన్నాయని నిరూపిస్తోంది. మా ఆసుపత్రిలో నలుగురు అనుభవజ్ఞులైన కార్డియాలజీ నిపుణులు గుండె సంబంధిత అన్ని రకాల చికిత్సలను అందిస్తున్నారు అని తెలిపారు. ఈ అరుదైన చికిత్స ఫలితంగా చిన్నారి పూర్తిగా ఆరోగ్యవంతమైందని వైద్యులు వెల్లడించారు. ఇది మెడికవర్ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యానికి, సేవాభావానికి నిదర్శనం.